పురుషులతో పోలిస్తే మహిళలకు గుండె జబ్బుల ముప్పు కొంత తక్కువగా ఉంటుందని చాలామందికి తెలియదు. ముఖ్యంగా మెనోపాజ్ వరకు మహిళల శరీరంలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ గుండెను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి, చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల యువ వయస్సులో మహిళలకు గుండె సంబంధిత సమస్యలు తక్కువగా కనిపిస్తాయి.
అయితే మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయి గణనీయంగా తగ్గిపోవడంతో మహిళల్లో కూడా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దశలో ఒత్తిడి, మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి జీవనశైలి కారణాలు గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వారు సూచిస్తున్నారు. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి మహిళ కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మరియు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.
నెలసరి ఆగిన తర్వాత మహిళల్లో గుండెపోటు లక్షణాలు పురుషులకంటే భిన్నంగా కనిపిస్తాయని నిపుణులు తెలిపారు. ఛాతీ నొప్పి కాకుండా, కారణం తెలియని తీవ్రమైన నిస్సత్తువ, తల తిరగడం, కడుపు నొప్పి, మెడ, భుజాలు, వీపు భాగాల్లో నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్నిసార్లు కేవలం ఆయాసం మాత్రమే ఉండొచ్చు లేదా సరైన కారణం లేకుండా శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించవచ్చు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.
గుండెపోటు వచ్చినప్పుడు చాలామంది భయాందోళనకు గురవుతారు. కానీ ఆ సమయంలో సరైన చర్యలు తీసుకుంటే గుండెపోటు వచ్చిన వ్యక్తి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత త్వరగా చికిత్స అందించడమే కీలకం. అధ్యయనాల ప్రకారం, ప్రతి సంవత్సరం గుండెపోటుతో మరణించే వారి శాతం సుమారు 5 నుండి 10 శాతం వరకు ఉంటుందని వెల్లడైంది. గుండెపోటు వచ్చిన వెంటనే గోల్డెన్ అవర్ లో చికిత్స అందిస్తే బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వెంటనే సీపీఆర్ (CPR) చేయడం ద్వారా రోగి ప్రాణాలను కాపాడే అవకాశం మరింత పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.