తెలుగు చిత్రసీమలో వెలుగు చూసిన మల్టీస్టారర్స్ లో విజయావారి ‘గుండమ్మ కథ’ ప్రత్యేక స్థానం సంపాదించింది. పలు విశేషాలకు నెలవుగా ‘గుండమ్మ కథ’ నిలచింది. పౌరాణిక బ్రహ్మగా పేరొందిన కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన సాంఘిక చిత్రాలు కొన్నే. వాటిలో ఘనవిజయం సాధించిన ఏకైక చిత్రం ‘గుండమ్మ కథ’. మహానటుడు యన్టీఆర్ నూరవ చిత్రంగా తెరకెక్కిన సినిమా కూడా ఇదే! ఈ చిత్రం తమిళ వర్షన్ ‘మనిదన్ మారవిల్లై’ మరో మహానటుడు ఏయన్నార్ కు వందో సినిమా కావడం ఇంకో విశేషం! యన్టీఆర్ – సావిత్రి, ఏయన్నార్ – జమున జంటలుగా నటించిన ‘మిస్సమ్మ’ చిత్రం 1955లో విడుదలై విజయం సాధించింది. ఆ సినిమాను నిర్మించిన విజయా సంస్థనే ఈ గుండమ్మ కథనూ ఆ జంటలతోనే తెరకెక్కించి ఘనవిజయం సాధించడం మరింత విశేషం! ఇలా పలు విశేషాలు చోటు చేసుకున్న ‘గుండమ్మ కథ’ చిత్రం 1962 జూన్ 7న విడుదలయింది.
‘గుండమ్మ కథ’ చిత్రానికి 1958లో బి.విఠలాచార్య తెరకెక్కించిన కన్నడ సినిమా ‘మనె తుంబిద హెన్ను’ ఆధారం. అప్పటికే కొన్ని కన్నడ, తెలుగు చిత్రాలు నిర్మించి, దర్శకత్వం వహించిన బి.విఠలాచార్య విజయా సినీ స్టూడియోస్ లోనే తన సినిమాలను రూపొందించేవారు. అలా విజయాధినేతలు నాగిరెడ్డి, చక్రపాణితో విఠలాచార్యకు సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తాను కన్నడలో తీసిన ‘మనె తుంబిద హెన్ను’ చిత్రాన్ని విజయాధినేతలకు ప్రదర్శించారు. అందులోని కథావస్తువు షేక్స్పియర్ ‘టేమింగ్ ఆఫ్ ద ష్రూ’ను పోలి ఉంది. అది చక్రపాణికి బాగా నచ్చింది. దానిని తెలుగులో టాప్ స్టార్స్ అయిన యన్టీఆర్, ఏయన్నార్ తో తెరకెక్కిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. చక్రపాణి పర్యవేక్షణలో డి.వి.నరసరాజు రచన చేయగా కొన్ని మార్పులూ చేర్పులూ చేశారు.
కథ ఏమిటంటే…?
ఓ ఊరిలో గయ్యాళిగా పేరు మోసిన గుండమ్మకు సవతి కూతురు లక్ష్మి, కొడుకు ప్రభాకర్, కూతురు సరోజ ఉంటారు. లక్ష్మిని పనిమనిషిలా చూస్తూ, సరోజను అతి గారాబం చేస్తూ ఉంటుంది గుండమ్మ. సరోజకు పెళ్ళి సంబంధాలు చూస్తూ ఉంటారు. రామభద్రయ్య అనే షావుకారుకు ఆంజనేయ ప్రసాద్, రాజా అనే ఇద్దరు కొడుకులు ఉంటారు. వారిలో ఒకరికి సరోజ సంబంధం వస్తుంది. చూడటానికి వెళ్ళిన రామభద్రయ్యకు గుండమ్మ భర్త తనకు మిత్రుడే అని తెలుస్తుంది. అక్కడ పరిస్థితి చూసి, లక్ష్మిని పెద్ద కొడుకుకు, సరోజను రాజాకు ఇస్తే బాగుంటుందని భావిస్తాడు రామభద్రయ్య. ఈ విషయం కొడుకులకు చెబుతాడు. కానీ, గుండమ్మ గయ్యాళితనం తెలిసి ఆమెను ఒప్పించి మరీ ఆమె కూతుళ్ళను పెళ్ళాడమని రామభద్రయ్య చెబుతాడు.
