NTV Telugu Site icon

అసలు సిసలు నవలానాయకుడు అక్కినేని!

తెలుగు చిత్రసీమలో నవలానాయకుడు అనగానే నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ముందుగా గుర్తుకు వస్తారు. ఆయన నటజీవితంలో పలు మేలుమలుపులన్నీ నవలాచిత్రాలే కావడం విశేషం. ఏయన్నార్ ను మహానటునిగా నిలిపిన ‘దేవదాసు’ చిత్రం శరత్ చంద్ర ఛటర్జీ రాసిన బెంగాలీ నవల ఆధారంగా తెరకెక్కింది. ఆ తరువాత బెంగాలీ నవలలతోనే ఏయన్నారు మంచి విజయాలను చవిచూశారు. మణిలాల్ బెనర్జీ రాసిన ‘స్వయంసిద్ధ’ ఆధారంగా రూపొందిన ‘అర్ధాంగి’లో అక్కినేని పిచ్చివాడుగా చేసిన అభినయం ఆకట్టుకుంది. మరో మహానటుడు యన్టీఆర్ తో కలసి ఏయన్నార్ నటించిన ఏకైక నవలా చిత్రం ‘చరణదాసి’ రవీంద్రనాథ్ టాగూర్ రాసిన ‘నౌకాదుబి’ నవల ఆధారంగా రూపొందింది.

అన్నపూర్ణలో అక్కినేని నవలా చిత్రాలు
ఏయన్నార్ ను తొలి నుంచీ ప్రోత్సహించిన వారు దుక్కిపాటి మధుసూదనరావు. వారి అన్నపూర్ణ బ్యానర్ పై అక్కినేనితో దుక్కిపాటి నిర్మించిన తొలి నవలాచిత్రం ‘తోడికోడళ్ళు’. దీనికి శరత్ చంద్ర ఛటర్జీ రాసిన ‘నిష్కృతి’ ఆధారం. ఈ సినిమాతో తొలిసారి అక్కినేని, ఆదుర్తి సుబ్బారావు కలసి పనిచేశారు. ఆశాపూర్ణాదేవి రాసిన బెంగాలీ నవల ‘అగ్నిపరీక్ష’ ఆధారంగా ‘మాంగల్య బలం’ రూపొందింది. తెలుగు నవల ఆధారంగా అక్కినేని నటించిన తొలి చిత్రం ‘చదువుకున్న అమ్మాయిలు’. డాక్టర్ శ్రీదేవి రాసిన ‘కాలాతీత వ్యక్తులు’ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఆ తరువాత నుంచీ దుక్కిపాటి, ఏయన్నార్ తో నవలా చిత్రాలనే ఎక్కువగా నిర్మించారు. యద్దనపూడి సులోచనారాణి రాసిన “ఆత్మగౌరవం, ఆత్మీయులు, జైజవాన్, బంగారు కలలు” అవే టైటిల్స్ తో తెరకెక్కాయి. ఇక యద్దనపూడి ‘విజేత’ నవల ఆధారంగా ‘విచిత్రబంధం’ రూపొంది ఘనవిజయం సాధించింది. కోడూరి కౌసల్యాదేవి రాసిన ‘చక్రభ్రమణం’ ఆధారంగా ‘డాక్టర్ చక్రవర్తి’ రూపొందింది. ఉత్తమచిత్రంగా నంది అవార్డు అందుకున్న తొలి సినిమాగా ‘డాక్టర్ చక్రవర్తి’ నిలచింది. అన్నపూర్ణ బ్యానర్ లో ఏయన్నార్ నటించిన చివరి చిత్రం ‘బంగారు కలలు’ నవలా చిత్రమే కావడం విశేషం!

మరికొన్ని…
ఏయన్నార్ తో అపురూప చిత్రాలు నిర్మించిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ డాక్టర్ లక్ష్మీ త్రిపుర సుందరి రాసిన తమిళ నవల ‘పెణ్ మనం’ ఆధారంగా ‘భార్యాభర్తలు’ తెరకెక్కించింది. దీంతో ఏయన్నార్ కు ప్లే బోయ్ హీరో ఇమేజ్ లభించింది. ఇదే సంస్థ తరువాత గుల్షన్ నందా రాసిన ‘పత్థర్ కే హోంత్’ హిందీ నవల ఆధారంగా ‘పునర్జన్మ’ నిర్మించింది.

ఏయన్నార్ నటజీవితంలో ఆయన మనసుకు బాగా హత్తుకున్న చిత్రమని ‘బాటసారి’ పేరే చెప్పేవారు. భానుమతి నటించి, నిర్మించిన ఈ చిత్రానికి ఆమె భర్త రామకృష్ణ దర్శకులు. శరత్ బాబు రాసిన ‘బడీ దీదీ’ ఆధారంగా ‘బాటసారి’ రూపొందింది.

ఆచార్య ఆత్రేయ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘వాగ్దానం’ చిత్రం శరత్ బాబు రాసిన ‘దత్త’ బెంగాలీ నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రం ద్వారానే దాశరథి గీతరచయితగా పరిచయం అయ్యారు.

ఏయన్నార్ తో జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ అనుబంధం మరపురానిది. అక్కినేనితో జగపతి సంస్థ నిర్మించిన తొలి చిత్రం ‘ఆరాధన’ నితై భట్టాచార్య రాసిన బెంగాలీ నవల ‘సాగరిక’ ఆధారంగా నిర్మితమయింది.

విఖ్యాత దర్శకులు బి.యన్.రెడ్డి అనేక అపురూప కళాఖండాలు తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో ఏయన్నార్ నటించిన ఏకైక చిత్రం ‘పూజాఫలం’ మునిపల్లె రాజు రాసిన ‘పూజారి’ నవల ఆధారంగా రూపొందింది. మాదిరెడ్డి సులోచన రాసిన ‘ప్రేమలు-పెళ్ళిళ్ళు’ నవల ఆధారంగా అదే పేరుతో రూపొందిన అక్కినేని చిత్రం అంతగా అలరించలేదు.

సురేశ్ సంస్థను నిలిపిన చిత్రంగా ‘ప్రేమనగర్’ నిలచింది. 1971లో జనం ముందు నిలచిన ఈ చిత్రం అదే పేరుతో ఆరికెపూడి కోడూరి కౌసల్యాదేవి రాసిన నవల ఆధారంగా నిర్మితమయింది. ఏయన్నార్ 1975లో అనారోగ్యం కారణంగా గ్యాప్ తీసుకున్నారు. ఆయన మళ్ళీ కెమెరా ముందు నిలచి నటించిన చిత్రం ‘సెక్రటరీ’. యద్దనపూడి సులోచనారాణి రాసిన ‘సెక్రటరీ’ నవల ఈ చిత్రానికి ఆధారం. ఈ రెండు చిత్రాలు సురేశ్ సంస్థ అధినేత డి.రామానాయుడు నిర్మించడం విశేషం. ఏయన్నార్ కెరీర్ లో చివరి నవలాచిత్రం ‘సెక్రటరీ’ అనే చెప్పవచ్చు.