మారుతున్న జీవన పరిస్థితులు, ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏమవుతుంది. మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయని అందరికీ తెలుసు. ఒకటి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లిపోప్రోటీన్) అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్‌డీఎల్ (హై డెన్సిటీ లిపోప్రోటీన్) అంటారు. ఎల్‌డీఎల్ మన శరీరానికి కీడు చేస్తుంది. ఇది ఎక్కువగా ఉండడం అసలు మంచిదికాదు. ఎల్‌డీఎల్‌ను తగ్గించుకోకపోతే హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ.
దీని వల్ల అనేక దుష్పలితాలు కలుగుతాయి. హైబీపీ వస్తుంది. డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కొలెస్ట్రాల్ అనేది ఒక ఫ్యాట్ లాంటి పదార్థం. దీన్ని మన శరీరంలో లివర్ ఉత్పత్తి చేస్తుంది. దీంతో పలు విధులను నిర్వర్తిస్తుంది. అయితే ఎల్‌డీఎల్ పెరిగితే రక్త నాళాల్లో అది పేరుకుపోయి గుండె పోటు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అందువల్ల దాన్ని తగ్గించుకోవాలి. ఎల్‌డీఎల్ పెరగడం వల్ల గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు ఎక్కువవుతుంది. అదే మంచి కొలెస్ట్రాల్ రక్తంలోంచి చెడ్డ కొలెస్ట్రాల్‌ను తొలగించటానికి తోడ్పడుతుంది. రోజుకు అరగంట వ్యాయామం చేసినా కొలెస్ట్రాల్ తగ్గటానికి తోడ్పడుతుంది. శరీర సామర్థ్యాన్ని బట్టి ఇంకాస్త ఎక్కువసేపు చేసినా మేలు కలుగుతుంది.
వేగంగా నడవటం వల్ల గుండెకు రక్తసరఫరా మెరుగుపడుతుంది. అంతేకాదు, అదేపనిగా ఒత్తిడికి గురైతే రక్తపోటు పెరుగుతుంది. కొలెస్ట్రాల్ మోతాదులూ ఎక్కువ అవుతాయి. అవకాశం వున్నప్పుడల్లా విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ధ్యానం, నలుగురితో నవ్వుతూ గడపటం వంటివన్నీ విశ్రాంతినిచ్చేవే. మీకు చిరుతిండి తినాలనిపిస్తే గుప్పెడు బాదం పప్పు, కాజు, పిస్తా, అక్రోట్ల వంటివి తిని చూడండి. వీటిల్లో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించే కొవ్వులు దండిగా ఉంటాయి.
శరీర బరువుని అదుపులో వుంచుకోవడం ఎంతో మంచిది. చేపలు తినే అలవాటుంటే మీకు గుండె జబ్జులు దూరం. చేపల్లో ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటాన్ని నివారిస్తాయి. చేపలు ఆహారంలో భాగంగా చేసుకోండి. అంతేకాదు వాటిని వేయించి తినడం కంటే కూరగానే తినడం మంచిది.
రోజూ ఆహారంలో సజ్జలు, జొన్నలు, ఓట్స్, బార్లీ వంటివి ఉపయోగించండి. ఇవి తక్కువగా తిన్న ఎక్కువగా తిన్న ఫీలింగ్ కలిగిస్తాయి. ఎల్‌డీఎల్ తగ్గించుకోవడానికి ఆలివ్ ఆయిల్, అవకాడో, వెల్లుల్లి తదితర ఆహారాలను నిత్యం తీసుకోవాలి. కాలిఫ్లవర్, శనగలు, పచ్చి బఠానీలు, చిలగడ దుంపలు, బెండకాయలు తదితర కూరగాయలను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ చేరదు. మీ గుండె పదిలంగా వుంటుంది.