ఆంజనేయ ప్రసాద్ కాస్తా ‘అంజి’ పేరుతో గుండమ్మ ఇంట్లో పనివాడిగా చేరి, ఆమెను ‘గుండక్కా’ అంటూ పిలుస్తూ దగ్గరవుతాడు. లక్ష్మి మనసు ఆకర్షిస్తాడు. లక్ష్మిని తనకిచ్చి పెళ్ళి చేయమంటాడు. అందుకు గుండమ్మ అంగీకరిస్తుంది. అంజి, లక్ష్మి పెళ్ళవుతుంది. రాజా కూడా తాను రామభద్రయ్య అబ్బాయిననే వచ్చి, సరోజను ఆకర్షించి, పెళ్ళి చేసుకుంటాడు. తరువాత తాను తాగుబోతుగా నాటకమాడతాడు. అసలు తాను రామభద్రయ్య కొడుకునే కాదంటాడు. దాంతో సరోజ గొల్లుమంటుంది. అప్పటికే అంజి, రాజాకు అదే ఊళ్ళో ఉన్న బాబాయి వరసయ్యే ఆయన కూతురు పద్మను గుండమ్మ కొడుకు ప్రభాకర్ ప్రేమించి పెళ్ళాడతాడు. కావాలనే గుండమ్మతో గొడవ పెట్టుకొని తన భార్య లక్ష్మిని తీసుకువెళతాడు అంజి. పట్నం వెళ్ళాక లక్ష్మికి తన మామ రామభద్రయ్య అని, అంజి, రాజా ఇద్దరూ అన్నదమ్ములని తెలుస్తుంది. పెద్దకోడలుగా లక్ష్మి రాతనే మారిపోతుంది. ఆ ఇంటికి యజమానురాలుగా చెలామణీ అవుతుంది. రాజా, సరోజను ఇంటి నుండి బయటకు రమ్మని ఉత్తరం రాస్తాడు. సరోజ భర్తనే లోకమని భావించి, అతనితో వెళ్తుంది. తమ తోటలోనే తోటమాలిగా పనిచేస్తాడు రాజా. అక్కడే సరోజలో ఎంతో మార్పు వస్తుంది. గుండమ్మ కొడుకు తల్లిని పట్టించుకోడు. భార్యతో విహారయాత్ర వెళతాడు. అదే సమయంలో గుండమ్మ కోడలు మేనత్త వచ్చి, ఇంట్లో తిష్టవేసి ఆమెను నానా ఇబ్బందులకు గురి చేస్తుంది.
ఓ రోజున గారెలు తినాలని ఉంది, కూలి డబ్బులు తీసుకు రమ్మని సరోజను రామభద్రయ్య దగ్గరకు పంపిస్తాడు రాజా. ఆమె వెళ్ళి, ఇంట్లో పనులు చేయమన్నా చేసేసి, డబ్బులు అడుగుతుంది. అప్పుడు రామభద్రయ్యను చూసి ఆశ్చర్యపోతుంది. ఒకప్పుడు తాను హేళన చేయగా, తనను ఎగాదిగా చూసిన రామభద్రయ్యనే ఆయన అని తెలుసుకొని తల్లడిల్లుతుంది. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా నిలవలేక బయటకు పారిపోయి వస్తూ ఉండగా, అప్పుడే ఊరికి వెళ్ళి అక్కడ గుండమ్మ అగచాట్లు చూసి, తమతో తీసుకు వస్తుంటారు అంజి, లక్ష్మి. చెల్లెలు వెళ్ళిపోవడం చూసిన లక్ష్మి, కారు ఆపి సరోజను చేరుకుంటుంది. ఆమె ద్వారా రామభద్రయ్యనే తమ మామగారని, రాజా కూడా వాళ్ళబ్బాయే అన్న విషయం తెలుసుకుంటుంది లక్ష్మి. గుండమ్మను తమతో ఇంట్లోకి తీసుకువెళ్తూ, “గుండక్క… అల్లుడిరకం వచ్చింది…” అంటాడు అంజి. ‘ఇల్లరికం’కు వ్యతిరేకం ‘అల్లుడిరకం’ అనడంతో అందరూ నవ్వుతూ ఉండగా కథ ముగుస్తుంది.
‘గుండమ్మ కథ’ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ఇందులో అంజిగా నటించిన యన్టీఆర్ మొదట్లో క్లాస్ గా కనిపిస్తారు. చప్పున నిక్కరు వేసుకొని రామారావు తెరపై కనిపించగానే నవ్వులు పూస్తాయి. ఘంటన్నగా రమణారెడ్డి, ఆయన కొడుకు భూపతిగా రాజనాల కామెడీ విలనీ పండించారు. ఇక గుండమ్మగా సూర్యకాంతం, దుర్గమ్మగా ఛాయాదేవి నటించిన తీరు విశేషంగా ఆకట్టుకుంటుంది. లక్ష్మిగా సావిత్రి, సరోజగా జమున, రాజాగా ఏయన్నార్ తమ పాత్రలకు తగ్గట్టుగా కనిపిస్తారు. గుండమ్మ కొడుకుగా హరనాథ్, కోడలు పద్మగా ఎల్.విజయలక్ష్మి నటించగా, అల్లు రామలింగయ్య, హేమలత, మిక్కిలినేని, ఋష్యేంద్రమణి ఇతర పాత్రధారులు.
