మొత్తానికీ ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ ప్రేమ పెళ్ళి పీటలకు చేరిపోయింది. మే 18, బుధవారం రాత్రి చెన్నయ్ లో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వారి పెళ్ళి జరిగింది. తేజ దర్శకత్వం వహించిన ‘ఒక వి చిత్రం’తో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి రెండో కొడుకు ఆది ఆ తర్వాత తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. అందులో ‘మృగం’ చిత్రం అతనికి నటుడిగా గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టింది. అక్కడ నుండి ఇక వెనుదిరిగి చూడలేదు. తెలుగులోనూ అడపాదడపా హీరోగా నటించినా, ప్రతినాయకుడిగా చేసిన చిత్రాలు మంచి విజయం సాధించడంతో అలాంటి పాత్రలే చేస్తున్నాడు. ఇప్పుడు కూడా రామ్ హీరోగా నటిస్తున్న ‘ది వారియర్’లో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు.
ఇక ‘బుజ్జిగాడు’ ఫేమ్ సంజనా గల్రానీ సోదరి అయిన నిక్కీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది. ఆది పినిశెట్టి హోమ్ ప్రొడక్షన్ ‘మలుపు’లో ఆమె హీరోయిన్ కాగా ఆది పినిశెట్టి సోదరుడు సత్య ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఆ తర్వాత ఆది సరసన నిక్కీ ‘మరకతమణి’ చిత్రంలోనూ నటించింది. ఆ సమయంలో చిగురించిన ప్రేమ చివరకు పెళ్ళికి దారితీసింది. గత నెలలో వీరి వివాహ నిశ్చితార్థం జరిగింది. పెద్దలు సైతం వీరి పెళ్ళకి పచ్చజెండా ఊపడంతో కథ సుఖాంతమైంది. ఆది పినిశెట్టి వివాహానికి సినీరంగానికి చెందిన అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. తెలుగు, తమిళ చిత్రసీమ ప్రముఖుల కోసం త్వరలోనే వీరు ఓ పార్టీ ఇవ్వబోతున్నట్టు తెలిసింది.