బాలీవుడ్ హీరోయిన్ రిమి సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధూమ్ 2, గోల్‌మాల్, బాగ్‌బాన్, హంగామా వంటి సినిమాల్లో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కి కూడా సుపరిచితమే. మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన అందరివాడు చిత్రంలో రిమి సేన్ నటించి తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించింది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంది. తాను స్నేహితుడని నమ్మిన ఒక వ్యక్తి తనను అడ్డంగా మోసం చేసాడని, కొత్త వ్యాపారం మొదలుపెడదామని చెప్పి తనవద్ద రూ.4.14 కోట్లు తీసుకొని పరారయ్యాడని చెప్పుకొచ్చింది.
వివరాల్లోకి వెళితే.. రిమి సేన్ కు మూడేళ్ల క్రితం వ్యాపారవేత్త రౌనక్ జతిన్ వ్యాస్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అంధేరిలోని జిమ్ లో వీరిద్దరూ మాట్లాడుకునేవారు. ఇక ఆ పరిచయం కాస్త స్నేహం గా మారడంతో రౌనాక్, తన వ్యాపారం గురించి రిమి కి చెప్పాడు. కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తున్నామని, రిమిని కూడా భాగస్వామిగా మారితే లాభాలు వస్తాయని నమ్మించాడు. స్నేహితుడే కదా నమ్మిన రిమి, అతడికి పెట్టుబడి కింద రూ. 4.14 కోట్లు ఇచ్చింది. కొద్దిరోజుల తరువాతనుంచి అతడు కనిపించడం లేదని, అతడి గురించి ఆరా తెస్తే అస్సలు అతను ఏ వ్యాపారం ప్రారంభించలేదని తెలిసి తాను మోసపోయానని గ్రహించినట్లు రిమి తెలిపింది. దీంతో చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించానని తెలిపింది. ఎలాగైనా పరారీలో ఉన్న అతడిని పట్టుకొని తన డబ్బు తనకు తిరిగి ఇప్పించాల్సిందిగా పోలీసులను కోరింది. రిమి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రౌనాక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
