Mango Sharbat : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరికీ గుర్తొచ్చేది తియ్యని మామిడి పండ్లు. ఎండల వేడి నుంచి ఉపశమనం పొందడానికి, మన శరీరాన్ని చల్లబరిచే పానీయాలు ఎంతో అవసరం. అటువంటి వాటిలో ‘మామిడి పండ్ల షర్బత్’ ఒకటి. కేవలం పానీయంగానే కాకుండా, డెజర్ట్‌లా కూడా దీనిని ఆస్వాదించవచ్చు. దీని తయారీ విధానం చాలా సులభం.
కావలసిన పదార్థాలు:
- మామిడి పండు ముక్కలు: 1 కప్పు (బ్లెండ్ చేయడానికి), అర కప్పు (చిన్న ముక్కలుగా కోసినవి)
- పాలు: సుమారు 2 నుండి 3 కప్పులు (చిక్కనివి)
- సబ్జా గింజలు: 1 టీస్పూన్ (నానబెట్టినవి)
- కండెన్స్‌డ్ మిల్క్: 200 గ్రాములు (తీపి కోసం)
- కుంకుమపువ్వు: కొన్ని రేకులు (గోరువెచ్చని నీటిలో నానబెట్టినవి)
- ఐస్ క్యూబ్స్: తగినన్ని
- గార్నిషింగ్ కోసం: దానిమ్మ గింజలు, పిస్తా ముక్కలు, బాదం ముక్కలు
తయారీ విధానం:
1. ప్రాథమిక ఏర్పాట్లు:
ముందుగా ఒక టీస్పూన్ సబ్జా గింజలను నీటిలో నానబెట్టుకోవాలి. అలాగే కొన్ని కుంకుమపువ్వు రేకులను గోరువెచ్చని నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి.
2. మామిడి పండ్ల మిశ్రమం:
ఒక బ్లెండర్ జార్ తీసుకుని అందులో ఒక కప్పు మామిడి పండు ముక్కలు , సుమారు ఒకటిన్నర కప్పుల పాలు పోసి మెత్తగా బ్లెండ్ చేయాలి.
3. షర్బత్ తయారీ:
బ్లెండ్ చేసిన ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో మిగిలిన పాలను కూడా పోసి కలపాలి. తీపి కోసం 200 గ్రాముల కండెన్స్‌డ్ మిల్క్ వేయాలి. ఒకవేళ కండెన్స్‌డ్ మిల్క్ లేకపోతే పంచదార కూడా వాడుకోవచ్చు, కానీ కండెన్స్‌డ్ మిల్క్ మంచి రుచిని ఇస్తుంది.
4. ఫ్లేవర్ , కూలింగ్:
ఇందులో ముందుగా నానబెట్టుకున్న కుంకుమపువ్వు నీటిని, కొన్ని ఐస్ క్యూబ్స్ , నానబెట్టిన సబ్జా గింజలను వేసి బాగా కలపాలి.
5. ఫైనల్ టచ్:
షర్బత్ రుచిని మరింత పెంచడానికి అందులో చిన్నగా కోసిన మామిడి పండు ముక్కలు, దానిమ్మ గింజలు, సన్నగా తరిగిన బాదం , పిస్తా ముక్కలను వేసి నెమ్మదిగా కలపాలి.
అంతే..! ఎంతో రుచికరమైన, రిఫ్రెషింగ్ మామిడి పండ్ల షర్బత్ సిద్ధం. దీనిని గ్లాసుల్లోకి తీసుకుని చల్లచల్లగా సర్వ్ చేయండి. ఎండలో బయట నుండి వచ్చినప్పుడు లేదా ఇంట్లో ఏదైనా పార్టీ ఉన్నప్పుడు కూడా దీనిని డెజర్ట్‌లా అందించవచ్చు. మామిడి పండ్ల సీజన్ ముగిసేలోపు మీరు కూడా ఈ రుచిని తప్పక ప్రయత్నించండి..
