Rudra Veena: తెలుగునాట స్టార్ హీరోస్ సొంత నిర్మాణ సంస్థలతో జనాన్ని ఆకట్టుకొనే చిత్రాలు నిర్మించారు. తెలుగు చిత్రసీమలో ఈ పంథా చిత్తూరు నాగయ్య కాలం నాటి నుంచీ ఉంది. వారి బాటలోనే ఆ తరువాతి స్టార్స్ సైతం పయనిస్తూ సొంత నిర్మాణ సంస్థలతో తమ అభిరుచికి తగ్గ చిత్రాలు నిర్మించారు. యన్టీఆర్ తమ ‘యన్.ఏ.టి.’ పతాకంపై తొలి ప్రయత్నంగా ‘పిచ్చిపుల్లయ్య’ చిత్రం నిర్మించారు. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా పరాజయం పాలయింది. అదే తీరున కృష్ణ తమ పద్మాలయా పతాకంపై మొదటి సినిమాగా ‘అగ్నిపరీక్ష’ రూపొందించారు. అదీ అంతగా ఆకట్టుకోలేక పోయింది. చిరంజీవి తమ సొంత సంస్థ ‘అంజనా ప్రొడక్షన్స్’ పతాకంపై తొలి చిత్రంగా ‘రుద్రవీణ’ను నిర్మించారు. ఈ సినిమా సైతం అవార్డులకే పరిమితమయింది కానీ, ప్రేక్షకుల రివార్డులు పొందలేక పోయింది. యన్టీఆర్ సొంత చిత్రాలకు ఆయన తమ్ముడు యన్.త్రివిక్రమరావు నిర్మాతగా వ్యవహరించేవారు. అదే పంథాలో కృష్ణ సోదరులు జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు నిర్మాతలుగా వ్యవహరించేవారు. వారిలాగే చిరంజీవి సైతం తమ సోదరులు నాగబాబు, కళ్యాణ్ ను భాగస్వాములుగా చేసి తొలి ప్రయత్నంలో నిర్మించిన చిత్రం ‘రుద్రవీణ’. కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1988 మార్చి 4న విడుదలయింది.
పార్లమెంట్ సభ్యుడు సత్యనారాయణ ప్రయాణంలో రామాపురం అనే ఊరిని సందర్శిస్తాడు. ఆ ఊరిలో నేరాలు జరగవని, తాగుడు ఉండదని తెలుసుకుంటాడు. అందుకు కారణం చినబాబు అనే సూర్యం అని తెలుస్తుంది. అతడిని కలుసుకుంటాడు సత్యనారాయణ. సూర్యం తన కథ చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. సంగీత విద్వాంసులు ‘బిలహరి’ గణపతి శాస్త్రికి, ఇద్దరు కొడుకులు, ఓ అమ్మాయి. సంప్రదాయమంటే గణపతి శాస్త్రికి ప్రాణం. పట్టింపులు జాస్తి. ఆయన చిన్నకొడుకు సూర్యనారాయణ శాస్త్రికి సాటి మనిషికి సాయం చేయడంలోనే ఆనందముందనే నమ్మకం. తండ్రీకొడుకుల నడుమ సిద్ధాంతపర విభేదాలు ఉంటాయి. వరాలయ్య అనే లాయర్ కూతురు లలిత శివజ్యోతి. ఆమె క్లాసికల్ డాన్సర్. ఆమె ఆటకు సూర్యం పాటకు జోడీ కలుస్తుంది. ఆ అమ్మాయి తమ కులం కాదని గణపతి శాస్త్రి భావన. తమ పెళ్ళిని ఆమోదించని తండ్రితో విభేదించి లలితను పెళ్ళాడాలనుకుంటాడు సూర్యం. అంతకు ముందు ఆ ఊరిలో తాగుబోతులకు, మద్యం దుకాణం దారుకు తగిన బుద్ధి చెప్పిఉంటాడు సూర్యం. అది తెలిసి, గణపతి శాస్త్రి