Balaramakrishnulu Movie: ప్రముఖ దర్శకులు వి.మధుసూదనరావు తరువాత ‘రీమేక్స్’లో కింగ్ అనిపించుకున్న డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి అనే చెప్పాలి. ఆయన తెరకెక్కించిన చిత్రాలలో ముప్పావు వంతు రీమేక్స్ కావడం విశేషం! అంతకు ముందు రవిరాజా దర్శకత్వంలో ఎన్ని పరభాషా చిత్రాల కథలు తెలుగులో పునర్నిర్మితమైనా, వెంకటేశ్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘చంటి’ బిగ్ హిట్ గా నిలచింది. ఆ సినిమా సక్సెస్ తరువాత రవిరాజాతో రీమేక్స్ చేయాలని పలువురు పరుగులు తీశారు. తమిళంలో విజయం సాధించిన ‘చేరన్ పాండియన్’ సినిమా ఆధారంగా రూపొందిన ‘బలరామకృష్ణులు’ కూడా రవిరాజా దర్శకత్వంలో వెలుగు చూసిందే. ఈ చిత్రం 1992 నవంబర్ 7న జనం ముందు నిలచింది.
‘బలరామకృష్ణులు’ టైటిల్ ను బట్టే, ఇది ఇద్దరు అన్నదమ్ముల కథ అని ఇట్టే తెలిసిపోతుంది. ఒకే తండ్రి, ఇద్దరు తల్లులకు పుట్టిన పిల్లలు బలరామయ్య, కృష్ణమూర్తి, సీత. మొదటి భార్య కొడుకు బలరామయ్య. అతనికి కుల పట్టింపు ఉంటుంది. రెండో భార్య పిల్లలయిన కృష్ణమూర్తి, సీతను చులకనగా చూస్తుంటాడు. కానీ, ఊరిలో మాత్రం బలరామయ్య, కృష్ణమూర్తి రెండు వర్గాలుగా ఉంటారు. బలరామయ్య భార్య వసుమతి. వారికి పూజ అనే కూతురు ఉంటుంది. ఆ ఊరిలోనే ఉండే లలిత అనే అమ్మాయి కృష్ణమూర్తిని ప్రేమిస్తుంది. బలరామయ్య దూరపు చుట్టం చింతామణి కారణంగానే బలరామయ్య, తన తమ్ముడు కృష్ణమూర్తి, చెల్లెలు సీతను దూరం పెట్టి ఉంటాడు. వారి తల్లిది తక్కువ కులమని అతనికి వారంటే చులకన భావం. నిజానికి బలరామయ్య చిన్నతనంలో కృష్ణమూర్తి తల్లి అతడిని ఎంతో బాగా చూసుకొని ఉంటుంది. కానీ చెప్పుడు మాటలతో అన్నదమ్ముల మధ్య దూరం పెరుగుతుంది. బలరామయ్య కూతురు పూజను, తన కొడుకు అంతర్వేదికి చేసుకోవాలని చింతామణి ఆశ. కృష్ణమూర్తికి బావమరిది వరసైన శివాజీ జీవనోపాధి కోసం ఆ ఊరికి వస్తాడు. అతడికి పూజతో పరిచయం అవుతుంది. తరువాత అది ప్రేమగా మారుతుంది. ఆ విషయం బలరామయ్యకు తెలుస్తుంది. కూతురును చంపబోతాడు బలరామయ్య. కానీ, భార్య అడ్డు పడుతుంది. ఈ సాకుతో బలరామయ్య కూతురును తన కొడుక్కు ఇచ్చి పెళ్ళి జరిపించవచ్చునని చింతామణి ఆశిస్తాడు. అందుకు బలరామయ్య కూడా అంగీకరిస్తాడు. దాంతో మెల్లగా అతని పేరు చెప్పి చింతామణి పెత్తనం చెలాయించడం మొదలు పెడతాడు. కొందరు పనికిమాలిన వారిని తీసుకు వచ్చి, బలరామయ్య చెప్పాడని ఊళ్ళో వ్యాపారం చేయించాలని చూస్తాడు. అన్నిటికీ కృష్ణమూర్తి అడ్డుపడతాడు. చివరకు శివాజీ, పూజ ప్రేమకు కృష్ణమూర్తి అండగా నిలుస్తాడు. దాంతో బలరామయ్యలో ద్వేషం పెంచేసి, కృష్ణమూర్తి ఇంటిపై దాడి చేస్తారు చింతామణి, అతని మిత్రుడు నూకరాజు. ఆ దాడిలో కృష్ణమూర్తి చెల్లెలు సీత గాయపడుతుంది. అంత బాధలోనూ పెద్దన్న బలరామయ్యను కలవరిస్తుంది. అప్పుడు బలరామయ్యకు భార్య అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పడంతో పశ్చాత్తాపం చెందిన బలరామయ్య చెల్లెలును, తమ్ముడిని రక్షిస్తాడు. చివరకు అందరూ ఒకటై, అసలు దోషులను అంతమొందిస్తారు. ఆ పోరులో బలరామయ్యకు బలమైన గాయాలు తగులుతాయి. తమ్ముడు కృష్ణమూర్తి రక్తదానంతో బలరామయ్య బ్రతుకుతాడు. సీత కూడా కోలుకుంటుంది. అప్పటి దాకా ఉన్న రెండిళ్ళ మధ్య గోడ కూలిపోతుంది. అందరూ ఒక్కటవ్వడంతో కథ సుఖాంతమవుతుంది.
Vishwak Sen: ఈ గొడవలు నా వలన కావడం లేదు.. హిమాలయాలకు పోతున్నా
ఇందులో బలరామయ్యగా శోభన్ బాబు, కృష్ణమూర్తిగా రాజశేఖర్, సీతగా కల్పన, లలితగా రమ్యకృష్ణ, వసుమతిగా శ్రీవిద్య, పూజగా రాజీవి, శివాజీగా జగపతిబాబు నటించారు. మిగిలిన పాత్రల్లో గొల్లపూడి మారుతీరావు, తనికెళ్ళ భరణి, రామిరెడ్డి, బ్రహ్మానందం, బాబూమోహన్, మహర్షి రాఘవ, డిస్కోశాంతి కనిపించారు. ఈ చిత్రాన్ని శ్రీస్రవంతి మూవీస్ సమర్పణలో వినీల ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై సుంకర మధుమురళి నిర్మించారు. ఈ చిత్రానికి తనికెళ్ళ భరణి మాటలు రాయగా, వేటూరి, సీతారామశాస్త్రి, నందిగామ గని పాటలు పలికించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చారు. ఇందులోని “అమ్మమ్మో ఎన్నిఉన్నాయో నిక్షేపాలు…”, “వీడేం మొగుడురోయ్…”, “నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి…”, “మస్తుగున్నాది…”, “పగ పగ…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ చూసింది.