మనందరం సాధారణంగా చాయ్ లేదా గ్రీన్ టీ తాగేటప్పుడు టీ పొడి లేదా గ్రీన్ టీ ఆకులను నీటిలో మరిగించి తాగుతాం. గత కొన్నేళ్లుగా వేడి నీటిలో లేదా పాలలో టీ బ్యాగ్‌లను నేరుగా ముంచి తాగే అలవాటు విస్తరించింది. అయితే, ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేడి టీ లేదా వేడి పాలలో ప్రీమియం టీ బ్యాగ్‌ను ముంచినప్పుడు ఒక్క కప్పులోనే సుమారు 11.6 బిలియన్ మైక్రోప్లాస్టిక్స్, 3.1 బిలియన్ నానోప్లాస్టిక్స్ విడుదలవుతున్నాయని అధ్యయనాలు వెల్లడించాయి. ఇవి టీ బ్యాగ్‌ల తయారీలో ఉపయోగించే నైలాన్, పాలిస్టర్ వంటి ప్లాస్టిక్ పదార్థాల నుంచే వస్తున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
‘బయోడిగ్రేడబుల్’ అని చెప్పబడుతున్న కొన్ని టీ బ్యాగ్‌లలో కూడా వాస్తవానికి పాలీ లాక్టిక్ యాసిడ్ (PLA) అనే ప్లాస్టిక్ ఉనికిలో ఉండే అవకాశం ఉన్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఈ మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి వెళ్లి జన్యు లోపాలు, ప్రజనన సమస్యలు, హార్మోన్ అసమతుల్యత,రక్త, ఊపిరితిత్తుల పనితీరులో మార్పులు వంటి ఆరోగ్య సమస్యలను కలిగించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే ఈ సూక్ష్మ కణాలు మానవ కణాల్లోకి ప్రవేశించి గట్ బారియర్‌ను దెబ్బతీయగలవని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఈ సమాచారం మొత్తాన్ని ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అధ్యయనాల ఆధారంగా తెలియజేస్తున్నాము. ఇందులో ఏదైనా సందేహం ఉన్నట్లయితే, తప్పనిసరిగా పోషకాహార నిపుణులు (న్యూట్రిషనిస్ట్) లేదా వైద్యులను సంప్రదించడం మంచిది.