Kitchen Hacks: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటుంది!

Kitchen Hacks

Kitchen Hacks

Kitchen Hacks: ఏ వంటల్లో అయినా కొత్తిమీరకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కూరలు, పప్పులు, చట్నీలు, సూప్‌లు.. ఇలా ఏ వంటకమైనా చివర్లో కొద్దిగా కొత్తిమీర వేస్తే ఆ రుచి, సువాసన వేరుగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ వంట రుచి, సువాసన మరింత పెరుగుతుంది. అయితే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కొత్తిమీర రెండు మూడు రోజుల్లోనే వాడిపోవడం, పసుపు రంగులోకి మారడం, కుళ్లిపోవడం అనే సమస్యలు చాలా మంది మహిళలకు ఎదురయ్యే సాధారణ సమస్య. కానీ కొన్ని సులభమైన స్టోరేజ్ టిప్స్ పాటిస్తే మీ ఫ్రిజ్‌లో ఉన్న కొత్తిమీరను వారాల పాటు తాజాగా ఉంచుకోవచ్చని మీకు తెలుసా. తెలియక పోతే ఇప్పుడే తెలుసుకోండి మరి..

* ముందుగా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కొత్తిమీర కట్టను విప్పి, పసుపు రంగులోకి మారిన, ఎండిపోయిన లేదా కుళ్లిన ఆకులను తొలగించాలి. అవసరమైతే పొడవుగా ఉన్న వేర్లను కొద్దిగా కత్తిరించవచ్చు కూడా. ముఖ్యంగా స్టోర్ చేసే ముందు కొత్తిమీరను కడగకూడదు. తేమ ఉంటే అది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ కొత్తిమీర తడిగా ఉంటే, కాటన్ గుడ్డ లేదా పేపర్ టవల్‌పై దానిని కొద్దిసేపు ఆరబెట్టాలి.

* ఆ తర్వాత పూర్తిగా పొడిగా ఉన్న ఎయిర్‌టైట్ ప్లాస్టిక్ లేదా గాజు డబ్బా తీసుకుని అడుగున డ్రై టిష్యూ పేపర్ పరచాలి. దానిపై కొత్తిమీరను క్రమంగా అమర్చి, మళ్లీ పైభాగంలో మరో టిష్యూ పేపర్ ఉంచి డబ్బాను బిగుతుగా మూసి ఫ్రిజ్‌లోని వెజిటబుల్ క్రిస్పర్‌లో పెట్టాలి. ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి టిష్యూ పేపర్ తడిగా మారిందో లేదో చూసి అవసరమైతే కొత్తది మార్చాలి.

* డబ్బా ఉపయోగించకూడదనుకుంటే కొత్తిమీరను శుభ్రమైన కాటన్ గుడ్డ లేదా న్యూస్‌పేపర్‌లో సున్నితంగా చుట్టి, జిప్‌లాక్ బ్యాగ్ లేదా ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు.

* మరో సులభమైన పద్ధతి ఏమిటంటే… కొత్తిమీరను కడిగి వేర్లు తొలగించిన తర్వాత, కాడల భాగాన్ని నీరు ఉన్న గ్లాసులో ఉంచి ఫ్రిజ్‌లో నిల్వ చేయడం. ఈ విధానం కూడా కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ చిన్నచిన్న కిచెన్ టిప్స్ పాటిస్తే కొత్తిమీర త్వరగా పాడవకుండా, ఎక్కువ కాలం పచ్చగా, తాజాగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.