Actor Nandamuri Taraka Ramarao “Kaliyuga Ramudu” Movie Released 40 Years Ago.
కథలో పట్టు లేకపోతే, ఎంతటి సూపర్ స్టార్ నటించిన చిత్రమైనా ప్రేక్షకాదరణకు నోచుకోదు. మహానటుడు నటరత్న యన్.టి.రామారావు నటించిన చిత్రాలలోనూ అలాంటి సినిమాలు లేకపోలేదు. పైగా ‘రాముడు’ అన్న టైటిల్ తో రూపొందిన చిత్రాలలో యన్టీఆర్ సినిమాలు జనాన్ని నిరాశ పరచిన సందర్భాలు తక్కువే! అలాంటి చిత్రాల కోవకు చెందిన సినిమానే ‘కలియుగ రాముడు’. కె.బాపయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1982 మార్చి 13న విడుదలయింది.
‘కలియుగ రాముడు’ చిత్ర కథ ఏమిటంటే, రాము ఓ సీబీఐ ఆఫీసర్. అతని చెల్లెలు సావిత్రిని రంజిత్ పెళ్ళి చేసుకుంటాడు. రంజిత్ ఓ నేరస్థుడు. రాముకు సంధ్య అనే అమ్మాయి తారసపడుతుంది. రామును వెంటాడే పనిలో ఆమె ఉంటుంది. ఆమె తండ్రి ఓ సైంటిస్ట్. అతనిని బంధించి, అతను దేశానికి ఉపయోగపడే ఓ ఫార్ములా తయారు చేయగా దానిని సొంతం చేసుకోవాలని రంజిత్ తపన. అలాగే సంధ్యతో రాముపై నిఘా వేయిస్తాడు. ఓ పథకం ప్రకారమే రంజిత్, రాము చెల్లెలిని పెళ్ళాడి ఉంటాడు. చెల్లెలి ముఖం చూసయినా రాము తనను రక్షిస్తాడనే ధీమాతో ఉంటాడు రంజిత్. అయితే రాముకు అన్ని విషయాలు తెలుస్తాయి. అయినా రంజిత్ ను వెంటాడుతాడు. దుర్మార్గుడైన రంజిత్ కారణంగా రాము చెల్లెలు చనిపోతుంది. దాంతో రాము, రంజిత్ ను వదలడు. రామును కాల్చబోయి రంజిత్ ప్రాణాలు కోల్పోతాడు. రాము ఫార్ములాను కాపాడడంతో అతనికి సన్మానం జరుగుతుంది. కథ సుఖాంతమవుతుంది.
తిరుపతి ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ డి.వి.యన్.రాజు సమర్పణలో డి.శ్రీరంగరాజు ‘కలియుగరాముడు’ చిత్రాన్ని నిర్మించారు. అంతకు ముందు ఈ సంస్థాధినేతలు యన్టీఆర్ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘సింహబలుడు’ చిత్రం నిర్మించారు. ‘కలియుగ రాముడు’ చిత్రానికి చరణ్ దాస్ షోక్ కథ అందించగా, ఆచార్య ఆత్రేయ మాటలు- పాటలు పలికించారు. అప్పలాచార్య హాస్య రచన తోడయింది. కేవీ మహదేవన్ స్వరకల్పన చేశారు. నందమూరి మోహనకృష్ణ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్.
యన్టీఆర్ సరసన రతి అగ్నిహోత్రి నాయికగా నటించిన మూడో చిత్రమిది. అంతకు ముందు ‘ప్రేమసింహాసనం, తిరుగులేని మనిషి’ చిత్రాలలో యన్టీఆర్ తో జోడీ కట్టింది. ఇందులో కవిత, ఎస్.వరలక్ష్మి, జయమాలిని, జయవిజయ, నిర్మలమ్మ, సత్యనారాయణ, జగ్గయ్య, కాంతారావు, ముక్కామల, మిక్కిలినేని, ప్రభాకర్ రెడ్డి, పి.జె.శర్మ, చలపతిరావు, ఆనంద్ మోహన్, భీమరాజు, విజయరంగరాజా నటించారు. ఇందులోని “నదులకు మొగుడు సముద్రమంట…”, “ఆనందో బ్రహ్మ…”, “హల్లా గుల్లా…” వంటి పాటలు అలరించాయి. ‘కలియుగ రాముడు’ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఈ చిత్రం విడుదలైన 16 రోజులకే అంటే 1982 మార్చి 29న యన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీని ప్రకటించారు. ఆ తరువాత వరుసగా వచ్చిన ‘జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి’ అనూహ్య విజయాలను సొంతం చేసుకోవడం విశేషం!