Govula Gopanna: తెలుగు చిత్రసీమలో ద్విపాత్రాభినయం చేసిన తొలి స్టార్ హీరోగా నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నిలిచారు. 1961లోనే ‘ఇద్దరు మిత్రులు’లో ఏయన్నార్ డ్యుయల్ రోల్ లో కనిపించారు. ఏయన్నార్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రాలలో సక్సెస్ సాధించిన వాటిలో ‘గోవుల గోపన్న’ కూడా చోటు సంపాదించింది. ఈ చిత్రాన్ని రాజ్యం ప్రొడక్షన్స్ పతాకంపై లక్ష్మీరాజ్యం, శ్రీధరరావు నిర్మించగా, సి.యస్.రావు దర్శకత్వం వహించారు. 1968 ఏప్రిల్ 19న ‘గోవుల గోపన్న’ జనం ముందు నిలచింది. కన్నడలో రాజ్ కుమార్ ద్విపాత్రాభినయం చేసిన ‘ఎమ్మే తమ్మణ్ణ’ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
‘గోవుల గోపన్న’ కథ ఏమిటంటే – అమాయకుడైన గోవుల గోపన్న ఆవులు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని ఛైర్మన్ నాగరాజు కూతురు తార వాటిని కర్రతో బాదుతుంది. అది చూసి నొచ్చుకున్న గోపన్న ఆమెపై చేయి చేసుకుంటాడు. నాగరాజు తనకు అడ్డు తగిలేవారి తల తీసే రకం. అయితే అతని కొడుకు కస్తూరి మాత్రం హిరణ్యకశ్యపుని కడుపున పుట్టిన ప్రహ్లాదుడిలాంటివాడు. కూతురు తనను గోపన్న కొట్టాడని చెప్పగానే నాగరాజు తన రౌడీలను పంపి గోపన్నను చంపేయమని చెబుతాడు. కస్తూరి వెళ్ళి గోపన్నను రక్షించి, ధర్మాత్ముడైన ప్లీడర్ నరసింహం ఇంటికి వెళ్తే, ఆయనే నిన్ను రక్షిస్తాడని చెబుతాడు. ఈ నరసింహం తన కూతురు రాధను తన చిన్ననాటి మిత్రుడు శ్రీపతి కొడుకు శేఖర్ కు ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. ఆ శేఖర్ అచ్చు గోపన్నలాగే ఉంటాడు. శేఖర్ కూడా లాయర్. అందువల్ల నరసింహం వద్ద అసిస్టెంట్ గా పనిచేయడానికి వస్తున్నట్టు ఉత్తరం రాస్తాడు. ఈ శేఖర్ తండ్రి శ్రీపతితో కలసి నాగరాజు వ్యాపారం చేసి ఉంటాడు. అందువల్ల అతణ్ణి కూడా కలుసుకుంటూ ఉండమని శేఖర్ కు అతని తల్లి చెబుతుంది. అదే సమయంలో నరసింహం ఇంటికి వెళ్తాడు గోపన్న. అతణ్ణి నరసింహం భార్య, కూతురు రాధ ఎంతో అభిమానంగా చూసుకుంటారు. ఊరు చేరిన శేఖర్ ప్లీడర్ ఇంటికోసం వెదుకుతూ ఉంటే, నాగరాజు మనుషులు, అతను గోపన్న అనుకొని నాగరాజు ఇంటికి తీసుకువెళ్తారు. వారి నుండి తప్పించుకొని ఎట్టకేలకు నరసింహం ఇంటికి వచ్చిన శేఖర్ కు గోపన్న కలుస్తాడు. అచ్చు తనలాగే ఉన్న గోపన్న నుండి అసలు విషయం తెలుసుకుంటాడు. ఇక మీరొచ్చారు నే వెళ్తా అంటాడు గోపన్న. కానీ, శేఖర్ అతడిని అక్కడే ఉండమంటాడు. గోపన్నను శేఖర్ అనుకొని కొందరు, శేఖర్ ను గోపన్న అనుకొని మరికొందరు తికమక పడతారు. అలా శేఖర్, నాగరాజు కూతురు తార కలసుకుంటారు. తరువాత ప్రేమించుకుంటారు. వారిని చూసి రాధ, గోపన్ననే తారతో తిరుగుతున్నాడని అనుకుంటుంది. నరసింహం ఈ విషయం తెలిసి గోపన్నను బయటకు గెంటేస్తాడు. అసలు విషయం వచ్చి శేఖర్ చెబుతాడు. అప్పుడు నాగరాజు మోసం చేసి శేఖర్ తండ్రి శ్రీపతిని హత్య చేశాడని, అందుకు తగ్గ సాక్ష్యాలు తన డైరీలో ఉన్నాయని అంటాడు నరసింహం. అది విన్న నాగరాజు ఆ డైరీ కోసం అందరినీ కిడ్నాప్ చేస్తాడు. గోపన్న వచ్చి అందరినీ విడిపించడం కోసం పోరాడతాడు. నాగరాజు తప్పించుకోవాలని చూస్తాడు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. గోపన్నను అందరూ అభినందిస్తారు. చివరకు గోపన్నకు రాధతోనూ, శేఖర్ కు తారతోనూ పెళ్ళి కావడంతో కథ సుఖాంతమవుతుంది.
ఇందులో ఏయన్నార్ సరసన రాజశ్రీ, భారతి నాయికలుగా నటించారు. గుమ్మడి, రేలంగి, సూర్యకాంతం, చలం, సుకన్య, లక్ష్మీరాజ్యం, వంగర నటించారు. ఈ చిత్రానికి భమిడిపాటి రాధాకృష్ణ రచన చేయగా, పాటలను శ్రీశ్రీ, కొసరాజు, దాశరథి, ఆరుద్ర రాశారు. ఘంటసాల సంగీతం సమకూర్చారు. ఇందులోని “వినరా వినరా నరుడా…”, “హలో మిస్టర్ గోవుల గోపన్నా…”, “కన్నెల వలపుల…”, “ఈ విరితోటలో…”, “డమ్ డమ్ డ్రై క్లీనింగ్…” అంటూ సాగే పాటలు అలరించాయి. ‘వినరా వినరా…’ పాట రెండు వర్షన్స్ లో సాగుతుంది.
ఏయన్నార్ తన కెరీర్ లో రెండు సార్లు కృష్ణుని గెటప్ లో కనిపించారు. మొదటిది కేవీ రెడ్డి తెరకెక్కించిన ‘పెళ్ళినాటి ప్రమాణాలు’, రెండోది ఈ ‘గోవుల గోపన్న’. అందులో “రావే నా ముద్దుల రాధా…” అంటూ సాగే పాటలోనూ, ఇందులోని “కన్నియ వలపుల వెన్నలు దోచే…” అంటూ మొదలయ్యే పాటలో ఏయన్నార్ కృష్ణుని గెటప్ లో కనిపిస్తారు. ‘గోవుల గోపన్న’ సక్సెస్ తో ఈ కథను హిందీలో ‘జగ్రీ దోస్త్’ పేరుతో జితేంద్ర హీరోగా రీమేక్ చేశారు. అలాగే ఎమ్జీఆర్ డ్యుయల్ రోల్ లో ఆ తరువాత తమిళంలో ‘మట్టుకర వేలన్’పేరుతో తీశారు. తెలుగులో ‘గోవుల గోపన్న’ అలరించింది. శతదినోత్సవం చూసింది. రిపీట్ రన్స్ లోనూ మంచి ఆదరణ చూరగొంది.