Vitamin D Tablets: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి విటమిన్ల నుంచి ఖనిజాల వరకు అన్నీ అవసరం. విటమిన్లు E, B12 లతో పాటు, ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందడంలో విటమిన్ D కూడా కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ D మన ఎముకలు, దంతాలు, రోగనిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యమైనదిగా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే విటమిన్ D ని అధికంగా తీసుకోవడం హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ విటమిన్‌ను అధికంగా తీసుకుంటే మూత్రపిండాలకు ఏవిధంగా ఎఫెక్ట్ పడుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Priyanka Chopra : నల్లగా ఉన్నావంటూ బాడీ షేమింగ్ చేశారు.. మహేశ్ హీరోయిన్ కామెంట్స్
చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ D మాత్రలు తీసుకుంటున్నారు. అయితే తరచుగా అధిక మోతాదులను వీటిని తీసుకుంటే అనారోగ్య సమస్యలు రావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మాత్రలు వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బదులుగా మరింత దిగజారుస్తాయని వెల్లడించారు. పలువురు వైద్యుల ప్రకారం.. విటమిన్ D ని ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎక్కువ మోతాదులో తీసుకుంటే కలిగే దుష్ప్రభావాలు ఎంతో వెల్లడించారు.
వైద్యుల నివేదికల ప్రకారం.. రోజుకు తక్కువ మొత్తంలో విటమిన్ D అవసరం. మానవ శరీరానికి రోజుకు 400 నుంచి 1,000 IU విటమిన్ డి అనేది అవసరం. అయితే రోజుకు 4,000 IU కంటే ఎక్కువ లేదా చాలా నెలల పాటు 8,000–12,000 IU తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు. కొంతమంది తెలియకుండానే రోజుకు 60,000 IU టాబ్లెట్ తీసుకుంటారని వెల్లడించారు. ఇలా తీసుకోవడం ద్వారా రక్తంలో కాల్షియంను పెంచుతుందని, దీనిని హైపర్‌కాల్సెమియా అని పిలుస్తారని చెప్పారు. ఇది మూత్రపిండాలపై అధిక ఒత్తిడిని కలిగిస్తుందని, కొన్ని సందర్భాల్లో మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుందని అంటున్నారు.
ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకండి..
* వికారం, వాంతులు
* చాలా దాహం వేస్తున్నట్లు ఉండటం
* తరచుగా మూత్రవిసర్జన
* కండరాల బలహీనత
* గందరగోళం లేదా తీవ్ర అలసట
* నడుము దిగువ భాగంలో లేదా మూత్రపిండ నొప్పి
ఈ లక్షణాలతో పాటు, విటమిన్ డి తీవ్రమైన మూత్రపిండాల నష్టాన్ని కలిగిస్తే, మూత్రపిండాల వైఫల్యం లక్షణాలు కూడా కనిపించవచ్చని హెచ్చరిస్తున్నారు. వీటిలో కాళ్ళలో వాపు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటాయని వెల్లడించారు.
వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం..
విటమిన్ డి మాత్రలు తీసుకోడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమ మార్గంగా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే విటమిన్ డి ఉన్న బహుళ ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించినప్పుడు లేదా పర్యవేక్షణ లేకుండా అధిక మోతాదులో ఇంజెక్షన్లు తీసుకున్నప్పుడు ఈ సమస్యలు సంభవిస్తాయని వెల్లడించారు. దీనిని నివారించడానికి, ఎల్లప్పుడూ వైద్యుడి సలహా మేరకు మాత్రమే విటమిన్ డి తీసుకోవాలని, సిఫార్సు చేసిన మోతాదును మించవద్దని సూచించారు. మీరు దీర్ఘకాలికంగా సప్లిమెంట్లను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడితే క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు.
READ ALSO: Hydrogen Water Bottle: ఏందయ్యా ఇది.. నీళ్ల సీసా ధర రూ.9,999 !