బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ క్విజ్ షో “కౌన్ బనేగా కరోడ్‌పతి” తాజా ఎపిసోడ్‌లో పంజాబీ గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్ అతిథిగా పాల్గొన్నారు. ఆ ఎపిసోడ్‌లో దిల్జీత్ వేదికపైకి వచ్చి అమితాబ్ బచ్చన్ కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. సాధారణంగా భారతీయ సంస్కృతిలో పెద్దలకు నమస్కారం చేయడం గౌరవ సూచకం. కానీ ఈ చర్య ఇప్పుడు పెద్ద రాజకీయ, మత వివాదంగా మారింది.
Also Read : Tamannaah: సినిమాల నుంచి రియల్ ఎస్టేట్ దాకా..తమన్నా ఫైనాన్షియల్ సీక్రెట్ ఇదే!
ఖలిస్థానీ మద్దతుదారులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ 1984లో జరిగిన సిక్కుల మారణహోమానికి పరోక్షంగా మద్దతిచ్చారు, అటువంటి వ్యక్తి కాళ్లకు దిల్జీత్ నమస్కారం చేయడం సిక్కు సమాజానికి అవమానమని వారు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సంఘటన పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దిల్జీత్‌పై కూడా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నవంబర్ 1న జరగనున్న సిక్కుల స్మారక దినోత్సవం సందర్భంగా దిల్జీత్ దోసాంజ్ ప్రదర్శనను అడ్డుకుంటామని కొందరు తీవ్రవాద గ్రూపులు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ భద్రతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచనలో ఉందని వార్తలు వెలువడుతున్నాయి.
నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఆయనకు కూడా బెదిరింపులు ఉండే అవకాశం ఉన్నందున, కేంద్ర ఏజెన్సీలు ఇప్పటికే ఆయన సెక్యూరిటీ లెవెల్‌పై సమీక్ష జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో సోషల్ మీడియాలో దిల్జీత్ మరియు అమితాబ్ పేర్లు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చాయి. కొంతమంది నెటిజన్లు అమితాబ్‌ను రక్షిస్తుండగా, మరికొందరు ఆయనపై పాత ఆరోపణలను తిరిగి గుర్తుచేస్తున్నారు. మొత్తానికి ఒక్క నమస్కారం సున్నితమైన మతపరమైన వివాదానికి దారితీసింది.