నేడు దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ సినిమా పురస్కారాల వేడుక జరగనుంది. ఈ 67 వ జాతీయ సినిమా పురస్కారాల వేడుకలో రజినీకాంత్ వంటి పలువురు ప్రముఖులు అవార్డులు అందుకోనున్నారు. వాస్తవానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ఈ ఏడాది మార్చి లోనే ప్రకటించారు. అప్పట్లోనే అవార్డుల ప్రదానోత్సవం జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈరోజు జాతీయ పురస్కారాల ప్రదానోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై, అవార్డులను అందజేయనున్నారు. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ రజినీకాంత్ 51వ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోబోతున్నారు. రజినీకాంత్ నిన్ననే ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా మాత్రమే కాకుండా చెన్నైలోని పోలీస్ గార్డెన్ లో ఉన్న తన స్వగృహం వద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ తెలియజేశారు. ప్రేక్షకులకు, అలాగే తాను ఇంతవాడు కావడానికి సహకరించిన తన గురువు కె.బాలచందర్, స్నేహితుడు, తన అన్నయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఢిల్లీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోబోతున్న ట్లు ఆయన వెల్లడించారు.
Read Also : ప్రియుడితో రకుల్ బ్రేకప్… పాపులర్ జ్యోతిష్యుడి జోస్యం
కాగా మనోజ్ బాజ్ పేయి, కంగనా రనౌత్, ధనుష్ వంటి స్టార్స్ ఈ వేడుకలో ఉత్తమ నటుల పురస్కారం అందుకోబోతున్నారు. ఇక మహేష్ బాబు సినిమా సైతం ఈ వేడుకలో ప్రత్యేక కేటగిరీ కింద ఎంపికైంది. 2019 లో మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా ఉత్తమ వినోదాత్మక చిత్రం (హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం)గా ఎంపికైంది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు వంశీ పైడిపల్లి అవార్డును అందుకున్నారు.
