Chikungunya Vaccine: ‘చికున్‌గున్యా’ దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతదేశంలో చాలా మంది ఈ చికున్‌గున్యా జ్వరాల బారినపడుతుండటం మనం చూస్తూనే ఉంటాం. దోమకాటు ద్వారా ఈ వైరస్ మానవుడిలోకి ప్రవేశించి తీవ్రమైన జ్వరానికి, కాళ్లు, కీళ్ల నొప్పులకు కారణం అవుతుంది. అయితే ఈ జ్వరానికి సంబంధించి లక్షణాలను అనుసరించి ట్రీట్మెంట్ చేసే విధానం మాత్రమే అందుబాటులో ఉంది. కొన్ని రోజుల్లో మానవశరీరం వైరస్ కు వ్యతిరేకంగా యాంటీబాడీలను తయారు చేసుకుని, వ్యాధిని నిర్మూలిస్తుంది. అయితే కొన్ని సార్లు ఈ వ్యాధి ప్రాణాంతకంగా కూడా మారుతుంటుంది.
అయితే తాజాగా చికున్‌గున్యా విషయంలో గుడ్ న్యూస్ వెలువడింది. చికున్‌గున్యాకు వ్యతిరేకంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ సానుకూల ఫలితాలను చూపించినట్లు తేలింది. ఫ్రెంచ్-ఆస్ట్రియన్ డ్రగ్ మేకర్ ‘వాల్నేవా’ ఈ వ్యాక్సిన్ తయారు చేస్తోంది. ట్రయల్స్ లో ఈ వ్యాక్సిన్ మంచి ఫలితాలను చూపించినట్లు మంగళవారం ఓ అధ్యయనం తెలిపింది. VLA1553 అని పిలువబడే వ్యాక్సిన్ ను అమెరికా, కెనడాల్లో ఆమోదం కోసం దరఖాస్తు చేసుకుంది.
Read Also: Chiranjeevi : చిరంజీవి కోసం అదిరిపోయే టైటిల్ ను ఫిక్స్ చేసిన డైరెక్టర్ వశిష్ఠ..?
ప్లాసిబో కంట్రోల్డ్ ఫేస్, మూడో దశ ట్రయల్స్‌లో బలహీన పరిచిన వైరస్ ని వ్యాక్సిన్ గా అందించి, అది ఎంత మేర మానవ రోగనిరోధక వ్యవస్థ మేల్కొనిపేలా చేస్తుందనే ఫలితాలను రాబట్టారు. మొత్తం 266 మంది వ్యక్తులపై ఈ టీకా ప్రయోగించగా.. 263 అంటే 99 శాతం మంది చికున్‌గున్యా వైరస్ కు వ్యతిరేకంగా, రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీలను తయారు చేసుకున్నట్లు, వైరస్ ని తటస్థీకరించినట్లు తేలిందని లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. విస్తృత ట్రయల్స్ లో భాగంగా 4100 మంది ఆరోగ్యవంతులపై టీకాను ప్రయోగించగా.. ఈ సింగిల్ షాట్ వ్యాక్సిన్ ఇతర టీకాల మాదిరిగానే కొన్ని సైడ్ ఎఫెక్టులతో సురక్షితమైనదిగా తేలింది. కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే తీవ్రమైన సైడ్ ఎఫెక్టులకు గురయ్యారని, ఆ తరువాతా వారు కూడా కోలుకున్నట్లు స్టడీ వెల్లడించింది.
సాధారణంగా వాతావరణ మార్పుల సమయంలో దోమల కాటువల్ల ఈ చికున్‌గున్యా వైరస్ ఎటాక్ అవుతుంది. చికున్‌గున్యా మొదటిసారిగా 1952లో టాంజానియాలో గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం అప్పటి నుంచి ఇది 110 కంటే ఎక్కువ దేశాలలో నమోదైంది. కొన్ని సార్లు ఆఫ్రికా, ఆసియా, అమెరికాల్లో చికున్‌గున్యా తీవ్ర వ్యాప్తిని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాధికి వ్యాక్సిన్ రావడంతో ఇకపై చికున్‌గున్యాను రూపుమాపే అవకాశం ఏర్పడింది. ఆగస్టు చివరిలో వ్యాక్సిన్‌ను ఆమోదించడంపై US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకోవచ్చని వాల్నేవా ఆశాభావం వ్యక్తం చేసింది.