NTV Telugu Site icon

World Bicycle Day 2022: సైకిల్ తొక్కండి.. ఆరోగ్యంగా ఉండండి

Cycling

Cycling

ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సైకిల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరిగిపోవడంతో అందరూ సైకిళ్లను పక్కనపెట్టేసి బైకులు, కార్లనే వాడుతున్నారు. దీంతో సైకిల్ వల్ల కలిగే ప్రయోజనాలను కోల్పోతున్నారు. అందుకే 2016లో ప్రపంచ సైక్లింగ్‌ అలయెన్స్‌ (డబ్ల్యూసీఏ), ఐరోపా సైక్లిస్ట్స్‌ సమాఖ్య (ఈసీఎఫ్‌) కలిసి ప్రతి ఏడాది ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితిని కోరాయి. ఈ మేరకు 2018, ఏప్రిల్ 12న న్యూయార్క్‌లో 193 దేశాలు పాల్గొన్న ఐక్యరాజ్య సమితి 72వ సాధారణ సదస్సులో ప్రపంచ సైకిల్ దినోత్సవ తీర్మానం ఆమెదించబడింది.

నిజానికి సైకిల్ తొక్కడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సైకిల్ తొక్కడం శరీర వ్యాయామానికి ఎంతో మంచిది. ప్రతిరోజూ సైకిల్ తొక్కితే బీపీ, మధుమేహం లాంటి వ్యాధులు దరిచేరవు. సైకిల్ తొక్కడం వల్ల శరీరం హుషారుగా పనిచేస్తుంది. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. రోజూ దాదాపు 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

Health Tips: నడుము నొప్పి వస్తుందా ? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

రోజూ ఒక గంట సైక్లింగ్ చేయడం వల్ల దాదాపు 300 కేలరీలు బర్న్ అవుతాయి. సైకిల్ తొక్కితే శరీరంలోని బెల్లీ ఫ్యాట్‌ ఇట్టే కరిగిపోతుంది. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు గుండె జబ్బులు, పక్షవాతం, అధిక రక్తపోటు, గుండెపోటు వంటి ప్రమాదాలు కూడా తగ్గుతాయి. నిత్యం సైకిల్ తొక్కే వారికి రాత్రిపూట మంచి నిద్ర పడుతుంది. సైక్లింగ్ ఊపిరితిత్తులను బలపరుస్తుంది. వాస్తవానికి సైకిల్ తొక్కేటప్పుడు సాధారణం కంటే ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ ఎక్కువగా చేరుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల పనితీరును బలపరుస్తుంది.