Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?

Aadarsha Kutumbam

Aadarsha Kutumbam

Aadarsha Kutumbam Postponed: విక్టరీ వెంకటేష్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడినట్లు సమాచారం. కొత్త రిలీజ్ డేట్‌గా అక్టోబర్ 9ను మేకర్స్ ఎక్కువగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ తేదీ సాధ్యం కాకపోతే అక్టోబర్ 16న సినిమాను రిలీజ్ చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దసరా పండుగ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొననున్న నేపథ్యంలో ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్‌ను మార్చాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 15, 16 తేదీల్లో ‘జైలర్ 2’, ‘రణబాలి’ వంటి భారీ చిత్రాలు బరిలోకి దిగుతున్న నేపథ్యంలో.. వాటికి ఒక వారం ముందుగానే అంటే అక్టోబర్ 9న ‘ఆదర్శ కుటుంబం’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ద్వారా సోలో రిలీజ్ అడ్వాంటేజ్ పొందాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం.

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘ఆదర్శ కుటుంబం’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ ‘చిట్టిబాబు’ అనే పాత్రలో కనిపించనున్నారు. భార్య చాటు భర్తగా ఆయన పాత్రలో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉండనున్నట్లు ఇటీవల రిలీజ్ అయిన ప్రచార చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె స్వర్ణ పాత్రలో కనిపించనుండగా.. నారా రోహిత్ శర్వ పాత్రలో నటిస్తున్నారు. యువినా పార్థవి సంపూర్ణ పాత్రలో కనిపించనుండగా, నివేదా పేతురాజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. అయితే అక్టోబర్ 2 నుంచి సినిమా వాయిదా పడిన విషయం, కొత్తగా అక్టోబర్ 9 లేదా 16 తేదీల్లో ఏదో ఒకదాన్ని ఖరారు చేయడం వంటి అంశాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి దసరా బరిలో భారీ సినిమాల పోటీ నేపథ్యంలో ‘ఆదర్శ కుటుంబం’ ఒక వారం ముందుకు వస్తుందా? లేక అక్టోబర్ 16నే విడుదల చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.