Fish Pickle: సాధారణంగా చాలా మంది నాన్-వెజ్ పచ్చళ్లంటే చికెన్, మటన్ లేదా రొయ్యల పచ్చడిని ఎక్కువగా ఇష్టపడతారు. కానీ చేపల పచ్చడి విషయానికి వస్తే చాలామందికి ఒక చిన్న భయం ఉంటుంది.. అదే ‘నీచు వాసన’. ఎంత బాగా చేసినా ఆ వాసన వస్తుందేమోనని వెనకడుగు వేస్తుంటారు. అయితే ఎటువంటి నీచు వాసన లేకుండా, ముక్క మెత్తబడకుండా ఆరు నెలల పాటు నిలువ ఉండేలా పక్కా కొలతలతో చేపల పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Video Call: 45, 55 ఏళ్ల మహిళల న్యూడ్ వీడియో కాల్ దందా.. పక్కా ప్లాన్ ప్రకారం ఇలా..
కావలసిన పదార్థాలు:
చేప ముక్కలు: 1 కేజీ (వరంజరం, కొర్రమీను లేదా టూనా వంటి గట్టి కండ గల చేపలు ఉత్తమం).
నూనె: 300 – 400 ml (పల్లీ నూనె లేదా నువ్వుల నూనె).
మసాలా పొడి: ధనియాలు (1 టేబుల్ స్పూన్), మెంతులు (అర టేబుల్ స్పూన్), జీలకర్ర (1 టీస్పూన్).
కారం: 60 గ్రాములు (అర కప్పు).
ఉప్పు: 50 గ్రాముల కల్లుప్పు (లేదా 40 గ్రాముల సాల్ట్).
అల్లం వెల్లుల్లి పేస్ట్: 50 గ్రాములు.
నిమ్మరసం: 50-60 ml (సుమారు 3-4 నిమ్మకాయలు).
తయారీ విధానం..
ముందుగా చేపలను ఉప్పు, నిమ్మరసంతో నీచు వాసన లేకుండా కడిగి, మీడియం సైజ్‌లో ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత శుభ్రం చేసిన ముక్కలకు అర టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె పట్టించి పక్కన పెట్టాలి. ఇప్పుడు మసాలా తయారు చేసుకోవాలి. దాని కోసం ధనియాలు, మెంతులు, జీలకర్రను దోరగా వేయించి పొడి చేయాలి. అలాగే ఉప్పులోని తేమ పోయేలా వేయించి, మసాలా పొడితో కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇందులో కారం, పసుపు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి కలపాలి.
తర్వాత కడాయిలో నూనె వేడి చేసి, చేప ముక్కలను క్రిస్పీగా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించాలి. అదే నూనెలో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి స్టవ్ ఆపేయాలి. ఈ వేడి నూనెలో ముందుగానే సిద్ధం చేసుకున్న మసాలా కారం, వేయించిన చేప ముక్కలను వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాతే నిమ్మరసం కలపాలి. పచ్చడి కలిపిన తర్వాత రెండు రోజుల పాటు ఊరనివ్వాలి. అప్పుడే ముక్కకు మసాలాలు పట్టి రుచి పెరుగుతుంది. అలాగే పచ్చడిని గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకుంటే ఆరు నెలల వరకు తాజాగా ఉంటుంది. చేప ముక్కలను వేయించేటప్పుడు చిన్న స్పూన్‌తో నిదానంగా కదపాలి, లేదంటే ముక్కలు విడిపోయే ప్రమాదం ఉంది. ఇంతే సింపుల్‌గా చేపల పచ్చడిని నీచు వాసన రాకుండా పెట్టుకోండి.
