నటసమ్రాట్ గా జనం మదిలో నిలచిపోయిన అక్కినేని నాగేశ్వరరావు నట పర్వంలో ఎన్నెన్నో విశేషాలు. తలచుకున్న ప్రతీసారి అవి అభిమానులకు ఆనందం పంచుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో కొన్నిటిని మననం చేసుకుందాం…
అక్కినేని నాగేశ్వరరావు తొలిసారి తెరపై కనిపించిన చిత్రం ‘ధర్మపత్ని’. పి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1941లో వెలుగు చూసింది.
ఏయన్నార్ తొలిసారి ప్రధానపాత్రలో తెరపై కనిపించిన సినిమా ‘సీతారామజననం’. ఘంటసాల బలరామయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా 1944లో విడుదలయింది. పురాణపురుషుడు శ్రీరామ పాత్రలో ఏయన్నార్ తొలిసారి గుర్తింపు సంపాదించారు. అదే తీరున నందమూరి నటవంశంలో మూడోతరం హీరో అయిన జూనియర్ యన్టీఆర్ కూడా 1997లో ‘రామాయణం’లో శ్రీరామ పాత్రతోనే తొలిసారి వెండితెరపై వెలిగారు. ఆ సినిమా అభినందన సభలో ఏయన్నార్ అతిథిగా పాల్గొని, ‘సీతారామజననం’ నాటి ముచ్చట్లు గుర్తు చేసుకున్నారు.
ఏయన్నార్ తరువాతి రోజుల్లో జానపద కథానాయకునిగా విజయయాత్ర చేశారు. “మాయాలోకం, ముగ్గురు మరాఠీలు, బాలరాజు, కీలుగుర్రం, స్వప్నసుందరి, సువర్ణసుందరి” వంటి జానపదాలతో ఎంతగానో మురిపించారు. అక్కినేని నటించిన తొలి చారిత్రక చిత్రం ‘పల్నాటి యుద్ధం’. ఈ చిత్రాన్ని గూడవల్లి రామబ్రహ్మం ఆరంభించగా, ఎల్.వి.ప్రసాద్ పూర్తి చేశారు.
యన్టీఆర్ ఆగమనానికి ముందే ఏయన్నార్ పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో నటించారు. యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘సంసారం’ (1950) చిత్రం ఏయన్నార్ తొలి సాంఘికం కావడం విశేషం! తరువాతి రోజుల్లో ఏయన్నార్ కంటే యన్టీఆర్ ఎక్కువ పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో నటించి అలరించారు. ఇక సాంఘిక చిత్రాల్లో ఇద్దరూ పోటాపోటీగా సాగడం విశేషం!
యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ కలసి 15 చిత్రాలలో నటించారు. వీరిద్దరూ నటించిన తొలి చిత్రం ‘పల్లెటూరి పిల్ల’ జానపదం. తరువాత “సంసారం, రేచుక్క (గెస్ట్ రోల్), పరివర్తన, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చరణదాసి, భూకైలాస్, మాయాబజార్, గుండమ్మకథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, భక్త రామదాసు, చాణక్య-చంద్రగుప్త, రామకృష్ణులు, సత్యం-శివం” చిత్రాలలో యన్టీఆర్-ఏయన్నార్ నటించారు. ‘రేచుక్క’ సినిమాలో యన్టీఆర్ హీరో కాగా, ఏయన్నార్ “ఎటు చూచిన బూటకాలే… ఎవరాడినా నాటకాలే…” పాటలో గెస్ట్ గా కనిపిస్తారు. అది ఆ చిత్ర నిర్మాత ఘంటసాల బలరామయ్యమరణం తరువాత, ఆయనపై అభిమానంతో అక్కినేని నటించారు. ఇక యన్టీఆర్ దర్శకత్వంలో ఏయన్నార్ నటించిన ఏకైక చిత్రం ‘చాణక్య-చంద్రగుప్త’. ఇందులో ఏయన్నార్ ఏ పారితోషికమూ తీసుకోకుండా నటించారు. అదే విధంగా ఏయన్నార్ సొంత చిత్రం ‘రామకృష్ణులు’లో యన్టీఆర్ ఉచితంగా నటించారు.
ఇక ‘భక్త రామదాసు’లో యన్టీఆర్, ఏయన్నార్, శివాజీగణేశన్, జెమినీగణేశన్ గెస్ట్ రోల్స్ లో కనిపించారు. ఇందులో ఏయన్నార్ విష్ణుమూర్తిగా కనిపించగా, యన్టీఆర్ శ్రీరామునిగా నటించారు.
యన్టీఆర్ దేవతా మూర్తుల పాత్రలతో మెప్పిస్తే, ఏయన్నార్ భక్తుల పాత్రలలో ఎంతగానో అలరించారు. ఆయన భక్తశిఖామణిగా నటించిన “విప్రనారాయణ, శ్రీకృష్ణమాయ, బుద్ధిమంతుడు, భక్త తుకారాం, చక్రధారి” వంటి చిత్రాలు మురిపించాయి. ఏయన్నార్ నటించిన 60వ చిత్రం ‘దొంగల్లో దొర’. ఈ సినిమాను వజ్రోత్సవ చిత్రంగా భావించి, ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఏయన్నార్ ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం ‘ఇద్దరు మిత్రులు’. 1961 డిసెంబర్ 29న ఈ సినిమా విడుదలయింది. మంచి విజయం సాధించింది. అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అత్యధిక చిత్రాలలో హీరోగా నటించిన ఘనత కూడా ఏయన్నార్ దే!
