NTV Telugu Site icon

Mosquito: హైదరాబాద్‌లో దోమలు స్వైర విహారం.. కారణమిదేనా?

Mosquito

Mosquito

హైదరాబాద్‌ నగరంలో మునుపెన్నడూ లేనంతగా దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. బాబోయ్.. అంటూ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దోమల నివారణకు పగడ్బందిగా ఏర్పాట్లు చేసుకుంటున్నా చావడం లేదు. జలగల్లా రక్తం పీల్చేస్తున్నాయి. దీంతో ఒళ్లంతా పెద్ద పెద్దగా దద్దుర్లు ఏర్పడుతున్నాయి.

వాస్తవానికి వర్షాకాలంలో దోమలు రావడం మామూలు విషయమే గానీ.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా రాత్రి, పగలు తేడా లేకుండా స్వైర విహారం చేస్తున్నాయి. ఎవరి నోట విన్నా.. ఇదే మాట వినిపిస్తోంది. నగరవాసులు అంతగా దోమలతో నరకం అనుభవిస్తున్నారు. ఇక పిల్లలు, రోగులు, పెద్ద వాళ్లైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. దోమల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే దోమలు ఇంతగా విజృంభించడానికి బలమైన కారణమే ఉందంటున్నారు నిపుణులు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులే కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో చాలా విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగలంతా విపరీతమైన వేడి.. ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. సాయంత్రం అయ్యేసరికి మాత్రం వర్షం దంచికొడుతోంది. ఇలా భిన్నమైన వాతావరణం ప్రస్తుతం నెలకొంది. వర్షాకాలంలో పెద్దగా ఫ్యాన్లు, ఏసీలు ఉపయోగించరు. కానీ అందుకు భిన్నమైన పరిస్థితులే ఉన్నాయని చెప్పకతప్పదు. రాత్రి, పగలు తేడా లేకుండా ఇప్పుడు ఫ్యాన్లు, ఏపీలు వాడుతున్నారు. ఈ మధ్య విద్యుత్ వినియోగం కూడా నగరంలో బాగా పెరిగినట్లుగా గణాంకాలు కూడా చెబుతున్నాయి. అంటే నగరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. చెప్పకనే చెప్పొచ్చు. ఇలా ఒక్క హైదరాబాద్ నగరమే కాదు.. రాష్ట్రమంతా కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లతో ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రులకు ఇలాంటి కేసులే ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు కూడా చెబుతున్నారు.

దోమలతో వచ్చే వ్యాధులు ఇవే..
1. మలేరియా
2. మెదడు వాపు వ్యాధి
3. ఫైలేరియా (బోదవ్యాధి)
4. డెంగ్యూ జ్వరం
5. చికెన్ గున్యా
6. కాలా జ్వరము
7. లింఫాటిక్ ఫైలేరియాసిస్