45 Years Of Sati Savitri: కొన్ని సినిమాల్లో కథానుగుణంగా కొందరు నటీనటులు వేసిన చిన్న వేషాలే, తరువాతి రోజుల్లో సదరు నటులతోనే పూర్తి స్థాయిలో చిత్రాలుగా రూపొందిన సంఘటనలు తెలుగు చిత్రసీమలో చోటు చేసుకున్నాయి. అలా మహానటుడు నటరత్న యన్.టి.రామారావు నటజీవితంలో కొన్ని పాత్రలు మొదట బిట్ రోల్స్ లో కనిపించి, తరువాత పూర్తి స్థాయిలో అలరించిన సందర్భాలున్నాయి. ఆయన శ్రీరామునిగా తెరపై కనిపించిన తొలి చిత్రం ‘చరణదాసి’. అందులో ఓ డ్రీమ్ సాంగ్ లో యన్టీఆర్ శ్రీరామునిగా దర్శనమిచ్చారు. తరువాత యన్టీఆర్ తో పూర్తి స్థాయిలో ‘సంపూర్ణ రామాయణం’ రూపొంది ఘనవిజయం సాధించింది. తరువాత ‘చరణదాసి’ చిత్ర నిర్మాత ఏ.శంకర్ రెడ్డి అందులో సీతారాములుగా నటించిన అంజలి, యన్టీఆర్ తోనే ‘లవకుశ’ వంటి కళాఖండాన్ని తెరకెక్కించి చరిత్రలో నిలచిపోయేలా చేశారు. ఇక ‘ఇద్దరు పెళ్ళాలు, సొంతవూరు’ వంటి సాంఘికాలలో శ్రీకృష్ణుని గెటప్ లో కనిపించిన రామారావు, ఆ పైన ‘మాయాబజార్’లో తొలిసారి పూర్తి స్థాయిలో శ్రీకృష్ణ పాత్ర పోషించి, ఆ పాత్రకు మారుపేరుగా నిలిచారు. యన్టీఆర్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ‘రాముడు-భీముడు’లో ఓ నాటకంలో భీమునిగా కనిపించిన యన్టీఆర్, ఆ పై ‘పాండవవనవాసము’లో ఏకంగా భీమపాత్రలోనే జీవించేశారు. అదే తీరున తమ సొంత చిత్రం ‘ఉమ్మడి కుటుంబం’లో ఓ నాటకంలో యన్టీఆర్ యమధర్మరాజుగా, వాణిశ్రీ సావిత్రిగా కనిపించారు. తరువాతి రోజుల్లో వారిద్దరినీ ఆ పాత్రల్లో నటింప చేస్తూ ‘లవకుశ’ శంకర రెడ్డి ‘సతీ సావిత్రి’ చిత్రాన్ని నిర్మించారు. సదరు చిత్రం 1978 జనవరి 4న జనం ముందు నిలచింది. ఈ చిత్రానికి బి.ఏ.సుబ్బారావు దర్శకత్వం వహించారు.
‘సతీ సావిత్రి’ మహాపతివ్రత. ఆమె కథ జగద్విదితము. అదే కథకు కొన్ని భారీ హంగులు చేర్చి రంగుల్లో ఈ ‘సతీ సావిత్రి’ని రూపొందించారు. అశ్వపతి మహారాజు ఏకైక పుత్రిక సావిత్రి, ఆమె ద్యూమత్సేన మహారాజు కొడుకు సత్యవంతుని వివాహం చేసుకుంటుంది. రాజ్యభ్రష్టులైన సత్యవంతుని కుటుంబం అడవిలో జీవిస్తూ ఉంటుంది. భర్తతోనే జీవితంగా సావిత్రి సైతం అక్కడే జీవిస్తుంది. సత్యవంతుని జాతకప్రకారమే ఆయన అల్పాయుష్కుడు. దాంతో వివాహమైన ఏడాదికే కన్నుమూస్తాడని చెప్పి ఉంటారు. అదే తీరున కట్టెలు కొడుతూ ఉన్న సత్యవంతుని పాము కాటు వేస్తుంది. అతను మరణించగా, యమధర్మరాజు అతని ప్రాణములు కొనిపోతూ ఉంటాడు. ఆయనను అడ్డగించి తన పాతివ్రత్యంతో చాకచక్యంగా మాట్లాడి పతి ప్రాణములు సంపాదించుకుంటుంది సావిత్రి. ఆమె తెలివితేటలకు మెచ్చిన యమధర్మరాజు ఆ దంపతులును ఆశీర్వదించి, వారికి రాజ్యము, భోగభాగ్యాలు అనుగ్రహించడంతో కథ ముగుస్తుంది.
