Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?

Anasuya Buchibabu

Anasuya Buchibabu

గ్లామర్‌తోనే కాకుండా, ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ, నిక్కచ్చిగా తన అభిప్రాయాలను పంచుకునే నటి అనసూయ భరద్వాజ్ మరోసారి ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం సృష్టించారు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన సుదీర్ఘ పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్‌ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సమాజంపై సినిమాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో ఏం జరుగుతోంది? అనే విషయాలపై ఆమె ఇంగ్లీష్‌లో రాసుకొచ్చిన అంశం ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో జూన్ 4న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘పెద్ది’ సినిమాలో.. హీరోయిన్ జాన్వి కపూర్ (అచ్చియమ్మ పాత్ర) ట్రాక్ పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ లవ్ ట్రాక్ అనవసరమని, కొన్ని సీన్స్ చాలా క్రింజ్‌గా ఉన్నాయనే చర్చ నడుస్తున్న తరుణంలోనే అనసూయ ఈ పోస్ట్ పెట్టడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆమె ఏ సినిమా పేరు ఎత్తకపోయినా, ఈ పోస్ట్ పరోక్షంగా ‘పెద్ది’ చిత్రానికే కౌంటర్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది.

సినిమా అనేది సమాజంలో జరిగే పరిణామాల నుంచే పుడుతుందని, అయితే సమాజాన్ని సంస్కరించే పూర్తి భారాన్ని కేవలం వెండితెరపైనే నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అని అనసూయ ప్రశ్నించారు. సినిమా అనేది ప్రాథమికంగా ఒక కల్పిత కథ మాత్రమేనని గుర్తు చేస్తూ.. ఏది మంచి, ఏది చెడు అని విశ్లేషించుకునే విచక్షణా జ్ఞానం ప్రేక్షకుడికి ఉండాలన్నారు. “సినిమాలు చూసి పిల్లలు పాడైపోతున్నారు అనడం సరికాదు.. సినిమాల ద్వారా పేరెంటింగ్ జరగాలని నేను అస్సలు నమ్మను” అంటూ ఆమె చాలా స్పష్టమైన స్టాండ్ తీసుకున్నారు. ఒకప్పుడు సినిమాల్లో హీరో అంటే ఒక ఆదర్శం, విలన్ అంటే సమాజానికి చెడు చేసే వ్యక్తి అనే ఒక స్పష్టమైన విభజన ఉండేదని అనసూయ విశ్లేషించారు. కానీ నేటి తరం సినిమాల్లో క్యారెక్టరైజేషన్లు ఎంతో కాంప్లెక్స్‌గా మారుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. కథలు బహుళ కోణాల్లో సాగుతున్న క్రమంలో.. ఒక చెడును కేవలం పాత్ర పరంగా చూపించారా? లేక ఆ చెడునే గొప్పగా కీర్తిస్తూ గ్లోరిఫై చేశారా? అనే సన్నని గీత చాలా సందర్భాల్లో చెరిగిపోతోందని, ఇది ఆలోచించాల్సిన విషయమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

×
×
Ad

దర్శక రచయితలకు తాము అనుకున్న కథను చెప్పే పూర్తి స్వేచ్ఛ ఉండాలని, కానీ అదే సమయంలో సమాజం పట్ల బాధ్యత కూడా అంతే ముఖ్యమని అనసూయ గుర్తు చేశారు. సినిమా అనేది ప్రజల ఆలోచనలను, ప్రవర్తనను ప్రభావితం చేసే అత్యంత ప్రభావవంతమైన మాధ్యమమని, అందుకే క్రియేటివ్ ఫ్రీడమ్ మరియు సామాజిక బాధ్యత.. ఈ రెండూ పక్కపక్కనే సాగాలని అన్నారు. “నేను ఈ విషయాల గురించి మాట్లాడినప్పుడు కొందరు మోరల్ పోలీసింగ్ అంటారు. కానీ నా ఉద్దేశం సెన్సార్‌షిప్ చేయడం కాదు.. కేవలం అందరిలో ఒక సామాజిక స్పృహ పెంచాలనేదే నా తపన.”

ఈ పోస్ట్‌లో అనసూయ తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఒక సంచలన విషయాన్ని కూడా బయటపెట్టారు. గతంలో కొన్ని విషయాలపై తను తీసుకున్న స్టాండ్స్, చెప్పిన అభిప్రాయాల వల్ల.. మేకర్స్ క్రియేటివిటీకి తను అడ్డుపడుతున్నాననే భావన కల్పించారని, ఆ ఒత్తిడి భరించలేకే తాను ఒక పాపులర్ షో నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో తన ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన ప్లాట్‌ఫారమ్ దొరకక ఎన్నో ఇబ్బందులు పడ్డానని, అయినప్పటికీ తను నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడటానికి ఎప్పుడూ వెనకడుగు వేయలేదని ఆమె గర్వంగా చెప్పుకొచ్చారు.

సమాజంలో జరిగే ప్రతి తప్పుకూ సినిమా ఒక్కటే కారణం కాదని చెబుతూనే, సోషల్ మీడియాలో ఇలాంటి అంశాలపై లోతుగా చర్చిస్తూ.. క్రిటికల్ థింకింగ్‌ను ప్రోత్సహిస్తున్న నెటిజన్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తప్పును ఎత్తిచూపడం అంటే క్రియేటివిటీపై దాడి చేయడం కాదని, అదొక ఆరోగ్యకరమైన చర్చకు దారితీస్తుందని అన్నారు. చివరగా.. కథలు రాసేవారు, వాటిని తెరకెక్కించేవారు, నటులు మరియు చూసే ప్రేక్షకులు.. మనమంతా ఒకే ఎకో సిస్టంలో భాగమని, ఒక ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించడం మనందరి ఉమ్మడి బాధ్యత అని అనసూయ తన పోస్ట్‌లో ముగించారు.