ఎలాగైనా తన కొడుకు పెళ్ళి లలితతో జరగకూడదని, వారిని రెచ్చగొడతాడు. వారు వెళ్ళి, సూర్యం పెళ్ళిలో గొడవ చేస్తారు. వారికేం కావాలని సూర్యం అడుగుతాడు. మీరు ఈ పెళ్ళి చేసుకోకుంటే, తాము మందు ముట్టమని తాగుబోతులు అంటారు. అలాగే మద్యం దుకాణదారుడు పెళ్ళి మానేస్తే ఈ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల ఎక్కడా తమవాళ్ళ మద్యం దుకాణాలు ఉండకుండా చేస్తానని సవాల్ చేస్తాడు. అందుకు సూర్యం, లలిత అంగీకరిస్తారు. వారి నిర్ణయంతో ఊరిలోని తాగుడు బానిసల్లో మార్పు వస్తుంది. ఆ ఊరి జనం కలసి మెలసి వ్యవసాయం చేసుకుంటూ ఊరిని సమష్టిగా అభివృద్ధి చేసుకొని ఉంటారు. దాంతో ఆ ఊరి జనం సూర్యంను దేవునిలా భావిస్తూ ఉంటారు. ఈ కథ విన్న సత్యనారాయణ ‘దేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు… నీ లాంటి సూర్యాలు కావాలి… అప్పుడే దేశం అన్నిరంగాల్లోనూ వెలిగిపోతుంది…” అని అంటాడు. ఎం.పి.సత్యనారాయణ ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రధాని ఆ గ్రామాన్ని, సూర్యాన్ని చూడాలని స్వయంగా వస్తున్నారని తెలుస్తుంది. దాంతో గణపతి శాస్త్రిని వెదుక్కుంటూ విలేఖరులు వస్తారు. దశాబ్ది యువకునిగా సూర్యంకు ప్రధానమంత్రిచేతుల మీదుగా సన్మానం చేసే రోజు వస్తుంది. ఆ సందర్భంగా ప్రధాని సూర్యాన్ని అభినందిస్తూ ప్రసంగిస్తారు. అక్కడకు గణపతి శాస్త్రి వస్తాడు. ‘సంగీతమే ప్రపంచమని బ్రతికిన నాకు… సంఘహితమే సంగీతం అని తెలియజేశాడు నా బిడ్డ…” అంటూ గణపతి శాస్త్రి చెబుతాడు. తన తప్పు తెలుసుకొని, అదే వేదికపై సూర్యం, లలిత చేతులు కలిపి ఆశీర్వదిస్తాడు. సూర్యం, లలిత మళ్ళీ తమ సంఘహితం కోసం మళ్ళీ నడుం బిగించడంతో కథ ముగుస్తుంది.
చిరంజీవి సరసన శోభన నాయికగా నటించిన ఈ చిత్రంలో జెమినీగణేశన్, పి.యల్.నారాయణ, ప్రసాద్ బాబు, సుమిత్ర, రమేశ్ అరవింద్, దేవీలలిత, బ్రహ్మానందం, ఫైట్ మాస్టర్ రాజు, అతిథి పాత్రలో సత్యనారాయణ నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కె.బాలచందర్ నిర్వహించారు. గణేశ్ పాత్రో సంభాషణలు రాశారు. ఇళయరాజా బాణీలకు అనువుగా సీతారామశాస్త్రి పాటలు పలికించారు. ఇందులోని “లలిత ప్రియకమలం…”, “నమ్మకు నమ్మకు ఈ రేయిని…”, “తరలిరాద తనే వసంతం…”, “చెప్పాలని ఉంది…”, “చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా…”, “నీతోనే ఆగేనా సంగీతం…”, “తులసీ దళములచే…”, “రండి రండి…”, “మానవసేవయే…” అంటూ సాగే పాటలు అలరించాయి.