Read Also: Rashmika Mandanna: సమంతపై రష్మిక సంచలన వ్యాఖ్యలు.. ఒక అమ్మలా రక్షించాలని ఉంది
లలితా శివజ్యోతి సినీస్టూడియోస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో యమధర్మరాజుగా ఎన్టీఆర్, సావిత్రిగా వాణిశ్రీ, సత్యవంతునిగా కృష్ణంరాజు నటించారు. మిగిలిన పాత్రల్లో గుమ్మడి, కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, ధూళిపాల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, రాజబాబు, జమున, అంజలీదేవి, పండరీబాయి, రమాప్రభ, మాధవి, మమత, కె.ఆర్.విజయ, కాంచన, కేవీ చలం, నాగరాజు, పి.జె.శర్మ, చలపతిరావు, జగ్గారావు కనిపించారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు ఆచార్య ఆత్రేయ అందించారు. అయితే పద్యాలను సి.నారాయణ రెడ్డి, నృత్య గీతాన్ని కొసరాజు, దండకాన్ని పిలకా గణపతి శాస్త్రి, మంత్రములు కల్లూరి వీరభద్ర శాస్త్రి రాశారు. ఈ చిత్రంలోని మొదటి రెండు పాటలకు ఘంటసాల సంగీతం సమకూర్చారు. ఆయన 1974లో కన్నుమూసిన తరువాత గ్యాప్ వచ్చింది. తరువాత పెండ్యాల ఈ సినిమా స్వరకల్పన బాధ్యతలు నిర్వహించారు. ఇందులోని “ఓం నాదబిందు కళాధారి..”, “ఏమిటో ఈ పులకరింత..”, “అడుగడుగున కొత్తదనం..”, “ధర్మమా ఏది ధర్మరాజా…”, “ఏ మాతా జగన్మాతా…” అంటూ సాగే పాటలు అలరించాయి.
ఈ చిత్రానికి 21 ఏళ్ళ ముందు అంటే 1957లో యస్.వరలక్ష్మి సావిత్రిగా, ఏయన్నార్ సత్యవంతునిగా, యస్వీఆర్ యమధర్మరాజుగా నటించిన ‘సతీసావిత్రి’ చిత్రం విడుదలయింది. కె.బి.నాగభూషణం దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం 1957 సంక్రాంతి సంబరాల్లోనే విడుదలయింది. మంచి విజయం సాధించింది. అంతకు ముందు కూడా తెలుగు చిత్రసీమలో ‘సతీ సావిత్రి’ కథతో కొన్ని చిత్రాలు వెలుగు చూశాయి. 1977లో యన్టీఆర్ ‘యమగోల’ అనే సోషియో ఫాంటసీలో నటించారు. అందులో ఆయన పేరు సత్యం, ప్రేయసి పేరు సావిత్రి. వారిద్దరి ప్రేమకథ, తరువాత యముడు, చిత్రగుప్తుడు భూలోకం రావడం, సత్యంను తమతో తీసుకుపోవాలని చూస్తే, తెలివిగా యమధర్మరాజును బురిడీ కొట్టించి, సత్యవంతుడు భూలోకంలోనే ఉండేలా వరం పొందడం చోటు చేసుకున్నాయి. అదే ‘యమగోల’లో సత్యవంతుని పాత్రను పోలిన పాత్ర ధరించిన యన్టీఆర్ ‘సతీ సావిత్రి’లో యమధర్మరాజుగా నటించడం అప్పట్లో ఆసక్తికరమైన చర్చకు తావిచ్చింది. నిర్మాత ఏ.శంకర రెడ్డి ‘సతీసావిత్రి’ చిత్రాన్ని రాజీలేకుండా నిర్మించారు. కానీ, చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.
(జనవరి 4న ‘సతీసావిత్రి’కి 45 ఏళ్ళు)