ప్రథమార్ధం అంతా యన్టీఆర్ పైన, ద్వితీయార్ధం ఏయన్నార్ తోనూ కథ సాగుతుంది. అయితే ప్రథమార్ధంలో పూసిన నవ్వులు రెండో సగంలో కనిపించవు. పాటలు మాత్రం అన్నీ ఆకట్టుకొనేలా రూపొందాయి. సందర్భోచితంగా పింగళి నాగేంద్రరావు పాటలు రాయగా, ఘంటసాల స్వరకల్పన చేసి ఆకట్టుకున్నారు. ఇందులోని “లేచింది మహిళా లోకం…”, “సన్నగ వీచే చల్లగాలికి…”, “కోలు కోలయన్న…”, “ఎంత హాయి ఈ రేయి…”, “మనిషి మారలేదు…”, “మౌనముగ మనసు పాడిన…”, “అలిగిన వేళనే చూడాలి…”, “ప్రేమయాత్రలకు బృందావనము…” అంటూ సాగే పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నాటికీ ఈ చిత్రంలోని పాటలు ఏదో ఒక రూపంలో జనాన్ని అలరిస్తూనే ఉండడం విశేషం! ఎప్పటిలాగే మార్కస్ బారట్లే కెమెరా పనితనం ఈ సినిమాను కూడా ప్రేక్షకులకు కనువిందు చేసేలా తెరకెక్కించింది.
ఎన్నెన్నో విశేషాలు…
‘గుండమ్మ కథ’ చిత్రం ఇరవైకి పైగా కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొని, రజతోత్సవం కూడా చూసింది. రిపీట్ రన్స్ లోనూ విశేషాదరణ చూరగొంది. విశేషమేమంటే, ‘గుండమ్మ కథ’ తెలుగు చిత్ర దర్శకుడు కె.కామేశ్వరరావు కెరీర్ లో ఇంతటి ఘనవిజయం సాధించిన సాంఘిక చిత్రం లేదు. ఇక తమిళ వర్షన్ ‘మనిదన్ మారవిల్లై’కు విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి దర్శకత్వం వహించారు. తెలుగు వర్షన్ యన్టీఆర్, తమిళ చిత్రం ఏయన్నార్ కు 100వ చిత్రాలు కావడం విశేషం! కాగా, తమిళంలో యన్టీఆర్ పాత్రను జెమినీగణేశన్, సూర్యకాంతం పాత్రలో సుందరీ బాయ్ నటించారు.
ఈ సినిమా ప్రివ్యూ చూసిన కేవీ రెడ్డి ఈ చిత్రానికి ‘గుండమ్మ కథ’ కంటే ‘గుండమ్మ కూతుళ్ళ కథ’ లేదా ‘గుండమ్మ అల్లుళ్ళ కథ’ అనే టైటిల్ పెట్టి ఉంటే బాగుండేదని అన్నారట! ఈ సినిమా తెలుగువారిని అలరించదు అని కేవీ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారట. ఆ తరువాత కూడా ఆయన ‘గుండమ్మ కథ’ ఎలా ఘనవిజయం సాధించిందో తనకు అంతుబట్టని విషయమే అంటూ చెప్పేవారట.
తొలుత ఈ చిత్రాన్ని బి.యన్.రెడ్డి దర్శకత్వంలో రూపొందించాలని భావించారట. అయితే బి.యన్.రెడ్డి వంటి క్లాస్ డైరెక్టర్ విఠలాచార్య లాంటి మాస్ డైరెక్టర్ తెరకెక్కించిన చిత్రాన్ని రీమేక్ చేయడం ఏమిటి అని చక్రపాణి ఆలోచించి, ఆ ప్రయత్నం విరమించుకున్నారట! తరువాత పి.పుల్లయ్యను దర్శకత్వం వహించమని కోరగా, ఆయనకు డి.వి.నరసరాజు స్క్రిప్ట్ నచ్చలేదట! చివరకు ‘చంద్రహారం’ చిత్రం ద్వారా తాము దర్శకునిగా పరిచయం చేసిన కమలాకర కామేశ్వరరావుకు డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించారు. సినిమా ఘనవిజయం సాధించేలా ఆయన తెరకెక్కించారు.
