సినీనటుడు పవన్ కళ్యాణ్ సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా పవర్ స్టార్ అని నిరూపించుకున్నారు. జనసేన పార్టీ పేరుతో పూర్తి స్థాయి రాజకీయాలలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంనియోజక వర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికయి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పన్నెండేళ్ళు అయిన సందర్భంగా ఆ పార్టీ ఆవిర్భావ వేడుకలను పిఠాపురంలో ‘జనసేన జయకేతనం’ పేరుతో శుక్రవారం రాత్రి భారీ ఎత్తున సభ నిర్వహించారు.
ఈ వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుండి జనసైనికులు భారీగా తరలివచ్చారు. వారినుద్దేసించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆకట్టుకుంది. పార్టీ కార్యకర్తలైన సైనిక్స్ లో సరికొత్త జోష్ నింపింది. ఇదిలా ఉండగా పవన్ స్పీచ్ కు ఆయన అన్నయ మెగా బ్రదర్, మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా మాట్లాడుతూ ‘ నా ప్రియమైన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి
మంత్రముగ్ధుడినయ్యాను. సభ కొచ్చిన అశేష జన సంద్రం లానే నా మనసు కూడా ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తి తో నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ ను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగా బ్రదర్స్ బాండింగ్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.