సోషల్ మీడియాలో అభిమానుల మధ్య జరిగే ఫ్యాన్ వార్స్ రోజు రోజుకు శృతి మించుతున్న విషయం తెలిసిందే. హీరోల వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా, రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ అయితే మరో రెంజ్‌లో ఉంటుంది. ఇక తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు అజిత్ కుమార్ మరియు విజయ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో తరచూ ఘర్షణలు చెలరేగుతూనే ఉంటాయి. ఈ ఫ్యాన్ వార్‌ల కారణంగా అజిత్, విజయ్‌ల మధ్య వ్యక్తిగతంగా విభేదాలు ఉన్నాయని నెట్టింట గాసిప్స్ ఊపందుకున్నాయి. అయితే, తాజాగా అజిత్ ఈ పుకార్లకు ముగింపు పలికేలా స్పష్టత ఇచ్చారు.
Also Read : Michael Jackson : కింగ్ ఆఫ్ పాప్ .. ‘మైఖేల్’ టీజర్ రిలీజ్..
‘‘నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. కొందరు మన మధ్య విభేదాలు ఉన్నాయనే అపోహలు సృష్టించి అభిమానులను రెచ్చగొడుతున్నారు. అలా చేసే వారు మౌనంగా ఉంటే అందరికీ మంచిదవుతుంది. నేను ఎప్పుడూ విజయ్‌కి మంచి జరగాలని కోరుకుంటాను. ఆయన విజయాలు నాకు సంతోషమే’’ అని అజిత్ స్పష్టం చేశారు. ఇటీవల అజిత్ మేనేజర్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ‘‘విజయ్, అజిత్ ఇద్దరూ మంచి స్నేహితులే. అజిత్‌కి పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు మొదట శుభాకాంక్షలు తెలిపింది విజయ్‌నే’’ అని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య ఏ విభేదాలు లేవని క్లియర్ అయింది. అంతేకాక, ఇటీవల విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించిన అజిత్ ‘‘ఇలాంటి సంఘటనలకు ఒక్కరే కాదు, మనందరం బాధ్యులమే’’ అంటూ బాధ్యతను గుర్తు చేశారు. సినీ వర్గాలు చెబుతున్నట్లు, అజిత్ – విజయ్ ఇద్దరూ ఇండస్ట్రీకి గౌరవనీయమైన నటులు. కానీ అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్‌లే ఈ అపోహలకు కారణమవుతున్నాయి. ఇప్పుడు అజిత్ ఇచ్చిన క్లారిటీతో, ఆ గాసిప్స్‌కి ఫుల్‌స్టాప్ పడినట్టే!