ఈ సినిమాకు ముందు ఏయన్నార్, జమున ‘దొంగల్లో దొర’ చిత్రంలో నటిస్తూ ఉండగా, వారి మధ్య ఏవో అభిప్రాయ భేదాలు తలెత్తాయి. దాంతో జమునతో ఏయన్నార్ నటించడం తగ్గించారు. యన్టీఆర్ కూడా అందుకు మద్దతు పలికారు. అలా ఇద్దరు అగ్రహీరోల చిత్రాల్లోనూ జమునకు పాత్రలు ఉండేవి కావు. అంతకు ముందు అంగీకరించిన సినిమాల్లో నటించారే తప్ప, కొత్త సినిమాలకు కమిట్ కాలేదు. అలా మూడేళ్ళ పాటు ఏయన్నార్, జమున కలసి నటించలేదు. ఆ సమయంలో వారి విషయం తెలిసిన నాగిరెడ్డి, చక్రపాణి ఇద్దరు అగ్ర కథానాయకులను, జమునను పిలిచి మాట్లాడి, రాజీ చేయించారు. ఆ పై యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలో మళ్ళీ జమున నటించసాగారు. అలా ఏయన్నార్ తో జమున కొంత గ్యాప్ తరువాత నటించిన చిత్రమిదే!
ఇక టైటిల్స్ విషయంలో ఎవరి పేరు ముందు వేసినా బాగోదని భావించిన నిర్మాతలు యన్టీఆర్, ఆయన కింద సావిత్రి ఫోటో ఎడమవైపున, ఏయన్నార్, ఆయన కింద జమున ఫోటో కుడివైపున వేసి, మధ్యలో యస్వీఆర్ ఫోటోనూ పొందు పరచి తారాగణం అని చూపించడం ఆకట్టుకుంటుంది. తరువాతి రోజుల్లో ఇదే సంప్రదాయాన్ని మల్టీస్టారర్స్ లో పలువురు అనుసరించడం విశేషం!
ఇందులో తొలుత ఏయన్నార్ కారు నడుపుతూ కనిపిస్తారు. ఆ కారు నిర్మాత నాగిరెడ్డి తనయులు బి.వెంకట్రామిరెడ్డి, బి.విశ్వనాథ్ రెడ్డికి చెందిన హెరాల్డ్ (ఎమ్.ఎస్.డబ్ల్యూ. 6009). ఇక వేరే సన్నివేశాల్లో యన్టీఆర్ కారు నడుపుతూ దర్శనమిస్తారు. అది నాగిరెడ్డికి చెందిన ఫోర్డ్ మెర్క్యురీ కారు.
‘గుండమ్మ కథ’ 1962లో విడుదలైన టాప్ గ్రాసర్స్ లో నంబర్ వన్ స్థానం ఆక్రమించుకుంది. ఈ చిత్రం శతదినోత్సవం భారీ ఎత్తున నిర్వహించాలని భావించారు. అయితే ఆ మొత్తాన్ని ‘జాతీయ రక్షణ నిధి’కి సమర్పించారు నిర్మాతలు. అప్పట్లో చైనా యుద్ధం మొదలయింది. ఆ నేపథ్యంలోనే నిర్మాతలు నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళమిచ్చారు. అదే బాటలో పలువురు తెలుగు నిర్మాతలు కూడా తమ విరాళాలు అందజేశారు.
మరో విశేషమేమిటంటే – ‘గుండమ్మ కథ’ ఫస్ట్ కాపీ సిద్ధమైన సమయంలోనే ప్రముఖ దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ కూతురు వివాహం విజయా గార్డెన్స్ లో జరిగింది. ఆ వేడుకలో ప్రముఖ నటి, నర్తకి వైజయంతి మాల నాట్యప్రదర్శన జరగాల్సి ఉంది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె కొయంబత్తూరులో చిక్కుకు పోయారు. దాంతో వచ్చిన అతిథులను నిరుత్సాహ పరచడం ఇష్టం లేక ‘గుండమ్మ కథ’ చిత్ర నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి, ఆ సినిమాను పెళ్ళికి వచ్చిన అతిథులకు ప్రదర్శించారు. యన్టీఆర్ నిక్కరు వేసుకొని తెరపై కనిపించగానే చూస్తున్నవారిలో ఉన్న పిల్లలు గొల్లున నవ్వారు. అదిచూసి చక్రపాణి మన సినిమా హిట్ అని నిశ్చయించుకున్నారు. ఆయన అన్నట్టుగానే సినిమా ఘనవిజయం సాధించింది. విచారమేమిటంటే, చక్రపాణి దర్శకత్వంలోనే తమిళంలో తెరకెక్కిన ‘మనిదన్ మారవిల్లై’ అపజయం పాలయింది. తెలుగులో నటించిన యన్టీఆర్, సూర్యకాంతం తమిళంలో నటించక పోవడమే ఆ సినిమా పరాజయానికి కారణమని తరువాత కొందరు విశ్లేషించారు.