NTV Telugu Site icon

50 ఏళ్ళ ‘పాకీజా’

అనుకున్నామ‌ని జ‌ర‌గ‌వు అన్నీ, అనుకోలేద‌ని ఆగ‌వు కొన్ని అన్నారు పెద్ద‌లు. అదే తీరున నాటి మేటి న‌టి మీనాకుమారి, ఆమె భ‌ర్త క‌మ‌ల్ ఆమ్రోహి త‌మ పాకీజా చిత్రం గురించి ఎన్నెన్నో అనుకున్నారు. అయితే ఆ సినిమా ఏ ముహూర్తాన మొద‌ల‌య్యిందో కానీ, ప‌లు బాలారిష్టాలు ఎదుర్కొని చివ‌ర‌కు 1972 ఫిబ్ర‌వ‌రి 4న జ‌నం ముందు నిల‌చింది. 1956లో షూటింగ్ మొద‌లు పెట్టుకున్న పాకీజా దాదాపు 16 ఏళ్ళ త‌రువాత ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ సినిమా విడుద‌లైన కొద్ది రోజుల‌కే మీనా కుమారి క‌న్నుమూశారు. దాంతో మీనాకుమారి అభిమానులు పాకీజాను చూడ‌టానికి థియేట‌ర్ల‌కు ప‌రుగులు తీశారు. సినిమా స్వ‌ర్ణోత్స‌వం జ‌రుపుకుంది.

పాకీజా క‌థ విష‌యానికి వ‌స్తే – ల‌క్నోలోని న‌ర్త‌కీమ‌ణుల్లో ఒక‌రైన న‌ర్గిస్ ను ఉన్న‌త వంశానికి చెందిన షాబుద్దీన్ ప్రేమిస్తాడు. తానుండే వేశ్యాగృహం నుండి పారిపోయి, షాబుద్దీన్ తో జీవితం గ‌డ‌పాల‌నుకుంటుంది న‌ర్గిస్. అయితే షాబుద్దీన్ పెద్ద‌లు వారి ప్రేమ‌ను అంగీక‌రించ‌రు. అప్ప‌టికే గ‌ర్భ‌వ‌తి అయిన న‌ర్గిస్ ఓ ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చి, షాబుద్దీన్ కు ఓ లేఖ రాసి క‌న్నుమూస్తుంది. ఆ బిడ్డ‌ను ఆమె చెల్లెలు చూసుకుంటుంది. న‌ర్గీస్ న‌గ‌లు, వ‌స్తువులు చాలా రోజుల త‌రువాత ఓ వ్య‌క్తికి ల‌భిస్తాయి. అందులోనే షాబుద్దీన్ కు రాసిన ఉత్త‌రం దొర‌కుతుంది. అది షాబుద్దీన్ కు చేరుతుంది. త‌రువాత కూతురు కోసం గాలిస్తాడు షాబుద్దీన్. ఫ‌లితం ఉండ‌దు. న‌ర్గిస్ కూతురు సాహిబ్ జాన్ పెరిగి పెద్ద‌యి అచ్చు త‌ల్లి పోలిక‌ల‌తో ఉంటుంది. సాహిబ్ జాన్ రైలు ప్ర‌యాణం చేస్తూండ‌గా ఓ వ్య‌క్తి, ఆమె అందానికి మోహించి, ఓ లేఖ రాసి, ఆమె పాదాల వద్ద పెట్టి పోతాడు. అత‌ని పేరు స‌లీమ్ అని తెలుసుకుంటుంది. సాహిబ్ జాన్ అత‌నిపై మ‌న‌సు పారేసుకుంటుంది. చివ‌ర‌కు స‌లీమ్, సాహిబ్ జాన్ క‌ల‌సుకుంటారు. ప్రేమించుకుంటారు.

అయితే స‌లీమ్ ఉన్న‌త కుటుంబానికి చెందిన వాడు కాబ‌ట్టి, త‌న‌ను పెళ్ళి చేసుకుంటే అత‌నికి అవ‌మానం ఎదుర‌వుతుంద‌ని భావిస్తుంది సాహిబ్ జాన్. దాంతో మ‌ళ్ళీ వెళ్ళి పాట‌లు పాడుకుంటూ ఉంటుంది. భ‌గ్న హృద‌యంతో స‌లీమ్ త‌న బంధువుల అమ్మాయినే పెళ్ళి చేసుకోవాల‌ని నిశ్చ‌యిస్తాడు.ఆ వివాహానికి ముందు సాగే ఉత్స‌వంలో సాహిబ్ జాన్ పాట‌లు పాడ‌టానికి వ‌స్తుంది. ఆ పెళ్ళిలో సాహిబ్ జాన్ త‌ల్లి చెల్లెలు షాబుద్దీన్ ను గుర్తిస్తుంది. షాబుద్దీన్ కు సాహిబ్ జాన్ అత‌ని కూతురేన‌ని చెబుతుంది. షాబుద్దీన్ తండ్రి సాహిబ్ జాన్ పిన్నిని చంపాల‌నుకుంటాడు. ఆమెను కాపాడే క్ర‌మంలో షాబుద్దీన్ కు గుండు త‌గ‌లుతుంది. చివ‌రి నిమిషంలో త‌న కూతురైన సాహిబ్ జాన్ నుపెళ్ళాడాల‌ని స‌లీమ్ ను కోర‌తాడు. స‌లీమ్, సాహ‌ఙ‌బ్ జాన్ కోసం ఆమె ఉండే కోఠాకు పోవ‌డంతో క‌థ ముగుస్తుంది.

