తమిళ యువ కథానాయకుడు శింబు కారణంగా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (పెఫ్సీ), తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ (టి.ఎఫ్.సి.సి.) మధ్య అగ్గి రాజుకుంది. దానికి శింబు నటిస్తున్న ‘వెందు తనిందదు కాడు’ సినిమా కారణం. శింబు గతంలో నలుగురైదుగురు నిర్మాతలతో చేసుకున్న ఒప్పందాన్ని నెరవేర్చకుండానే ఈ కొత్త సినిమాకు డేట్స్ కేటాయించాడు. దాంతో వాళ్ళంతా నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. మరీ ముఖ్యంగా శింబులో ‘ట్రిపుల్ ఎ’ మూవీ నిర్మించిన మైఖేల్ రాయప్పన్ తనకు ఆ సినిమా ద్వారా వచ్చిన నష్టాలను పూడ్చకుండా శింబు కొత్త సినిమాలో నటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని నిర్మాతల మండలి… శింబు సినిమాకు సహకరించవద్దంటూ పెఫ్సీకి లేఖ రాసింది.
అయితే… కరోనా సమయంలో పెఫ్సీ సభ్యులకు శింబు తాజా చిత్ర నిర్మాత ఇషారీ కె గణేశ్ ఎంతో సాయం చేశాడు. దాంతో నిర్మాతల మండలి మాటను త్రోసిరాజని పెఫ్సీ కార్మికులు శింబు సినిమా ఔట్ డోర్ షూటింగ్ కు హాజరయ్యారు. దాంతో పెఫ్సీ వైఖరిపై నిర్మాతల మండలి అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ప్రస్తుతం రోజా భర్త సెల్వమణి పెఫ్సీకి అధ్యక్షుడిగా ఉన్నారు. శింబు తన నిర్మాతల కష్టాలను పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోందని, అతని కారణంగా కలిసి మెలిసి ఉండాల్సిన నిర్మాతల మండలి, పెఫ్సీ మధ్య వివాదం చెలరేగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మరి తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత అయినా శింబు తన గత చిత్రాల నిర్మాతలతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటాడేమో చూడాలి.