Site icon NTV Telugu

Tagatose : డయాబెటిస్‌ బాధితులకు ‘స్వీట్’ న్యూస్.. చక్కెరలా రుచి.. కానీ రిస్క్ కాదు.!

Tagatose

Tagatose

ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (Diabetes) ఒక పెను సవాలుగా మారిన తరుణంలో, అమెరికాలోని టఫ్ట్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక వినూత్న పరిశోధనను విజయవంతం చేశారు. తీపిని ఇష్టపడే మధుమేహ వ్యాధిగ్రస్తులు సాధారణ చక్కెర (సుక్రోజ్)కు ప్రత్యామ్నాయంగా ఈ టాగటోజ్ ను వాడుకోవచ్చు. ఇది రుచిలో పంచదారకు దాదాపు 92 శాతం సమానంగా ఉంటుంది, కానీ శరీరంలోకి చేరాక అది చూపే ప్రభావం మాత్రం చాలా భిన్నంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. సాధారణ చక్కెర తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరిగి ఇన్సులిన్ స్పైక్ అవుతుంది, కానీ టాగటోజ్ విషయంలో అలాంటి ప్రమాదం ఉండదు.

టాగటోజ్ అనేది పండ్లు , పాల ఉత్పత్తుల్లో చాలా తక్కువ పరిమాణంలో లభించే అరుదైన చక్కెర. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగకపోవడమే కాకుండా, సాధారణ చక్కెరతో పోలిస్తే ఇందులో 60 శాతం తక్కువ కేలరీలు మాత్రమే ఉంటాయి. దీనివల్ల బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఒక వరంగా మారుతుంది. అంతేకాకుండా, ఇది పళ్లు పుచ్చిపోవడానికి కారణం కాకపోగా, నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను నిరోధించి దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుందని పరిశోధకులు వెల్లడించారు. ప్రేగులలోని మంచి బ్యాక్టీరియాను పెంపొందించే ప్రోబయోటిక్ గుణాలు కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించారు.

India Final Warning to Apple: యాపిల్‌కు భారత్‌ ఫైనల్‌ వార్నింగ్.. రూ.3 లక్షల కోట్ల జరిమానా తప్పదా..?

ఇప్పటివరకు టాగటోజ్ ను తయారు చేయడం చాలా ఖరీదైన ప్రక్రియగా ఉండేది. సహజంగా ఇది చాలా తక్కువ పరిమాణంలో లభించడం వల్ల దీని ధర సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు ‘E. coli’ అనే బ్యాక్టీరియాను ఉపయోగించి, గ్లూకోజ్ నుంచి నేరుగా టాగటోజ్ ను ఉత్పత్తి చేసే చవకైన బయోసింథటిక్ విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ పద్ధతి ద్వారా 95 శాతం వరకు అధిక దిగుబడి సాధించవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో మనం రోజూ వాడే టీ, కాఫీలు, స్వీట్లు , కూల్ డ్రింక్స్‌లో పంచదారకు బదులుగా టాగటోజ్ ను తక్కువ ధరకు వాడుకునే అవకాశం కలుగుతుంది.

ఈ సరికొత్త ఆవిష్కరణ కేవలం మధుమేహులకు మాత్రమే కాకుండా, ఆహార ఉత్పత్తి రంగంలో కూడా పెద్ద మార్పులు తీసుకురానుంది. సాధారణంగా ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ (Artificial Sweeteners) వంట చేసేటప్పుడు పంచదార లాగా మెత్తబడవు లేదా బ్రౌన్ కలర్‌లోకి మారవు. కానీ టాగటోజ్ అచ్చం పంచదార లాగే పనిచేస్తుంది. దీనిని కేకులు, బిస్కెట్లు తయారీలో కూడా వాడుకోవచ్చు. రుచిలో మార్పు లేకుండానే మధుమేహం , ఊబకాయం వంటి సమస్యలను అరికట్టడానికి ఈ టాగటోజ్ ఒక పటిష్టమైన ప్రత్యామ్నాయంగా మారుతుందని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

టాగటోజ్ ఉత్పత్తి సామాన్యులకు అందుబాటులోకి వస్తే, తీపి పదార్థాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చు. మధుమేహులు సైతం భయం లేకుండా తీపిని ఆస్వాదించే రోజులు అతి త్వరలోనే రానున్నాయి.

Music Directors : తెలుగు కంపోజర్స్‌కు పాకిన డ్యూయల్ రోల్ ఫాంటసీ

Exit mobile version