వైవిధ్యమైన చిత్రాలు రూపొందించడంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు చంద్రశేఖర్ యేలేటి. ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘ఐతే…’. ప్రముఖ నిర్మాత గుణ్ణం గంగరాజు, వెంకట్ డేగాతో కలసి తమ ‘జెస్ట్ ఎల్లో’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. థ్రిల్లర్ గా రూపొందిన ‘ఐతే’ యువతను ఆకట్టుకుంది, మంచి విజయాన్ని చూసింది. ఎదురుగా కొన్ని పెద్ద చిత్రాలు ఉన్నా, ‘ఐతే’ తన సత్తా చాటుకొని సక్సెస్ చూసింది. 2003 ఏప్రిల్ 11న ‘ఐతే’ చిత్రం విడుదలయింది.
ఇంతకూ ‘ఐతే’ కథ ఏమిటంటే- ముంబై మాఫియాలో కీలక పాత్ర పోషించే ఇర్ఫాన్ ఖాన్ కోసం పోలీసులు గాలిస్తుంటారు. దుబాయ్ కి చెక్కేద్దామనుకున్న ఇర్ఫాన్ పై పోలీసులు కాల్పులు జరుపుతారు. అతని తమ్ముడు ఇమ్రాన్ మరణిస్తాడు. ఇర్ఫాన్ తప్పించుకుంటాడు. అతడిని ఎలాగైనా దుబాయ్ పంపించాలని అనుచరుడు ముషార్రఫ్ ప్రయత్నిస్తుంటాడు. పోలీసులు ఎలాగైనా ఇర్ఫాన్ ను పట్టుకోవాలని ప్లాన్ వేస్తుంటారు. ముంబై గవర్నమెంట్ కూడా ఇర్ఫాన్ ను వదిలేది లేదంటూ ప్రకటిస్తుంది. ఇర్ఫాన్ హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుండి దుబాయ్ పారిపోవాలనుకుంటాడు. రాము, కుమార్, శంకర్, వివేక్ మంచి మిత్రులు. రాము ఎస్సై కావాలని ప్రయత్నిస్తుంటాడు.
కుమార్ పేకాట ఆడి ఐదువేలు అప్పు పడతాడు. చదువుకొనే శంకర్ కే తండ్రి డబ్బు పంపమని ఉత్తరం రాస్తాడు. ఇక తల్లీతండ్రి టీచర్స్ అయినా వివేక్ మాత్రం చదువుమీద ఆసక్తి చూపడు. శంకర్ ఫ్రెండ్ అదితి. ఆమె తండ్రి అనారోగ్యం ఆర్థిక అవసరం కలిగిస్తుంది. అందరికీ డబ్బు కావలసి ఉండడంతో ఏదైనా చేయాలని చూస్తారు. ఇర్ఫాన్ ను కిడ్నాప్ చేసి ప్రభుత్వం ప్రకటించిన యాభై లక్షల రూపాయలు సంపాదించాలను కుంటారు నలుగురు మిత్రులు. ఇర్ఫాన్ తాను తప్పించుకోవడానికి నలుగురు చాకుల్లాంటి కుర్రాళ్ళు కావాలని కోరతాడు. మారువేషంలో ఇర్ఫాన్ ఫ్లైట్ ఎక్కుతాడు. అతని ప్లాన్ తెలిసిన ఈ నలుగురు మిత్రులూ ఆ విమానం ఎక్కుతారు.
Read Also: China: యుద్ధానికి మేం సిద్ధం.. తైవాన్‌కు చైనా సవాల్
అదే విమానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రయాణిస్తుంటాడు. మత్తుచల్లి ఇర్హాన్ ను కిడ్నాప్ చేస్తారు మిత్రులు. ఇర్ఫాన్ తమ వద్ద ఉన్నాడని పోలీస్ కమీషనర్ కు ఫోన్ చేసి, డబ్బు ఏర్పాటు చేయమంటారు. వీళ్లు ఫోన్ చేసిన కమీషనర్ వెళ్ళి, ఈ విషయాన్ని ముషార్రఫ్ కు చెబుతాడు. ఎలాగైనా ఇర్ఫాన్ ను విడిపించాలని చూస్తారు అతని మనుషులు. అతడిని దాచిన నలుగురు మిత్రులు, వారి ఫ్రెండ్ అతిథిపై దాడిచేస్తారు ఇర్ఫాన్ మనుషులు. చివరకు ఇర్ఫాన్ ను పోలీసులు తెలివిగా అరెస్ట్ చేస్తారు. దాంతో తమ ఆశలన్నీ నాశనమైనాయని మిత్రులు నిరాశతో వస్తారు.వారికి తమ గదిలో ఫ్లైట్ లో తాము వదిలేసిన బ్యాగ్ కనిపించి, అందులో బాంబు ఉందేమోనని భయపడతారు. ఐబీ ఆఫీసర్ జహీర్ ఖాన్ నుండి రామ్ కు ఫోన్ వస్తుంది. ఎస్సై కావాలనుకుంటున్న నీ కల నెరవేరుతుందని, అయితే ఇకపై ఇలాంటి దారులు ఎంచుకోవద్దని చెబుతాడు. బ్యాగ్ తీసి చూస్తే అందులో యాభై లక్షలు ఉంటుంది. అది తన సొంతడబ్బని, మీరు హీరోల్లాగే ఇకపై కూడా మసలు కోవాలని ఓ లెటర్ కనిపిస్తుంది. తమ కష్టాలన్నీ తీరినందుకు మిత్రులు ఆనందంతో చిందులేస్తూండగా ముగుస్తుందీ చిత్రం.
సింధు తులానీ, పవన్ మల్హోత్రా, వీరేంద్ర చౌహాన్, మోహిత్ చడ్డా, శశాంక్, అభిషేక్, జనార్దన్, నర్సింగ్ యాదవ్, శివాజీరాజా, సీవీయల్ నరసింహారావు, అశోక్ కుమార్, హర్షవర్ధన్, సంజయ్ రాయ్ చూర, లలితా శర్మ ఇందులో నటించారు. ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్ సంగీతం సమకూర్చగా, “చిటపట చినుకులు…” అంటూ సాగే పాటను సీతారామశాస్త్రి రాశారు. ఈ పాటను ఎమ్.ఎమ్.కీరవాణి గానం చేశారు. నిర్మాత గుణ్ణం గంగరాజు మాటలు రాశారు. చంద్రశేఖర్ యేలేటి కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వంలో ‘ఐతే’ రూపొందింది. తొలి రోజు నుంచే గుడ్ టాక్ సంపాదించిన ‘ఐతే…’ శతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో ’50 ల్యాక్స్’ పేరుతో రూపొందించారు. అక్కడా ఆదరణ చూరగొంది. ఈ సినిమా తరువాత నటి సింధు తులానీకి తెలుగులోనూ, సౌత్ మూవీస్ లోనూ అవకాశాలు లభించాయి. శశాంక్, అభిషేక్ తరువాతి రోజుల్లో కొన్ని సినిమాల్లో నటించి అలరించారు.
Read Also: Pawan Kalyan: చైతన్యమూర్తి, మార్గదర్శి జ్యోతిరావు పూలే