సినిమారంగాన్ని నమ్ముకుంటే ఏ నాడూ మన నమ్మకాన్ని వమ్ము చేయదని అంటారు. అలా సక్సెస్ చూసిన వారెందరో ఉన్నారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఏ.యమ్.రత్నం సినిమా తల్లి వంటిది. బిడ్డలను ఎప్పుడూ కాపాడుతుంది
అంటూ ఉంటారు. మేకప్ మేన్ గా, నిర్మాతగా, దర్శకునిగా తనదైన బాణీ పలికించిన ఏ.యమ్.రత్నం ఇప్పటికీ జనానికి వైవిధ్యం అందించాలనే తపనతోనే ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు
చిత్రం నిర్మిస్తున్నారాయన. గతంలో తన భారీ చిత్రాల ద్వారా జనాన్ని ఎంతగానో మెప్పించిన రత్నం హరిహర వీరమల్లు
తోనూ అలాగే సాగుతారని ఆయన చిత్రాలను అభిమానించేవారు ఆశిస్తున్నారు.
రత్నం పూర్తి పేరు అరణి మునిరత్నం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో 1956 ఫిబ్రవరి 4న జన్మించారాయన. చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఎంతో అభిమానం ఉన్న రత్నం, తెలుగునాట యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలను, అలాగే మద్రాసులో యమ్జీఆర్, శివాజీగణేశన్ సినిమాలను చూసి మురిసిపోయేవారు. సినిమా రంగం అనే అందాల ప్రపంచం ఆయనను ఆకర్షించింది. అప్పట్లో పేరున్న మేకప్ మెన్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన ఏ.యమ్.రత్నం తరువాతి రోజుల్లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పర్సనల్ మేకప్ మేన్ గా పనిచేశారు. విజయశాంతి ప్రోత్సాహంతో శ్రీసూర్యా మూవీస్ అనే బ్యానర్ నెలకొల్పారు రత్నం. తొలి ప్రయత్నంగా విజయశాంతి ప్రధాన పాత్రలో కర్తవ్యం
నిర్మించారు. ఆ సినిమా సంచలన విజయం సాధించింది. విజయశాంతికి జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా అవార్డు సంపాదించి పెట్టింది. తరువాత స్వీయ దర్శకత్వంలో పెద్దరికం
అనే సినిమాను నిర్మించి, తెరకెక్కించారు. ఆ సినిమా జగపతి బాబుకు నటునిగా మంచి పేరు తెచ్చింది. జగపతిబాబుతో రత్నం దర్శకునిగా రూపొందిన సంకల్పం
అంతగా అలరించలేక పోయింది. ఈ సినిమాతోనే ప్రకాశ్ రాజ్ తొలిసారి తెలుగులో నటించారు. రత్నం అనువాద చిత్రాలతోనూ తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నారు. జెంటిల్ మేన్, ప్రేమికుడు, ప్రేమలేఖ
వంటి చిత్రాలూ జనాన్ని కట్టి పడేశాయి. తరువాత శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ తో రత్నం నిర్మించిన ఇండియన్
తెలుగులో భారతీయుడు
గా వచ్చింది.ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో అనూహ్య విజయం సాధించింది.
అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ చిత్రాలను నిర్మిస్తూ స్టార్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు రత్నం. చిరంజీవితో స్నేహం కోసం
, పవన్ కళ్యాణ్ తో ఖుషి
, బంగారం
, జూనియర్ యన్టీఆర్ తో నాగ
చిత్రాలను నిర్మించిన ఏ.యమ్.రత్నం తమిళంలో అనేక సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మించారు. ఆ మధ్య గోపీచంద్ హీరోగా ఆక్సిజన్
నిర్మించారు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయింది. రత్నం తనయుల్లో పెద్దబ్బాయి జ్యోతికృష్ణ నీ మనసు నాకు తెలుసు
తో దర్శకునిగా పరిచయం అయ్యారు. రెండో అబ్బాయి రవికృష్ణ 7 జి బృందావన్ కాలనీ
తో నటునిగా మారారు. రత్నంలో మంచి గీత రచయిత కూడా ఉన్నాడని ఆయన పాటలు రాసిన జీన్స్, నాగ, ఒకే ఒక్కడు, బాయ్స్
నిరూపించాయి. ఇప్పటికీ సినిమా అంటే ప్రాణం పెట్టే రత్నం, పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు
పై అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు.