Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్‌ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!

Silver Cleaning Easy Trick

Silver Cleaning Easy Trick

Silver Cleaning Trick: రక్షాబంధన్ పండుగ సమీపిస్తున్న వేళ చాలామంది తమ వెండి కాలి గొలుసులు, గాజులు, ఇతర ఆభరణాలను బయటకు తీస్తుంటారు. అయితే ఎక్కువ కాలం లాకర్ లేదా పెట్టెల్లో భద్రపరిచిన వెండి ఆభరణాలు నల్లగా మారడం సాధారణమే. దీంతో వాటి అసలు మెరుపు తగ్గిపోతుంది. అలాంటి సమయంలో వెంటనే నగల దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఇంట్లోనే సులభంగా లభించే కొన్ని వస్తువులతో వెండి ఆభరణాలను శుభ్రం చేసుకునే చిట్కాను వాళ్లు పంచుకున్నారు. సింపుల్‌గా 20 నిమిషాల్లో మీ వెండి ఆభరణాలపై ఉన్న నలుపు మరకలను ఎలా పోగొట్టుకోవాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన వస్తువులు

* పెద్ద గిన్నె

* అల్యూమినియం ఫాయిల్

* వేడి నీరు

* 1-2 టీస్పూన్ల ఉప్పు

* 1-2 టీస్పూన్ల బేకింగ్ సోడా

* మృదువైన, పొడి వస్త్రం

వెండి ఆభరణాలను ఎలా శుభ్రం చేయాలంటే..
ముందుగా పెద్ద గిన్నె అడుగున అల్యూమినియం ఫాయిల్‌ను పరచాలి. అందులో వేడి నీటిని పోసి, 1-2 టీస్పూన్ల ఉప్పు, 1-2 టీస్పూన్ల బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. అనంతరం నల్లగా మారిన వెండి కాలి గొలుసు లేదా ఇతర ఆభరణాన్ని ఆ ద్రావణంలో పూర్తిగా ముంచాలి. ఆభరణాన్ని సుమారు 20 నిమిషాల పాటు అందులో ఉంచాలి. ఆ తర్వాత వాటిని బయటకు తీసి మెత్తని, పొడి వస్త్రంతో నెమ్మదిగా తుడవాలి. ఇలా చేయడం వల్ల వెండి ఆభరణాలపై నల్లటి మరకలు తగ్గి, తిరిగి మెరిసేలా చేయడంలో సహాయపడుతుందని వెల్లడించారు.

ఈ ట్రిక్ ఎలా పనిచేస్తుందంటే..
అల్యూమినియం ఫాయిల్, ఉప్పు, బేకింగ్ సోడా, వేడి నీటితో జరిగే రసాయన చర్య వెండి ఆభరణాలపై ఏర్పడిన నల్లటి పొరను తొలగించడంలో సహాయపడుతుందని వెల్లడించారు. దీంతో ఎక్కువగా రుద్దాల్సిన అవసరం లేకుండానే వెండి మెరుపును కొంతవరకు తిరిగి తీసుకురావచ్చని చెబుతున్నారు. అయితే అన్ని వెండి ఆభరణాలకు ఈ పద్ధతి సరిపోదట. పురాతనమైనవి, చాలా సున్నితమైనవి, ముత్యాలు లేదా విలువైన రాళ్లు పొదిగిన వెండి ఆభరణాలను ఈ ద్రావణంలో వేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు. అలాంటి వాటిని శుభ్రం చేసే ముందు నగల నిపుణుడి సలహా తీసుకోవాలని చెబుతున్నారు. క్లీన్ చేసిన తర్వాత ఆభరణాలను పూర్తిగా ఆరబెట్టి, తేమకు దూరంగా గాలి చొరబడని డబ్బాలో భద్రపరిస్తే మళ్లీ త్వరగా నల్లబడకుండా ఉంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు.