శరీరం ఆరోగ్యంగా ఉండటానికి రోజూ ఉప్పు అవసరం అయినట్లే.. చక్కెర ఆరోగ్యానికి అంతే ముఖ్యమైనది. చక్కెర మన శరీరానికి శక్తిని అందిస్తుంది. అయితే, చక్కెర తినడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు సూచిస్తుంటారు. చక్కెర ఎక్కువగా వాడితే హైబీపి, బరువు పెరగటం, షుగర్, కొవ్వు, కాలేయ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. చక్కెరను ప్రాసెస్ చేస్తారు కాబట్టి పోషక విలువలు పోతాయి. అందుకే చాలా మంది చెక్కెరకు దూరంగా ఉంటారు. అందువల్ల, చక్కెరకు బదులుగా బెల్లం మీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. బెల్లం కూడా పరిమిత పరిమాణంలో తినాలి. బెల్లాన్ని చక్కెర లాగా ప్రాసెస్ చేయరు. చెరకు రసాన్ని ఉడకబెట్టి బెల్లం తయారు చేస్తారు. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి అనేక విటమిన్స్, ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. అందుకే బెల్లాన్ని చక్కెర కంటే ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు.
బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
బెల్లంలో అనేక పోషకాలు లభిస్తాయి. బెల్లంలో ఐరన్ మెండుగా ఉంటుంది. ఇది రక్తహీనతను అధిగమించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, ఇందులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. ఈ ప్రయోజనాలు చక్కెర తినడం వల్ల లభించవు. బెల్లంలోని పోషకాలు ఎముకలు, రక్తం, మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
Also Read:CM Revanth Reddy: నేను కొందరికి నచ్చకపోవచ్చు.. నా పని నేను చేస్తున్నా
బెల్లంలో అనేక యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తాయి. చక్కెరతో పోలిస్తే బెల్లం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నెమ్మదిగా పెరుగుతుంది. చక్కెర తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ముఖ్యంగా మధుమేహ రోగులకు చక్కెర వినియోగం హానికరం అంటున్నారు నిపుణులు. మొత్తానికి చక్కెర వాడడం కంటే బెల్లం వాడడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తు్న్నారు.