Ahimsa: మూవీ మొఘల్ డి. రామానాయుడు మనవడు, సురేశ్ బాబు చిన్న కొడుకు అభిరామ్ ‘అహింస’ సినిమాతో హీరోగా తెరంగేట్రమ్ చేయబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు తేజ అతని హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పి. కిరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సినిమా షూటింగ్ పూర్తయ్యి చాలా కాలమే అయినా… తేజ దానిని నిదానంగా చెక్కుతూ వచ్చాడు. ఇదిగో అదిగో అంటూ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను, స్టిల్స్ ను వదిలిన చిత్ర బృందం ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించింది. ఏప్రిల్ 7వ తేదీన ఈ మూవీని జనం ముందుకు తీసుకు రాబోతున్నామని ఆదివారం ప్రకటించారు. అభిరామ్ సరసన గీతికా తివారి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సదా, రజత్ బేడీ, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవిప్రసాద్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘అహింస’ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతాన్ని సమకూర్చగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.
అయితే… ఇన్ని రోజులు ఆలోచించి ఇప్పుడీ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించినా, అభిరామ్ మూవీ ‘అహింస’కు బాక్సాఫీస్ లో గట్టి పోటీ అయితే ఎదురవుతోంది. ఏప్రిల్ 7వ తేదీనే మాస్ మహరాజా రవితేజ ‘రావణాసుర’ మూవీ రిలీజ్ కాబోతోంది. విశేషం ఏమంటే… ఇందులో అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ కూడా ఓ కీ-రోల్ ప్లే చేశాడు. దానితో పాటు కిరణ్ అబ్బవరం నటించిన ‘మీటర్’ మూవీ సైతం ఇదే తేదీ జనం ముందుకు వస్తోంది. ఇటు రవితేజ, అటు కిరణ్ అబ్బవరం ఇద్దరూ కూడ ఇప్పుడు సక్సెస్ ట్రాక్ పై ఉండటంతో వారి చిత్రాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది. మరి ఈ రెండు మాస్ మూవీస్ ను తట్టుకుని తేజ తెరకెక్కించిన ‘అహింస’ ఏ మేరకు విజయం సాధిస్తోందో, నటుడిగా అభిరామ్ ఎలాంటి పేరు తెచ్చుకుంటాడో వేచి చూడాల్సిందే!
