అందం, అభినయం కలబోసిన రూపంతో ఎందరో తారలు అలరించారు. వారిలో తాను ప్రత్యేకం అంటూ అనుష్క శెట్టి మురిపించారు. పొడుగైన సుందరీమణులు ఎంత అందంగా ఉన్నా, అంతగా అలరించలేరని సినీజనం అంటూ ఉంటారు. వారి మాటను కొట్టి పారేస్తూ అనుష్క ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం. నటిగా అనుష్క తెరపై కనిపించి పదహారు సంవత్సరాలు అవుతున్నా, ఇప్పటికీ ఆమె అభినయం జనాన్ని అలరిస్తూనే ఉంది. అనుష్క ఓ చిత్రంలో నాయికగా నటించింది అనగానే సదరు చిత్రం కోసం పరుగులు తీసేవారు జనం. ‘అరుంధతి’ గా అదరహో అనిపించిన అనుష్క అభినయం, తరువాత ‘బాహుబలి’ రెండు భాగాల్లోనూ ఎంతగానో మురిపించింది. దాంతో అనుష్క అరుదైన అభినేత్రిగా జనం మదిలో నిలచింది. అందువల్లే ‘సైరా…నరసింహారెడ్డి’ కథ ఆమె పాత్ర ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. నవంబర్ 7తో అనుష్క 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ప్రస్తుతం అనుష్క ఏ చిత్రంలోనూ నటించక పోయినా, ఆమె అభినయిస్తే చూడటానికి జనం మాత్రం సిద్ధంగా ఉన్నారు.
అనుష్క శెట్టి 1981 నవంబర్ 7న కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. ఇంట్లో ‘స్వీటీ శెట్టి’గా ఆమె సాగారు. చిత్రసీమకు వచ్చాకే అనుష్కగా మారారు. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్ లో బ్యాచ్ లర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో పట్టా పొందిన అనుష్క తరువాత యోగసాధనతో మెరుపు తీగెలా మారారు. కొన్నాళ్ళు యోగా పంతులమ్మగానూ పనిచేశారు. ఈ పొడుగాటి సుందరి అందం పూరి జగన్నాథ్ ను పట్టేసింది. దాంతో ‘సూపర్’ చిత్రంతో తెరకు పరిచయం చేశారు పూరి. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయినా, అనుష్క అందం మాత్రం జనానికి బంధం వేసింది. నాగార్జున కుటుంబంతో అనుబంధం పెంచుకున్న అనుష్క, వారి ఇంట్లో అమ్మాయిలా ‘స్వీటీ’గానే అభిమానం సంపాదించారు. నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, చిరంజీవి అందరి సరసనా చిందేసి కనువిందు చేశారు అనుష్క. తరువాతి తరం హీరోలయిన ప్రభాస్, మహేశ్, గోపీచంద్ తోనూ జోడీ కట్టి ఆకట్టుకున్నారు. ఎవరితో నటించినా, ప్రభాస్ కు అనుష్క హిట్ పెయిర్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ నటించిన ‘మిర్చి, బాహుబలి-1, బాహుబలి-2’ చిత్రాలు వరుసగా ఘనవిజయం సాధించడం విశేషం. అందంతో బంధాలు వేయడమే కాదు, అభినేత్రిగానూ అనుష్క మురిపించారు. ‘సైజ్ జీరో’ కోసం బరువు పెరిగి దరువేసి మరీ ఉత్తమ నటిగా నంది అవార్డును దక్కించుకున్నారు అనుష్క.
ప్రస్తుతం అనుష్క ఏ చిత్రంలోనూ నటించక పోయినా, ఇంతకు ముందు ఆమె నటించిన చిత్రాలను చూస్తూ అభిమానులు ఆనందిస్తున్నారు. ఈ ప్యాండమిక్ లో అనుష్క నటించిన చిత్రాలను చూసి ఆమెపై మరింత అభిమానం పెంచుకున్నవారు ఉన్నారు. అలాంటి వారందరూ అనుష్క మళ్ళీ తెరపై కనిపిస్తే చూడాలని తపిస్తున్నారు. మరి వారి అభిలాషను అనుష్క ఎప్పుడు తీరుస్తారో చూడాలి.