గత యేడాది విడుదలైన రొమాంటిక్ మూవీ ‘నిన్నిలా నిన్నిలా’లో తొలిసారి జోడీ కట్టారు అశోక్ సెల్వన్, రీతూవర్మ. ఇప్పుడు మరోసారి ‘ఆకాశం’ మూవీలో వీరు జంటగా నటిస్తున్నారు. విశేషం ఏమంటే… ఆ సినిమాలో వీరితో పాటు నిత్యామీనన్ కీలక పాత్ర పోషించగా, ఈ తాజా చిత్రంలో ‘ఆకాశం నీహద్దురా’ ఫేమ్ అపర్ణ బాలమురళి, జీవితా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక నటిస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ వయాకామ్ 18, రైజ్ ఈస్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రానికి రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. అతనికి ఇదే తొలి చిత్రం. ఈ మూవీకి తమిళంలో ‘నిత్తమ్ ఒరు వానమ్’, తెలుగులో ‘ఆకాశం’ అనే పేర్లు ఖరారు చేసినట్టు సోమవారం తెలిపారు.
ఫీల్ గుడ్ ట్రావెలాగ్ ను తలపించే ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. చెన్నై, హైదరాబాద్, మనాలి, వైజాగ్, గోవా, ఢిల్లీ, చండీఘడ్, కోల్ కతా, పొల్లాచిలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. విధు అయ్యన సినిమాటోగ్రఫీ అందిస్తున్న ‘ఆకాశం’ మూవీ ఫస్ట్ లుక్, ఆడియో రిలీజ్ డేట్స్ ను త్వరలో తెలియచేయనున్నారు.