Green Chilli Plant: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సింపుల్‌గా ఇంట్లోనే పచ్చిమిర్చి సాగు.. 2 నెలల్లో కాయలు గ్యారంటీ!

Green Chilli

Green Chilli

Green Chilli Plant: ఇకపై మీ వంటింట్లో పచ్చిమిర్చి అయిపోతే వెంటనే మార్కెట్‌కు పరుగెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఇంట్లోనే చిన్న కుండీలో పచ్చిమిర్చి మొక్కను సింపుల్‌గా పెంచుకోవచ్చు. దీని కోసం మీరు మార్కెట్ నుంచి ప్రత్యేకంగా విత్తనాలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లో ఉన్న పండిన పచ్చిమిర్చి నుంచే విత్తనాలు తీసుకుని పచ్చి మొక్కలు పెంచొచ్చు. సరైన పద్ధతిలో పెంచితే రెండు నెలల్లోనే మీ ఇంటి కుండీ నుంచి కారం కారం పచ్చిమిర్చిని కోసుకోవచ్చు. మీ ఇంట్లో పచ్చి మిర్చి సాగును సింపుల్‌గా ఎలా చేయాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.

ముందుగా మీరు మిర్చి మొక్క వేర్లు విస్తరించేందుకు సరిపడా స్థలం ఉన్న కుండీ లేదా గ్రో బ్యాగ్‌ను పచ్చి మిర్చి సాగుకు ఎంచుకోవాలి. సాధారణ మట్టిలో బాగా కుళ్లిన సేంద్రియ ఎరువు లేదా పశువుల ఎరువు కలిపితే మొక్క ఎదుగుదలకు సహాయపడుతుంది. ముఖ్యంగా కుండీలో నీరు నిల్వ ఉండకుండా అడుగున డ్రైనేజీ రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న పండిన పచ్చిమిర్చి నుంచి విత్తనాలను తీసుకోవాలి. అయితే వాటిని నాటడానికి ముందుగా బాగా ఆరబెట్టాలి. అనంతరం విత్తనాలను నీటిలో నానబెట్టి సుమారు రెండు రోజుల తర్వాత నాటుకోవాలి. ఇంట్లో తొలిసారి కూరగాయలు పెంచేవారికి ఈ పద్ధతి సింపుల్‌గా ఉంటుంది.

విత్తనాలు నాటేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ముందుగా సిద్ధం చేసుకున్న మట్టిలో ఈ విత్తనాలను నాటాలి. మరీ లోతుగా పాతిపెట్టకుండా సుమారు 2 నుంచి 3 అంగుళాల లోతులోనే ఈ విత్తనాలను వేయాలి. విత్తనాలు వేసిన తర్వాత మట్టి తేమగా ఉండేలా నీరు పోయాలి. అయితే కుండీలో నీరు ఎక్కువగా నిలిచిపోకుండా జాగ్రత్త పడాలి. అధిక తేమ వల్ల విత్తనాలు, మొక్క వేర్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది. మిర్చి మొక్క ఎదుగుదలకు సూర్యరశ్మి చాలా ముఖ్యం. రోజుకు కనీసం 5 నుంచి 6 గంటల పాటు నేరుగా లేదా తగినంత వెలుతురు అందే ప్రదేశంలో ఈ కుండీని ఉంచాలి. బాల్కనీ, టెర్రస్‌ లేదా మంచి వెలుతురు వచ్చే కిటికీ దగ్గర ఈ కుండీని పెట్టుకోవాలి. సరైన తేమ, సూర్యరశ్మి లభిస్తే కొన్ని వారాల్లోనే విత్తనాల నుంచి మొలకలు రావడం ప్రారంభమవుతుంది.

ఒకే కుండీలో ఎక్కువ మొక్కలు వద్దు
విత్తనాలు మొలకెత్తిన తర్వాత సుమారు 3 నుంచి 4 వారాల్లో మొక్కలు పెరుగుతాయి. ఒకే కుండీలో ఎక్కువ మొక్కలు ఉంచకుండా చూసుకోవాలి. నాలుగు కంటే ఎక్కువ మొక్కలు ఉంటే వాటికి తగినంత స్థలం, పోషకాలు అందక ఎదుగుదల మందగించే అవకాశం ఉంటుంది. సరైన సంరక్షణ అందిస్తే సుమారు 30 నుంచి 40 రోజుల్లో మిర్చి మొక్కలకు చిన్న తెల్లని పువ్వులు రావడం స్టార్ట్ అవుతాయి. ఆ పువ్వుల తర్వాత క్రమంగా పచ్చిమిర్చి కాయలుగా ఏర్పడతాయి. ఇలా క్రమం తప్పకుండా నీరు, సూర్యరశ్మి, అవసరమైన పోషకాలు అందిస్తూ మొక్కను చూసుకుంటే సుమారు రెండు నెలల్లో ఇంట్లోనే పండించిన తాజా పచ్చిమిర్చిని కోయవచ్చు. పెద్ద స్థలం లేకపోయినా బాల్కనీ, టెర్రస్‌ లేదా మంచి సూర్యరశ్మి వచ్చే కిటికీ దగ్గర ఒక కుండీతోనే ఈ కిచెన్‌ గార్డెనింగ్‌ను స్టార్ట్ చేయండి.