NTV Telugu Site icon

Ugram: ‘అల్లరి’ నరేశ్ కు అచ్చొచ్చిన నెలలోనే ‘ఉగ్రం’!

Ugram

Ugram

Allari Naresh: కొందరు హీరోలకు కొన్ని సీజన్స్ బాగా కలిసి వస్తాయి. అలానే మరి కొందరు హీరోలకు కొన్ని మాసాలు బాగా అచ్చి వస్తాయి. అలా ‘అల్లరి’ నరేశ్ కు మే ప్రథమార్ధం బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే… నరేశ్‌ మొదటి సినిమా ‘అల్లరి’ మే 10వ తేదీ 2002లో విడుదలై అతని ఇంటి పేరుగా మారిపోయింది. నరేశ్‌ తండ్రి ఇవీవీ సత్యనారాయణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘కితకితలు’ సినిమా సైతం నరేశ్‌ కు చక్కని విజయాన్ని అందించింది. ఈ మూవీ 2006 మే 5న జనం ముందుకు వచ్చింది. ‘అల్లరి’ నరేశ్‌ కు మ్యూజికల్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సీమటపాకాయ్’. పూర్ణ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నరేశ్ కెరీర్ లో అప్పటి వరకూ బిగ్గెస్ట్ హిట్! ఈ సినిమా 2011 మే 13న విడుదలైంది. ఈ సినిమాలన్నింటీలో నరేశ్ సోలో హీరోగా నటించాడు.

‘అల్లరి’ నరేశ్‌ కెరీర్ ను మరో మలుపు తిప్పిన సినిమా ‘మహర్షి’. మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో నరేశ్ అతని స్నేహితుడిగా ఓ కీలక పాత్రను పోషించాడు. ఈ మూవీ సక్సెస్ లో నరేశ్ క్యారెక్టర్ కూడా ప్రధాన భూమిక పోషించిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ సినిమా 2019 మే 9న విడుదలైంది. ఇలా నరేశ్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలన్నీ మే నెలలోనే వచ్చాయి. ఇప్పుడు అదే నెల 5న ‘ఉగ్రం’ వస్తోంది. సో… బాగా అచ్చివచ్చిన మే నెల ‘ఉగ్రం’కూ కలిసి వస్తుందేమో చూడాలి.