Ready: ‘ఉస్తాద్’గా ఉరకలు వేసే ఉత్సాహంతో సాగుతున్నారు హీరో రామ్ పోతినేని. త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ సినిమా రానుంది. నిజానికి రామ్ తొలి సినిమా ‘దేవదాస్’తోనే అదరహో అనేలా సక్సెస్ సాధించాడు. ఆ తరువాత రామ్ ను వరుస ఫ్లాపులు పలకరించాయి. ఆ సమయంలో భారీ విజయం కోసం చెకోర పక్షిలా ఎదురుచూసిన రామ్ కు శ్రీను వైట్ల ‘రెడీ’ వెన్నెల కురిపించింది. ‘రెడీ’ గ్రాండ్ సక్సెస్ తోనే రామ్ మళ్ళీ విజయపథంలో పయనించసాగాడు. ఈ సినిమాను రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్ తమ స్రవంతి మూవీస్ పతాకంపై నిర్మించారు.
2008 జూన్ 19న విడుదలైన ‘రెడీ’ లో జెనీలియా నాయికగా నటించింది. ‘రెడీ’ కథ విషయానికి వస్తే – తాను ప్రేమించిన అమ్మాయిని తనదానికి చేసుకోవడానికి హీరో ఆమె బంధుమిత్రాదులందరినీ ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. అందుకు మెక్ డౌల్ మూర్తిని ఆశ్రయిస్తాడు. అతని ద్వారా హీరోయిన్ మేనమామల ఇంట చేరతాడు. హీరోయిన్ పూజ మేనమామలకు ఒకరంటే ఒకరికి పడదు. అన్నదమ్ములు తరచూ ద్వేషించుకుంటూ ఉంటారు. పూజను తమ కోడలుగా చేసుకోవాలని పోటీ పడుతుంటారు. వారిద్దరికీ చదువు అంతగా రాదు. అందువల్ల వారితో నెలకోసారి ఇన్ కం టాక్స్ కట్టిస్తూ మోసం చేసేస్తుంటాడు మెక్ డౌల్ మూర్తి. అతడినే పావుగా వాడుకొని, తన కన్నవారిని కూడా ఆ నాటకంలో భాగంగా చేసుకొని చివరకు అనుకున్నది సాధిస్తాడు హీరో చందు. ఈ కథను శ్రీను వైట్ల తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు కోనవెంకట్, గోపీమోహన్ కథను అందించగా, కోన వెంకట్ మాటలు పలికించారు.
‘రెడీ’ సినిమాకు కామెడీయే ప్రధానాకర్షణ. ముఖ్యంగా మెక్ డౌల్ మూర్తిగా బ్రహ్మానందం, చందుగా రామ్ పండించిన కామెడీ భలేగా ఆకట్టుకుంది. మిగిలిన పాత్రల్లో కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, నాజర్, తనికెళ్ళ భరణి, చంద్రమోహన్, సునీల్, సుప్రీత్, షఫీ, ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి, సుధ, ప్రగతి, శరణ్య, వినయ ప్రసాద్, రజిత తదితరులు నటించారు. ఈ చిత్రానిక దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీతం అలరించింది. ఆయన బాణీలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి పలికించిన పాటలూ ఆకట్టుకున్నాయి. “గెట్ రెడీ..”, “అయ్యో అయ్యయ్యో దానయ్యా..”, “మేరే సజ్నా…”, “నిన్నే పెళ్ళాడేసి నే రాజైపోతా..”, “నా పెదవుల నువ్వైతే..”, “ఓం నమస్తే బోలో..” అంటూ సాగే పాటలు అలరించాయి.. ‘రెడీ’ పలు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమాను కన్నడలో ‘రామ్’గానూ, తమిళంలో ‘ఉత్తమ పుత్రన్’గానూ, హిందీలో ‘రెడీ’ పేరుతోనే రీమేక్ చేశారు. ఆ భాషల్లోనూ ఈ సినిమా అలరించటం విశేషం.