Ravi Teja: గత యేడాది చివరిలో ‘థమాకా’ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు మాస్ మహరాజా రవితేజ! అంతేకాదు… ఈ యేడాది ప్రారంభంలోనే సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’లో కీలక పాత్రను పోషించాడు. ఈ సినిమా శుక్రవారం జనం ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే… రవితేజ నటిస్తున్న మరో సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’ తాజా షెడ్యూల్ గురువారంతో పూర్తయ్యింది. ఎ.ఎ. ఆర్ట్స్ బ్యానర్ లో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. స్టూవర్ట్ పురం దొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా ఆయన సరసన నూపూర్ సనన్ నాయికగా నటిస్తోంది. మానవతావాది, నాస్తికోద్యమ నాయకురాలు హేమలతా లవణం పాత్రను పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పోషించడం విశేషం. అలానే ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలలో గాయత్రి భరద్వాజ్, మురళీశర్మ, షన్ముఖి తదితరులు కనిపించబోతున్నారు.
రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీగా ‘టైగర్ నాగేశ్వరరావు’ రూపుదిద్దుకుంటోంది. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, శ్రీకాంత్ విస్సా సంభాషణలు సమకూర్చుతున్నారు. ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ తో తాజా షెడ్యూల్ ను పూర్తి చేశామని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. దీనితో పాటు రవితేజ ‘రావణాసుర’ అనే చిత్రంలోనూ నటిస్తున్నాడు.
