హైదరాబాద్ సినిమా ప్రియులకు, ముఖ్యంగా మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌కు ఇదొక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్. సౌత్ ఇండియాలోనే మోస్ట్ ల్యావిష్ అండ్ ప్రీమియం మల్టీప్లెక్స్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘ఏఎంబీ సినిమాస్’, మరో సంచలన ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఏషియన్ గ్రూప్ ఈ క్రేజీ అనౌన్స్‌మెంట్‌ను వెలువరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (రెండు తెలుగు రాష్ట్రాల) లోనే ఏకైక ఐమాక్స్ స్క్రీన్‌గా సరికొత్త రికార్డు సృష్టించబోతూ ‘AMB క్లాసిక్ విక్టరీ’ మల్టీప్లెక్స్ సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రతిష్టాత్మక థియేట్రికల్ ప్రాజెక్ట్ వెనుక టాలీవుడ్‌కు చెందిన అత్యంత ప్రభావవంతమైన సినీ ప్రముఖులు మరియు ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. మహేష్ బాబుతో పాటు విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా(సురేష్ ప్రొడక్షన్స్) ఏషియన్ గ్రూప్ అధినేతలు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ సంయుక్తంగా ఈ భారీ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. గతంలో ఏఎంబీ మల్టీప్లెక్స్ ద్వారా సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి డాల్బీ సినిమా, బార్కో హెచ్‌డీఆర్ స్క్రీన్స్‌ను పరిచయం చేసిన ఈ టీమ్.. ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐమాక్స్ టెక్నాలజీని తీసుకువస్తోంది.
హైదరాబాద్ సినీ చరిత్రలో ఎన్నో రికార్డులకు, వసూళ్ల పండగలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ మ్యాజికల్ థియేటర్ అందుబాటులోకి రానుంది. ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘సుదర్శన్ 70MM’ థియేటర్ ప్రాంగణంలోనే ఈ సరికొత్త ‘AMB క్లాసిక్ విక్టరీ’ మల్టీప్లెక్స్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మాస్ హబ్‌గా పేరుగాంచిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఇలాంటి ఒక అల్ట్రా లగ్జరీ ఐమాక్స్ స్క్రీన్ రాబోతుండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ ప్రెజెంటేషన్ సిస్టమ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యున్నత విజువల్ క్వాలిటీ, మైండ్ బ్లోయింగ్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌తో కూడిన అధునాతన ఐమాక్స్ విత్ లేజర్ టెక్నాలజీని ఈ స్క్రీన్‌లో అమర్చబోతున్నారు. అత్యాధునిక లగ్జరీ ఇంటీరియర్స్, బెస్ట్ ఇన్ క్లాస్ సీటింగ్ మరియు ఇంటర్నేషనల్ వైబ్స్‌తో సరికొత్త సినిమా వీక్షణ అనుభూతిని అందించడానికి ‘AMB క్లాసిక్ విక్టరీ’ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుల గ్లోబల్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘వారణాసి’ విడుదలకు ముందే ఈ స్క్రీన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తుండటంతో, మన తెలుగు సినిమాను సరికొత్త ఐమాక్స్ లేజర్ స్క్రీన్‌పై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