అక్కినేని నూరవ చిత్రం తమిళ ‘గుండమ్మ కథ’ అయిన ‘మనిదన్ మారవిల్లై’. చిత్రమేమంటే యన్టీఆర్ 100వ చిత్రం ‘గుండమ్మ కథ’ కాగా, ఆ సినిమా తమిళ వర్షన్ లోనూ ఏయన్నార్ నటించారు. అది అక్కినేనికి వందో చిత్రం కావడం విశేషం!
తెలుగునాట ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థకు మంచి గుర్తింపు ఉంది. ఈ సంస్థ ఏయన్నార్ హీరోగా నిర్మించిన ‘ఇల్లరికం’ అప్పట్లో ఘనవిజయం సాధించింది. ఈ సంస్థ అధినేత ఏ.వి.సుబ్బారావు, అక్కినేనితో అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఏయన్నార్ హీరోగా సుబ్బారావు నిర్మించిన ‘మనుషులు-మమతలు’తోనే జయలలిత తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. తెలుగునాట ‘ఏ సర్టిఫికెట్’ పొందిన తొలి చిత్రంగా ‘మనుషులు-మమతలు’ నిలచింది.
1966లో ఏయన్నార్ హీరోగా రూపొందిన ‘నవరాత్రి’ చిత్రంలో ఆయన తొమ్మిది పాత్రలు ధరించారు. ఈ చిత్రానికి తమిళంలో శివాజీగణేశన్ హీరోగా రూపొందిన ‘నవరాత్రి’ మాతృక. సావిత్రి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఏ.వి.సుబ్బారావు నిర్మించారు. ఈ చిత్రంతో తాతినేని రామారావు దర్శకునిగా పరిచయం అయ్యారు.
1969లో ఏయన్నార్ పాతికేళ్ళ చలన చిత్రజీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సంవత్సర కానుకగా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ అక్కినేనితో ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రం తెరకెక్కించింది. కె.ప్రత్యగాత్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకు ముందు 1961లో ఏయన్నార్ తో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘భార్యాభర్తలు’తోనే కె.ప్రత్యగాత్మ దర్శకునిగా పరిచయం అయ్యారు. ఇందులో ఏయన్నార్ ప్లే బోయ్ గా తొలిసారి నటించారు.
ఏయన్నార్ కెరీర్ లో తొలి స్వర్ణోత్సవ చిత్రం ‘దసరాబుల్లోడు’. 1971లో విడుదలైన ఈ సినిమా ద్వారా జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శకునిగా మారారు. ఆ తరువాత ఏయన్నార్ తో వి.బి.రాజేంద్రప్రసాద్ “బంగారుబాబు, బంగారుబొమ్మలు” వంటి విజయవంతమైన చిత్రాలనూ రూపొందించారు. అక్కినేని కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలచిన చిత్రం ‘ప్రేమాభిషేకం’. ఇది ఏయన్నార్ మ్యారేజ్ డే అయిన ఫిబ్రవరి 18న 1981లో విడుదలయింది. ఈ చిత్రం తొలి విడుదలలో 30 కేంద్రాలలో శతదినోత్సవం, 29 కేంద్రాలలో రజతోత్సవం చూసింది. తెలుగునాట తొలి ప్లాటినమ్ జూబ్లీ మూవీగా నిలచింది. గుంటూరు విజయా టాకీస్ లో ఈ చిత్రం ఏకధాటిగా 380 రోజులు ప్రదర్శితమై, అప్పట్లో రికార్డ్ గా నిలచింది. ఈ చిత్రం లేట్ రన్ లో మరో 13 కేంద్రాలలో శతదినోత్సవం, ఓ కేంద్రంలో రజతోత్సవం చూసింది. ఏయన్నార్ 200వ చిత్రంగా ‘మేఘసందేశం’ నిలచింది. ఈ సినిమా 1982లో విడుదల కాగా, దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా ఏయన్నార్ ఉత్తమనటునిగా తొలిసారి నంది అవార్డును అందుకున్నారు. 1994లో దాసరి దర్శకత్వంలో అక్కినేని నటించిన ‘బంగారు కుటుంబం’తో రెండో సారి ఉత్తమనటునిగా నంది అవార్డు అందుకున్నారు. అలా రెండు నంది అవార్డులూ ఏయన్నార్ కు దాసరి చిత్రాలతోనే లభించడం విశేషం! హాలీవుడ్ లో కిర్క్ డగ్లస్, హిందీ చిత్రసీమలో పృథ్వీరాజ్ కపూర్ తరువాత తనయుడు, మనవడుతో కలసి నటించిన ఘనత ‘మనం’ సినిమాతో దక్కించుకున్నారు అక్కినేని. ఏయన్నార్ చివరి చిత్రంగా విడుదలైన ‘మనం’ మంచి విజయం సాధించి, అక్కినేని అభిమానులకు ఓ మరపురాని మధురానుభూతిని కలిగించింది. ‘మనం’ చిత్రంలోని వైవిధ్యం ఏమిటంటే – నిజజీవితంలో తండ్రులైనవారు ఇందులో తమ తనయులకు కొడుకులుగా నటించడం. ఈ చిత్రంలో నాగచైతన్య కొడుకుగా నాగార్జున, ఆయన తనయునిగా ఏయన్నార్ నటించడం విశేషం. ఇది జన్మజన్మలబంధం కథతో తెరకెక్కింది.
జన్మజన్మల బంధాల కథతో రూపొందిన ఏయన్నార్ సినిమాలు “బాలరాజు, మూగమనసులు, బంగారుబొమ్మలు” మంచి విజయం సాధించాయి. వాటి కోవలోనే ‘మనం’ కూడా విజయాన్ని సొంతం చేసుకుంది.