Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!

  • బల్బు మసకబారడానికి అసలు కారణం ఇదే
  • శుభ్రం చేసే ముందు తప్పనిసరి జాగ్రత్తలు
  • దుమ్ము, జిడ్డు తొలగించే సులభ చిట్కాలు
  • కొత్త బల్బు కొనకుండానే ప్రకాశవంతమైన వెలుగు
Led Bulb

Led Bulb

Home Hacks : సాధారణంగా ఇంట్లో బల్బులు , ట్యూబ్‌లైట్లు పాతబడే కొద్దీ కాంతి తగ్గడం లేదా మసకబారడం మనం గమనిస్తుంటాం. చాలామంది వెంటనే వోల్టేజ్ సమస్య అనుకుని లేదా బల్బు పాడైపోయిందని భావించి కొత్తది కొనడానికి సిద్ధపడతారు. అయితే ప్రతిసారీ కొత్త బల్బు కొనవలసిన అవసరం లేదు. బల్బుల ఉపరితలంపై పేరుకుపోయే దుమ్ము, ధూళి , నూనె జిడ్డు వల్ల కూడా కాంతి తీవ్రత దాదాపు సగానికి పైగా తగ్గిపోతుంది. కొన్ని చిన్నపాటి చిట్కాలతో వీటిని శుభ్రం చేసుకుంటే మునుపటి లాగే ప్రకాశవంతమైన వెలుతురును సొంతం చేసుకోవచ్చు.

బల్బుల కాంతి తగ్గడానికి అసలు కారణమేంటి?

గతంలో వాడిన సాంప్రదాయ ఇన్కాండిసెంట్ బల్బులు తక్కువ కాలం మాత్రమే పనిచేసేవి కాబట్టి అవి త్వరగా కాలిపోయి కొత్తవి మార్చేవాళ్ళం. కానీ నేటి ఆధునిక LED బల్బులు సుమారు 25 సంవత్సరాల సుదీర్ఘ ఆయుర్దాయంతో వస్తున్నాయి. ఇంత ఎక్కువ కాలం ఒకే చోట అమర్చి ఉండటం వల్ల వాటిపై క్రమంగా దుమ్ము మందంగా పేరుకుపోతుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం ఒకేలా ఉన్నప్పటికీ, ఆ దుమ్ము పొర వెలుగును బయటకు రానివ్వక కాంతి మసకగా కనిపిస్తుంది.

భద్రతే ప్రథమ ప్రాధాన్యత.. శుభ్రం చేసే ముందు జాగ్రత్తలు

విద్యుత్ పరికరాలను శుభ్రపరిచేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు చాలా అవసరం. ముందుగా స్విచ్‌తో పాటు మెయిన్ పవర్ సప్లైని పూర్తిగా ఆపివేసి, బల్బు లేదా ట్యూబ్‌లైట్ వెలిగి ఉంటే అది పూర్తిగా చల్లబడే వరకు కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు ఆగాలి. పాత బల్బులతో పోలిస్తే LED బల్బులు తక్కువ వేడెక్కినప్పటికీ, అవి చల్లారిన తర్వాతే తాకడం సురక్షితం. అలాగే శుభ్రం చేసే సమయంలో బల్బ్ హోల్డర్ లేదా లోపలి వైరింగ్ భాగాల్లోకి నీరు లేదా ఏ విధమైన ద్రవాలు వెళ్లకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

పొడి దుమ్మును వదిలించే సులభమైన మార్గం

సాధారణ హాల్ లేదా పడుకునే గదుల్లోని బల్బులపై ఉండే పొడి దుమ్మును తొలగించడం చాలా తేలిక. దీని కోసం శుభ్రమైన, పొడి మైక్రోఫైబర్ వస్త్రం లేదా డస్టింగ్ గ్లోవ్‌ను ఉపయోగించి బల్బు ఉపరితలం మొత్తాన్ని మెల్లగా తుడవాలి. ఇలా చేయడం వల్ల బల్బుపై ఉన్న దుమ్ము సులభంగా రాలిపోయి, వెలుతురు మునుపటి కంటే చాలా ప్రకాశవంతంగా మారుతుంది.

వంటగది బల్బులపై జిడ్డును తొలగించే చిట్కాలు

వంటగదిలో ఉండే బల్బులు , ట్యూబ్‌లైట్లపై పొగ, నూనె జిడ్డు ఎక్కువగా పేరుకుపోతుంటాయి. వీటిని వదిలించడానికి రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం కలిపి తయారుచేసిన పేస్ట్‌ను జిడ్డు భాగంలో రాసి రెండు నిమిషాల తర్వాత తడి గుడ్డతో తుడిచేస్తే ఫలితం ఉంటుంది. అలాగే అర కప్పు నీటిలో రెండు మూడు స్పూన్ల తెల్ల వెనిగర్ లేదా కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ కలిపి, ఆ నీటిలో గుడ్డను ముంచి బాగా పిండివేసి తుడిచినా కూడా నూనె మరకలు తక్షణమే కరిగిపోతాయి.

శుభ్రం చేసిన తర్వాత చేయాల్సిన పని

ఏ రకమైన పద్ధతిలో శుభ్రం చేసినప్పటికీ, బల్బులు , ట్యూబ్‌లైట్లు పూర్తిగా ఆరిపోయే వరకు కనీసం 15 నిమిషాల పాటు స్విచ్ ఆన్ చేయకూడదు. తడి ఆరిన తర్వాత లైట్ ఆన్ చేస్తే మీ ఇల్లు మళ్లీ కొత్త లైట్లతో వెలిగిపోతుంది.