నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ చిత్రం పలు రికార్డులు నమోదు చేసింది. ప్యాండమిక్లోనూ విజయవంతంగా అర్ధశతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగానూ అఖండ నిలచింది. ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ పలు అరుదైన రికార్డులను నమోదు చేసుకున్నారు. ఈ సినిమా విడుదలైన తరువాత బాలకృష్ణ నటవిశ్వరూపం గురించి చర్చోపచర్చలు మొదలయ్యాయి. మొన్నటి దాకా బాలయ్య అంటే ముక్కోపి, అభిమానులను సైతం కొడుతూ ఉంటాడు అన్న మాటలు పక్కకు పోయాయి. అఖండ చిత్రాన్ని ఒంటిచేత్తో ఆయన విజయపథంవైపు నడిపించిన తీరు చూసి నవతరం ప్రేక్షకులు సైతం అబ్బుర పడ్డారు. ఈ సినిమాతో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ హ్యాట్రిక్ సాధించింది. అంతే కాదు, ఈ మూడు సినిమాల్లోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం! బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ మూడు చిత్రాల్లోనూ బాలకృష్ణ పోషించిన డ్యుయల్ రోల్స్ జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతే కాదు ఈ మూడు సినిమాల్లోని డైలాగులు కూడా విశేషాదరణ పొందాయి. చూడు ఒకవైపే చూడు... అంటూ సింహాగా బాలయ్య అలరించగా, లెజెండ్లో ఫ్లూటు జింక ముందు ఊదు...సింహం ముందు కాదు... అని చెప్పి ఆకట్టుకున్నారు. ఇక అఖండ విషయానికి వస్తే – ఇందులో బోత్ ఆర్ నాట్ సేమ్... అనే డైలాగ్ పాపులర్ అయింది. ఇలా వరుసగా మూడు చిత్రాలలో డ్యుయల్ రోల్ పోషించడం, సదరు చిత్రాలలోని డైలాగ్స్ ఫ్యాన్స్ రింగ్ టోన్ గానూ పెట్టుకోవడం అన్నది ఒక్క బాలయ్య విషయంలోనే జరిగింది. ఆ తీరున గతంలో బాలయ్యతో హ్యాట్రిక్ సాధించిన దర్శకుల కంటే విభిన్నమైన స్థానం ఆక్రమించారు బోయపాటి శ్రీను.
ఇక అఖండ చిత్రం 103 కేంద్రాలలో అర్ధశతదినోత్సవం జరుపుకుందని ప్రకటించారు. వీటిలో 28 సెంటర్స్ లో మాత్రమే అఖండ డైరెక్ట్ గా యాభై రోజులు ప్రదర్శితమైంది. మిగతా కేంద్రాలలో అఖండ చిత్రం ప్రదర్శితమవుతున్నప్పటికీ, అవన్నీ షిఫ్ట్ థియేటర్లు కావడం గమనార్హం! ఇలా డైరెక్ట్ గా 28 కేంద్రాలలో యాభై రోజులు ఆడిన సినిమా ఈ ప్యాండమిక్ లో అఖండనే కావడం మరో విశేషం! నిజానికి వందరోజులు, రజతోత్సవం, ద్విశతదినోత్సవం, స్వర్ణోత్సవం, వజ్రోత్సవం, ప్లాటినమ్ జూబ్లీ, వెయ్యి రోజులు వంటి పదాలకు బాలకృష్ణ ఒక్కరే సరైన నిర్వచనం చెప్పగలిగారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మునుపటిలా లేవు. ఎన్ని రోజులు ఆడింది అన్నది ముఖ్యం కాదు, ఓ సెంటర్ లో ఓ సినిమా ఎంత వసూలు చేసింది అన్నది ప్రధానమై పోయింది. ఆ రీతిన కూడా పలు కేంద్రాలలో అఖండ రికార్డ్ స్థాయి వసూళ్ళు చూడడం విశేషం. ఒక్క మాటలో చెప్పాలంటే, అన్ని ఏరియాల్లోనూ కొనుగోలు దారులు సంతృప్తి చెందిన చిత్రంగా ఈ మధ్య కాలంలో అఖండనే నిలచింది.
ఇప్పుడు రన్నింగ్ రికార్డుల పై ఎవరూ అంతగా మోజు చూపించడం లేదు. అయినా, అఖండను అభిమానులు విజయపథంలో పయనింప చేశారు. నిజానికి ఈ 103 కేంద్రాలలో దాదాపు 50కి పైగా సెంటర్లలో అఖండ నేరుగా 43 రోజులు ప్రదర్శితమైంది. మరి కొన్ని ఊళ్ళలో 15 రోజులకే షిఫ్ట్ అయినప్పటికీ, షిఫ్ట్ అయిన తరువాత కూడా మంచి వసూళ్లు చూసింది.నిజానికి ఓ సినిమా షిఫ్ట్ అయితే, దాని రన్నింగ్ కానీ, వసూళ్లు కానీ తగ్గి పోతాయి. కానీ, అనేక కేంద్రాలలో అఖండ షిఫ్ట్ అయిన తరువాత కూడా మంచి వసూళ్ళు చూసింది. అసలు బాలకృష్ణకు షిఫ్ట్ అన్నది కూడా అచ్చివస్తుందని అభిమానులకు బాగా తెలుసు. 1986లో బాలకృష్ణ హీరోగా రూపొందిన ముద్దుల క్రిష్ణయ్య చిత్రాన్ని విజయవాడలో అన్నపూర్ణ నుండి కేవలం 21 రోజులకు షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ అయిన తరువాత శకుంతలలో ఆ సినిమా ఏకధాటిగా 25 వారాలు ప్రదర్శితమై జనం నోళ్ళు తెరిచేలా చేసింది. అదే రీతిన ఇప్పుడు అఖండ చిత్రం కొన్ని చోట్ల 15 రోజులకే షిఫ్ట్ అయినా, మరికొన్ని చోట్ల 43 రోజులకు థియేటర్ మారినా విశేషంగా జనాదరణ పొందింది. ఇలా షిఫ్ట్ అయి కూడా రికార్డు కలెక్షన్లు రాబట్టిన చిత్రంగానూ అఖండ అరుదైన రికార్డును బాలయ్యకు అందించింది.
మరో విశేషమేమంటే, అఖండ సినిమా విదేశాల్లోనూ మంచి వసూళ్లు చూసింది. అదీగాక బాలకృష్ణను ఏకంగా రూ.150 కోట్ల క్లబ్ లో కూర్చోబెట్టింది ఈ చిత్రం. అందువల్ల విదేశాల్లోని అభిమానులు అఖండ చిత్రాన్ని అదే పనిగా జనవరి 20న ఈ సినిమా అర్ధశతదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రదర్శనలు ఏర్పాటు చేసుకోవడం మరింత విశేషం! ఈ రీతిన ఓ టాప్ హీరో సినిమా అర్ధ శతదినోత్సవాన్ని పురస్కరించుకొని అదే పనిగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి విదేశాలలో ఒకే రోజున ప్రత్యేక ప్రదర్శలకు అఖండనే బీజం వేసిందని చెప్పవచ్చు. గతంలో కొన్ని చిత్రాలు ఇదే రీతిన అమెరికాలో యాభై రోజులకో, వంద రోజులకో ప్రత్యేక ప్రదర్శనలు వేసుకున్నాయని అంటున్నారు. కానీ, ఈ తీరున విదేశాల్లోని అనేక కేంద్రాలలో ఇంత రచ్చ సాగడం అన్నది అఖండతోనే మొదలయిందని సినీవర్గాలు చెబుతున్నాయి.
