Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ఆరోగ్యానికి సంబంధించిన కీలక విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఆయన తన వ్యక్తిగత బ్లాగ్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నప్పటికీ, కోలుకునే ప్రక్రియ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో కష్టంగా ఉందని ఆయన ఈ బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆందోళనకు దారితీశాయి. అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో మాట్లాడుతూ.. “ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్యులు, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో శస్త్రచికిత్స, ఐసీయూ, ఆ తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగి రావడం జరిగింది. శారీరకంగా, మానసికంగా కొలుకునే ఈ దశ అత్యంత కష్టతరమైనది” అని పేర్కొన్నారు. అయితే ఆయనకు ఏ కారణంతో శస్త్రచికిత్స జరిగింది? ఏ చికిత్స చేయించుకున్నారు? అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.
ఆరోగ్య పరిస్థితి గురించి మాత్రమే కాకుండా జీవితంలో ఎదురయ్యే విజయాలు, అపజయాలపై కూడా అమితాబ్ తన ఆలోచనలను అభిమానులతో పంచుకున్నారు. ఒక రోజు ప్రతి విజేత కూడా ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందని, అలాంటి సమయంలో ధైర్యంగా ముందుకు సాగే వారే నిజమైన ఛాంపియన్లు అవుతారని పేర్కొన్నారు. గత విజయాల జ్ఞాపకాలకే పరిమితమైపోకుండా, కొత్త సవాళ్లను స్వీకరించాలని ఆయన సూచించారు. “ఏ మార్గమూ తప్పు కాదు. బాగుండండి… సంతోషంగా ఉండండి… అంతే” అంటూ తన సందేశాన్ని ముగించిన అమితాబ్, అభిమానులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆయన బ్లాగ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని పోస్ట్‌లు చేస్తున్నారు. 83 ఏళ్ల వయసులోనూ అమితాబ్ బచ్చన్ ఏమాత్రం జోరు తగ్గించకుండా సినిమాల్లో చురుకుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ‘కల్కి 2898 AD’ సీక్వెల్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. గత కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ, సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు, సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పటికప్పుడు దగ్గరగానే ఉంటున్నారు.