ఇందులో న‌ర్గిస్, సాహిబ్ జాన్ పాత్ర‌ల్లో మీనాకుమారి న‌టించారు. షాబుద్దీన్ గా అశోక్ కుమార్, స‌లీమ్ గా రాజ్ కుమార్ అభిన‌యించారు. వీణ, న‌దిరా, డి.కె.స‌ప్రూ, క‌మ‌ల్ క‌పూర్, విజ‌య‌ల‌క్ష్మి ఇత‌ర పాత్ర‌ధారులు. ఈ చిత్రానికి క‌మ‌ల్ ఆమ్రోహి ర‌చ‌న చేసి, ద‌ర్శ‌క‌త్వ‌, నిర్మాణ బాధ్య‌తలు నిర్వ‌ర్తించారు. ఈ సినిమా ప‌లు ఆటంకాలు ఎదుర్కుంటూ పూర్త‌యింది. అందువ‌ల్ల కొన్ని సీన్స్ లో మీనా కుమారి వ‌య‌సు మ‌ళ్లి కనిపిస్తారు. అయితే అందరూ క‌మ‌ల్ ఆమ్రోహిపై గౌర‌వంతో ఈ సినిమా పూర్తి కావ‌డంలో స‌హ‌క‌రించారు. ఈ చిత్రంలో అన్ని క‌లిపి 20 పాట‌ల దాకా ఉంటాయి. వీటిలో 15 పాట‌ల‌కు గులామ్ మొహ్మ‌ద్ సంగీతం స‌మ‌కూర్చారు. వాటిలో కేవ‌లం ఆరు పాట‌ల‌నే సినిమాలో ఉప‌యోగించుకున్నారు. ఈ సినిమా పూర్తి కాకుండానే గులామ్ మొహ్మ‌ద్ క‌న్నుమూశారు. దాంతో క‌మ‌ల్ ఆమ్రోహి కోరిక మేర‌కు ప్ర‌ఖ్యాత సంగీత ద‌ర్శ‌కులు నౌష‌ద్ నాలుగు పాట‌ల‌కు స్వ‌ర‌క‌ల్ప‌న చేశారు. నేప‌థ్య సంగీతాన్ని కూడా నౌష‌ద్ అందించారు. ఇందులోని పాట‌ల‌ను మ‌జ్రూ సుల్తాన్ పురి, ఖైఫీ అజ్మీ, ఖైఫ్ భోపాలి, క‌మ‌ల్ ఆమ్రోహి, మీర్ త‌కీ మీర్ రాశారు. గులామ్ స్వ‌రాల్లో రూపొందిన చ‌ల్ తే చ‌ల్ తే..., మోసం హై ఆషికానా..., చ‌లో దిల్ ద‌ర్ చ‌లో... పాట‌లు అల‌రించాయి. ఇక నౌష‌ద్ బాణీల్లో రూపొందిన థీమ్ మ్యూజిక్, మోరా సాజ‌న్..., కౌన్ గ‌లీ గ‌యో..., న‌జ‌రియా కీ మారీ... వంటి పాట‌లు అల‌రించాయి. మొద‌ట్లో అన్ని పాట‌ల ఆడియో విడుద‌లై సంగీతాభిమానుల‌ను విశేషంగా అల‌రించాయి. సినిమాలోని పాట‌ల చిత్రీక‌ర‌ణ సైతం ఆక‌ట్టుకుంది. 1972లో విడుద‌లైన టాప్ గ్రాస‌ర్స్ లో పాకీజా కూడా ఒక‌టిగా నిల‌చింది.

పాకీజా చిత్రం షూటింగ్ మొద‌లైన దాదాపు 16 ఏళ్ళ‌కు విడుద‌లైనా, ఈ సినిమా పెట్టుబ‌డికి నాలుగింత‌లు రాబ‌డిచూసింది. అయితే అప్ప‌టికే క‌మ‌ల్ ఆమ్రోహి, మీనా కుమారి విడిపోయారు. ఈ సినిమా విడుద‌లైన కొన్నాళ్ళ‌కే మీనా కుమారి మ‌ర‌ణించారు. ఈ సినిమా ఘ‌న‌విజ‌యం సాధించాల‌న్న మీనాకుమారి అభిలాష నెర‌వేరినా, ఆ విజ‌యోత్స‌వాన్ని చూడ‌కుండానే ఆమె క‌న్నుమూయ‌డం అభిమానుల‌కు ఆవేద‌న క‌లిగించింది. దాంతో పాకీజాను ప‌దే ప‌దే చూసి ఆనందించారు మీనా కుమారి ఫ్యాన్స్. ఈ నాటికీ పాకీజాలోని పాట‌లు సంగీత‌ప్రియుల‌ను ఆక‌ట్టుకుంటూనే ఉండ‌డం విశేషం!