చిరంజీవి సమర్పకునిగా రూపొందిన ఈ చిత్రానికి సహనిర్మాతగా ఆయన చిన్న తమ్ముడు కె.కళ్యాణ్ కుమార్ (పవన్ కళ్యాణ్) పేరు వేశారు. నిర్మాతగా నాగబాబు వ్యవహరించారు. చిరంజీవిని ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో ఎంపిక చేసే ముందు పరీక్షించిన వారిలో దర్శకులు కె.బాలచందర్ కూడా ఉన్నారు. అలాగే బాలచందర్ తెరకెక్కించిన “ఇదికథకాదు, 47 రోజులు, ఆడవాళ్ళూ మీకు జోహార్లు” వంటి సినిమాల్లో చిరంజీవి విలక్షణమైన పాత్రల్లో కనిపించారు. ఆ గురుభక్తితోనే చిరంజీవి తన తొలి సొంత చిత్రానికి కె.బాలచందర్ ను దర్శకునిగా ఎంచుకున్నారు. చిరంజీవి అంటేనే మాస్ కు మరోపేరులా సాగుతున్నా రోజుల్లో ఆయన కమర్షియల్ సినిమాల నడుమ ‘రుద్రవీణ’ పగిలిపోయింది. కానీ, ఆ వీణ పలికించిన రాగాలు సంగీతప్రియులను అలరించాయి. ఈ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకునిగా ఇళయరాజాకు నంది అవార్డుతో పాటు, నేషనల్ అవార్డు కూడా లభించింది. ఉత్తమ సంభాషణ రచయితగా గణేశ్ పాత్రో, ఉత్తమ శబ్ధగ్రాహకునిగా పాండురంగం, ప్రత్యేక జ్యూరీ అవార్డుతో నాగబాబు నంది అవార్డులు అందుకున్నారు. ఇందులోని “చెప్పాలని ఉంది… గొంతు విప్పాలని ఉంది…” అంటూ సాగే పాటను పాడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకునిగా నిలిచారు. అలాగే ఈ సినిమాకు ‘ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం’ విభాగంలో ప్రదానం చేసే ‘నర్గీస్ దత్ అవార్డు’ లభించింది. ఈ సినిమా అవార్డును అందుకొనే సమయంలోనే ఢిల్లీ వెళ్ళిన చిరంజీవికి, అక్కడ దక్షిణాది సినిమా వారంటే ఎంత చిన్నచూపో అర్థమయింది. దాంతో తానూ హిందీ చిత్రాల్లో నటించి, మన సౌత్ టాలెంట్ చూపించాలని భావించారు. తత్ఫలితంగానే చిరంజీవి నటించిన “ప్రతిబంధ్, ఆజ్ కా గూండారాజ్, ద జెంటిల్ మేన్” వంటి చిత్రాలు తెరకెక్కాయి. ముఖ్యంగా ‘ఆజ్ కా గూండారాజ్’లోని చిరంజీవి డాన్స్ అప్పట్లో ఉత్తరాది వారిని విశేషంగా మురిపించింది. ‘రుద్రవీణ’ చిత్రం తెలుగులో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోక పోవడంతో ఇదే కథతో కె.బాలచందర్ తమిళంలో కమల్ హాసన్ కథానాయకునిగా ‘ఉన్నై ముడియుమ్ తంబి’ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే అక్కడా పరవాలేదు అనిపించిందంతే! ఈ సినిమా పరాజయం పాలయినా, తమకెంతో ఇష్టమైనదని చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు చెబుతుంటారు. నాగబాబు తరువాతి రోజుల్లో నిర్మాతగా విజయాలు సాధించారు. అయినప్పటికీ తొలి చిత్రం ‘రుద్రవీణ’ చిరంజీవి సోదరుల మదిలో మధురానుభూతిని కలిగించే చిత్రంగా నిలిచే ఉంది.