Pandit Deendayal Upadhyaya: ప్రముఖ బాలీవుడ్ అన్ను కపూర్ ‘డర్, విక్కీ డోనర్, అతరాజ్’ చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడు. టీవీ షోస్ నిర్వహణతోనూ దేశ వ్యాప్తంగా అందరి మనసుల్నీ ఆకట్టుకున్నాడు. గతంలో ‘కాలాపానీ’ చిత్రంలో వీర సావర్కర్ గానూ, ‘సర్ధార్’ చిత్రంలో మహాత్మా గాంధీ గానూ నటించిన అన్ను కపూర్ ఇప్పుడు జనసంఘ నేత, స్వర్గీయ దీనదయాళ్ ఉపాధ్యాయ పాత్రను వెండితెరపై పోషించబోతున్నాడు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) ప్రచారక్ అయిన దీనదయాళ్ ఉపాధ్యాయ ఆ సంస్థ అధికారిక వారపత్రిక పాంచజన్యకు, దినపత్రిక స్వదేశ్ కు సంపాదకులుగా వ్యవహరించారు. అనంతరం భారతీయ జనసంఘ్ లోకి ఆయనను పంపారు. ఏకాత్మ మానవతా వాదాన్ని రూపొందించిన దీనదయాళ్ ఉపాధ్యాయ జాతీయ స్థాయిలో నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో 1968 ఫిబ్రవరి 11న మొగల్ సరాయ్ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జగద్గురు ఆది శంకరాచార్య, చంద్రగుప్త మౌర్య వంటి చారిత్రక పుస్తకాలను దీనదయాళ్ ఉపాధ్యాయ రాశారు. ఆయన వర్థంతిని కేంద్ర ప్రభుత్వం సమర్పణ దివాస్ గా జరుపుతోంది. ఇదిలా ఉంటే… ఇప్పుడు దీనదయాళ్ ఉపాధ్యాయ బయోపిక్ ను రంజిత్ శర్మ నిర్మించబోతున్నారు. హరీశ్ రెడ్డి నాగలమడక సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ఇటీవల మొదలైంది. ‘మై దీనదయాళ్ హు’ అనే పేరుతో రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న అన్ను కపూర్ మాట్లాడుతూ, ”నటుడిగా గర్వించే పాత్రలను పోషించే అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. మనసుకు ఇష్టమైన వ్యక్తుల పాత్రలను పోషించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ వయసులో నాకు దీనదయాల్ జీ పాత్రను పోషించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను” అని అన్నారు. రషీద్ ఇక్బాల్ రచన చేసిన ఈ సినిమాకు పవన్ కె.కె. నాగ్పాల్ దర్శకత్వం వహిస్తున్నారు.