Eggs Damaging Heart Health: ప్రతిరోజూ గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటారు. గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఏ, డీ, ఈలతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి కొవ్వులు ఉంటాయి. తెల్లసొనలో అధికశాతం ప్రోటీన్లు ఉంటాయి. పౌష్టికాహార లోపం అధిగమించాలనుకునేవారు గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. గుడ్లు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా తినే అల్పాహారం. అయితే, JAMA నెట్‌వర్క్‌లో ప్రచురించిన “అసోసియేషన్ ఆఫ్ డైటరీ కొలెస్ట్రాల్ అండ్ ఎగ్ కన్సంప్షన్ విత్ ఇన్సిడెంట్ కార్డియోవాస్కులర్ డిసీజ్ అండ్ మోర్టాలిటీ” అనే కొత్త అధ్యయనం సంచలన విషయాలు వెల్లడించింది. రోజూ గుడ్డు తింటే గుండె జబ్బులు, మరణ ప్రమాదాన్ని పెంచుతుందని ఈ అధ్యయనం సూచిస్తుంది. అయితే, గుడ్లు తినడం వల్ల గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందా లేదా అనే వివాదం ఎప్పటి నుంచో ఉంది. చాలా మంది నిపుణులు, వైద్యులు ఈ తాజా అధ్యయన వాదనలతో విభేదిస్తున్నారు.
READ MORE: Supreme Court : మిస్సింగ్ పిల్లల కోసం ప్రత్యేక చర్యలు అవసరం
తాజా అధ్యయనం ప్రకారం.. 17.5 సంవత్సరాల కాలంలో రోజూ సగం గుడ్డు తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం 6 శాతం, మరణ ప్రమాదం 8 శాతం పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. గుడ్లలోని కొలెస్ట్రాల్ దీనికి కారణమని చెబుతున్నారు. చికాగోలోని నార్త్‌వెస్ట్రన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు 29,615 మందిపై ఈ ప్రయోగం నిర్వహించారు. ఆరు US అధ్యయనాల నుంచి డేటాను విశ్లేషించారు. ఈ అధ్యయనాలు పరిశీలనాత్మకమైనవి.. అన్నీ పరీక్షల అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. మొదట పరిశోధనలో భాగంగా ఎంపిక చేసిన ప్రజల ఆహార అలవాట్ల గురించి తెలుసుకున్నారు. రోజుకు ఎన్ని గుడ్లు తింటున్నారో అడిగారు. ఒక పెద్ద గుడ్డులో దాదాపు 186 మి.గ్రా కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే.. వారు రోజూ ఎంత వ్యాయామం చేశారనే అంశాన్ని సైతం పరిగణలోకి తీసుకున్నారు. ఈ సమాచారమంతా తీసుకున్న తర్వాత.. ఒక్కొక్కరిని సగటున 17.5 సంవత్సరాలు ట్రాక్ చేశారు. బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ ప్రకారం.. ప్రతి 300 మి.గ్రా కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని 17% , మరణ ప్రమాదాన్ని 18% పెంచుతుంది. గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలను, కొలెస్ట్రాల్‌ను పోల్చారు. గుడ్లలోని కొలెస్ట్రాల్ కంటెంట్ ఈ ప్రమాదాన్ని పెంచడానికి ప్రధాన కారణమని కనుగొన్నారు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.