Shruti Haasan: ఈ యేడాది తెలుగులో సంక్రాంతి సీజన్ కు మొత్తం ఐదు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో ‘వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, కళ్యాణం కమనీయం’ స్ట్రయిట్ మూవీస్ కాగా, బుధవారం విడుదలైన ‘తెగింపు’, శనివారం విడుదల కాబోతున్న ‘వారసుడు’ తమిళ అనువాద చిత్రాలు. విశేషం ఏమంటే… ‘వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య’ చిత్రాల నిర్మాణ సంస్థ ఒక్కటే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఎర్నేని నవీన్, వై. రవిశంకర్ వీటిని నిర్మించారు. ఒక్క రోజు గ్యాప్ లో వీరి రెండు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి.
తొలిసారి ఇటు బాలకృష్ణ, అటు చిరంజీవి సరసన నటించిన శ్రుతిహాసన్ కు ఈ సంక్రాంతికి రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ సూపర్ ఓపెనింగ్స్ తో మాస్ బ్లాక్ బస్టర్ గా అనిపించుకోగా, ‘వాల్తేరు వీరయ్య’ ఫలితం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే… ఈ చిత్రాల నిర్మాతలు, హీరోయిన్ కే కాదు… సంగీత దర్శకుడు తమన్ కు కూడా ఈ సంక్రాంతి ఖాతాలో రెండు సినిమాలు పడ్డాయి. ఒకటి 11వ తేదీ తమిళంలో విడుదలైన ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’) కాగా మరొకటి 12వ తేదీ విడుదలైన ‘వీరసింహారెడ్డి’. ఈ రెండు సినిమాలూ సక్సెస్ కావడం విశేషం. తమిళంలో నిన్న అజిత్ ‘తునివు’తో పాటే విజయ్ ‘వారిసు’ రిలీజ్ అయ్యింది. అజిత్ ‘తునివు’ ఓ వర్గం వారికే పరిమితం కాగా, ‘వారిసు’ ఫ్యామిలీ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. సో… తమిళనాట విజయ్ ఈ పొంగల్ కు జయకేతనం ఎగరేసినట్టే! ఆ రకంగా మైత్రీ మూవీ మేకర్స్, శుత్రిహాసన్, ఎస్.ఎస్. థమన్ కు ఈ సంక్రాంతి రెండేసి సినిమాలతో కొత్త ఊపును అందించింది.
