(అక్టోబర్ 10న రేఖ పుట్టినరోజు)
ఆరున్నర పదుల వయసు దాటినా, అందానికి అందం అన్నట్టుగా అలరిస్తోన్న రేఖ దక్షిణాదిలోనే నటనలో ఓనమాలు దిద్దుకున్నారు. ఉత్తరాదిన అందాల అభినయంతో ఆకట్టుకున్నారు. అనేక హిందీ చిత్రాలలో రేఖ అందాలతో విందు చేస్తూ జనం మదిలో చెరగని ముద్ర వేశారు. ఈ నాటికీ నవతరం భామలకు దీటుగా వెలుగులు విరజిమ్ముతోన్న రేఖ అందాన్ని చూసి, ఆ నాటి ఆమె కథానాయకులు అబ్బుర పడుతూ ఉంటారు. జాతీయ స్థాయిలో ఉత్తమనటిగానూ నిలచిన రేఖ, ఈ నాటికీ తన దరికి చేరిన పాత్రల్లో అలరిస్తూనే ఉండడం విశేషం!
తెలుగునటి పుష్పవల్లి, తమిళ స్టార్ హీరో జెమినీగణేశన్ కు 1954 అక్టోబర్ 10న రేఖ జన్మించారు. పుష్పవల్లికి దర్శకులు వేదాంతం రాఘవయ్య సమీపబంధువు. ఆయన దర్శకత్వంలో యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘ఇంటిగుట్టు’లో నాలుగేళ్ళ ప్రాయంలో రేఖ బాలనటిగా కనిపించింది. ఆ తరువాత బి.యన్. రెడ్డి. దర్శకత్వంలో రూపొందిన ‘రంగుల రాట్నం’లో ‘దశావతారాల’ను వర్ణిస్తూ సాగే పాటలో ముద్దుగా మురిపించింది రేఖ. మొదట్లో సన్నగా పీలగా ఉన్న రేఖ తరువాత ముద్దుగా బొద్దుగా తయారయింది. 15 ఏళ్ల వయసులోనే తన బొద్దు అందాలతో మురిపిస్తూ రాజ్ కుమార్ హీరోగా రూపొందిన కన్నడ చిత్రం ‘ఆపరేషన్ జాక్ పాట్ నల్లి సి.ఐ.డి. 999’లో నాయికగా నటించారు రేఖ. అందులో బికినీలో తడి అందాలతో రేఖ అలరించిన తీరును ఇప్పటికీ అభిమానులు మరచిపోలేరు. ఆపై హిందీ చిత్రసీమలో నవీన్ నిశ్చల్ తో కలసి ‘సావన్ భాదో’లో నటించారు. తెలుగులో ‘అమ్మకోసం’ చిత్రంలో కృష్ణంరాజుకు జోడీగా అభినయించారు. ఉత్తరాది చిత్రాలలోనే తన లక్ పరీక్షించుకోవాలని ఆశించారు రేఖ. ఆరంభంలో రేఖ నటించిన అనేక చిత్రాలలో ఆమె బొద్దుగానే కనిపించారు. దక్షిణాది భామలు బొద్దుగానే ఉంటారని రేఖను చూసి కామెంట్ చేసేవారు. దానిని ఓ సవాల్ గా తీసుకొని, తరువాతి రోజుల్లో యోగసాధనతో నాజూకు షోకులు సొంతం చేసుకున్నారు రేఖ.
ఆ నాటి మేటి హిందీ కథానాయకుల సరసన నాయికగా నటించి మురిపించారు రేఖ. 1973లో అప్పటి క్రేజీ హీరో వినోద్ మెహ్రాను రేఖ వివాహమాడినట్టు వార్తలు గుప్పుమన్నాయి. వాటిని అటు వినోద్ మెహ్రా కానీ,ఇటు రేఖ కానీ ఖండించలేదు. దాంతో వినోద్ మెహ్రాను రేఖ పెళ్ళాడిందనే ఇప్పటికీ చాలామంది నమ్ముతూ ఉంటారు. తరువాతి రోజుల్లో మెహ్రా ఆ వార్తలో నిజం లేదని చెప్పారు. ఆపై అమితాబ్ బచ్చన్ తో రేఖ ప్రేమాయణం కూడా వార్తల్లో నిలచింది. ఆ విధంగా కూడా రేఖకు క్రేజ్ లభించింది. అమితాబ్ బచ్చన్ సరసన రేఖ నటించిన “మిస్టర్ నట్వర్ లాల్, ముఖద్దర్ కా సికందర్” వంటివి ఆకట్టుకున్నాయి. అప్పటి దాకా అందాలతోనే కనువిందు చేసిన రేఖ 1981లో ‘ఉమ్రావ్ జాన్’లో నటిగానూ తనదైన బాణీ పలికించి జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలిచారు. అనేక మంది దిగ్దర్శకుల చిత్రాలలో రేఖ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో అలరిస్తూనే ఉన్నారామె. ఆ మధ్య ‘సూపర్ నాని’లోనూ రేఖ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు.
దక్షిణాది తారల్లో శ్రీదేవి, జయసుధ, సౌందర్య వంటివారు హిందీలో నటించిన చిత్రాల్లో వారి పాత్రలకు రేఖ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇక హృషీకేశ్ ముఖర్జీ తెరకెక్కించిన ‘ఖూబ్ సూరత్’ చిత్రం ఆమెకు నటిగా మంచి మార్కులు సంపాదించి పెట్టింది. అందులో ఆర్.డి.బర్మన్ స్వరకల్పనలో “ఖేడా ఖేడా…” అనే పాటనూ ఆలపించి, గాయనిగా మారారు రేఖ. తరువాతి రోజుల్లో “అగర్ తుమ్ నా హోతే…’ చిత్రంలోనూ ఆర్డీ బర్మన్ బాణీలలోనే రూపొందిన “కల్ తో సండే కీ చుట్టీ…” అనే పాటను పాడారు రేఖ. ఖయ్యూమ్ సైతం తన స్వరకల్పనలో ‘ఏక్ నయా రిస్తా’ సినిమా కోసం రేఖతో “ఎహ్ సాస్ కా సౌదా హై…” పాట పాడించారు. ఇక రేఖ యోగాభ్యాసంతో రూపొందిన ‘రేఖాస్ మైండ్ అండ్ బాడీ టెంపుల్’ అప్పట్లో విశేషాదరణ చూరగొంది. మరి ఏ చిత్రంలో మళ్ళీ రేఖ తనదైన అభినయంతో మురిపిస్తారో చూడాలి.