ఇటీవల స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. చిన్న నల్లి ద్వారా వ్యాపించే ఈ ఇన్‌ఫెక్షన్‌ను సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి, దాని లక్షణాలు, ప్రమాదాలు, జాగ్రత్తలు అన్న విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అత్యవసరం.
స్క్రబ్ టైఫస్ అనేది ‘ఒరియెంటియా సూసుగముషి అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధి. ఇది ముఖ్యంగా పచ్చిక బయళ్లలో, పొదల్లో ఉండే చిన్న నల్లులు కుట్టడం ద్వారా మనుషులకు సోకుతుందని డాక్టర్లు తెలిపారు. మనుషుల నుంచి మనుషులకు ఇది నేరుగా వ్యాపించదని డాక్టర్లు చెబుతున్నారు. నల్లి కుట్టిన చోట మొదట ఒక నల్లటి మచ్చ లేదా దద్దురులాంటి గుర్తులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
స్క్రబ్ టైఫస్ తో ఆకస్మికంగా వచ్చే తీవ్రమైన జ్వరం వస్తుందని నిపుణులు తెలిపారు. అంతే కాకుండా నల్లి కుట్టిన చోట నల్లటి మచ్చలు లేదా దద్దురు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. తలనొప్పి, శరీర నొప్పులు, వాంతులు, పొడి దగ్గు, తీవ్రమైన నీరసం, బలహీనత ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అయితే సరైన సమయంలో గుర్తించి చికిత్స అందించకపోతే ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చికిత్స ఆలస్యం అయితే మరణాల రేటు 30% వరకు పెరిగే అవకాశం ఉంటుందన్నారు.
స్క్రబ్ టైఫస్ తీవ్రత ఎక్కువైతే కిడ్ని సమస్యలు, శ్వాసకోసం సంబంధ సమస్యలు, రక్తపోటు పడిపోవడం, నర్వస్ సిస్టం ఇన్‌ఫెక్షన్లు, కోమాలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు వెల్లడించారు. అయితే లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకుంటే ప్రమాదం కేవలం 2% వరకు మాత్రమే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇది ఎక్కువగా పొలాల్లో పనిచేవారికి, పశువులను చూసుకునే వారికి, పచ్చిక, పొదలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో నివసించే వారికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎవరికి ఎక్కువగా సోకే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
పచ్చిక, పొదల్లో తిరిగేటప్పుడు పొడవైన దుస్తులు ధరించాలని వైద్యులు తెలిపారు. ఇంటి చుట్టుపక్కల చెత్త, అదుపు తప్పిన పొదలను శుభ్రం చేయాలి.నల్లి పెరిగే తేమ వాతావరణాన్ని నివారించాలి.శరీరంపై నల్లటి మచ్చ, దద్దుర్లు, జ్వరం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.ఈ సమాచారం అంతా.. మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. కావున మీరు వీటిని ఫాలో అయ్యే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.