భార్యాభర్తల మధ్య సంబంధాలు చాలా క్లిష్టంగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ సంబంధంలో పరస్పర సమన్వయం ఏర్పడటానికి చాలా సమయం పడుతుంది. ఇద్దరి మధ్య ప్రేమతో పాటు వివాదాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే.. చాలా మంది భర్తలు తమ భార్యల మాటలను సీరియస్‌గా తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా గొడవలు జరుగుతాయి. కాగా.. కొన్ని పనులు భార్యలకు అస్సలు నచ్చవు. దీంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుంటా. ఆ అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటి పనుల్లో సహాయం చేయకపోవడం..
“ఇంటిని తీర్చిదిద్దే బాధ్యత మహిళల చేతుల్లోనే ఉంది. ఐతే మాత్రం ఇంట్లో పనులకు భర్త హెల్ప్ చేయకూడదని ఎక్కడ రాసుంది. సమానత్వం అని మాట్లాడుకుంటున్న ఈరోజుల్లో కూడా తన భార్యకు హెల్ప్ చేసే మనస్తత్వం భర్తకు కలగకపోవడం నిజంగా దురదృష్టకరం. నిజానికి, పని ఒత్తిడి మొత్తం భార్యపై ఉంటే ఆమె ప్రతి పనినీ పెర్ఫెక్ట్ గా చేయలేకపోవచ్చు. మళ్ళీ ఆమె చేసే పనులపై వంకలు పెడతారు. ప్రతి పనిని మేనేజ్ చేయలేకపోతున్నాను. ఈ విషయంలో నా భర్త నుంచి నాకస్సలు సహకారం లభించటం లేదు. ఈ విషయం నన్నెంతగానో బాధిస్తోంది” అని ఇంకొక వివాహిత తన మనసులోని బాధను వెళ్లగక్కింది.
భార్య చెప్పిన విషయాలను పట్టించుకోకపోవడం
“నా భర్త చాలా గొప్పగా మాట్లాడతాడు. తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ అతని మాటల చాతుర్యానికి ఫిదా అవుతారు. వివిధ అంశాలపై గొప్పగా లెక్చర్ ఇస్తాడు. ఇదంతా బాగానే ఉంది. ఐతే నేను మాట్లాడినప్పుడు సరిగ్గా వినడు. చెప్పిన విషయాలపై ఫోకస్ పెట్టడు. ఇంట్రస్ట్ చూపించడు. ఇతరుల మాటలను వినడంపై ఫోకస్ పెడతాడు. కానీ నా విషయంలో లైట్ తీసుకుంటాడు. ఈ విషయంలో నాకూ నా భర్తకు మధ్య అనేకసార్లు వాదనలు జరిగాయి. అయినా, ఫలితం లేదు.” అంటూ ఒక వివాహిత తన బాధను వ్యక్తపరిచింది.
వంటపై వంకలు పెట్టడం..
తన భర్త ఫుడీ అని ఈ విషయంలో తనని ముప్పుతిప్పలు పెడుతున్నాడని ఓ వివాహిత చెప్పుకొచ్చింది. “నా భర్త ఫుడీ, రకరకాల ఫుడ్స్ ను వీడియోస్ చూసి ట్రై చేయమంటాడు. చేశాక, సరిగ్గా రాలేదని వంకలు పెడతాడు. ప్రతి రోజూ ఇదొక బెంగ. రేపొద్దున్న ఏ మెనూ ప్లాన్ చేస్తాడోనని. వంటింటికే జీవితం అంకితమైపోతోంది. నాకంటూ కొన్ని ఆశలుంటాయని గుర్తించడు. రకరకాల డిషెస్ ను ప్రయత్నించాలంటూ నా మీద ఒత్తిడి పెడుతుంటాడు. నచ్చినవి వండుకుని తినే అవకాశం కూడా లేకపోయింది” అంటూ బాధను వ్యక్తపరిచింది.
సోషల్ మీడియా..
సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయిన తన భర్త గురించి వివాహిత ఇలా చెప్పుకొచ్చింది…”నా భర్త పొద్దస్తమానం సోషల్ మీడియాకే అతుక్కుపోతాడు. కామెంట్స్, లైక్స్ అలాగే షేర్స్ అంటూ ఏవేవో మాట్లాడతాడు. ఆఖరికి ఇద్దరం కలిసి భోజనం చేసే సమయంలో కూడా సోషల్ మీడియా అప్డేట్స్ చూసుకుంటూ ఉంటాడు. నాతో మాట్లాడేందుకు సమయం కేటాయించడు. నేను లోన్లీగా ఫీలవుతున్నాను.” అంటూ ముగించింది
ఇంటిని చిందరవందర చేయడం..
ఒక వివాహిత తన మనసులోని మాటను ఇలా బయటపెట్టింది. “ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నా భర్త తన చేతిలోని వస్తువులను అటూ ఇటూ విసిరేస్తాడు. అంతేకాదు, ఎక్కడ తీసిన వస్తువులను అక్కడ పెట్టడు. తడి టవల్ ఎప్పుడూ చైర్ పై వేలాడుతూనే ఉంటుంది. షూస్ ర్యాక్ లో తప్పించి షూస్ ప్రతి చోటా ఉంటాయి. అంతేనా, ఇల్లంతా ఎంతో చెత్తచెత్తగా ఉంటుంది. ఈ విషయంలో అస్సలు నా మాట వినడు” అంటూ వాపోయింది.